తండ్రిపై కొడుకుల మమకారం

Sons Leave Father On Road For Assets in YSR Kadapa - Sakshi

కన్న తండ్రిని రోడ్డుపై వదిలేసిన వైనం

ఆస్తి అమ్మి డబ్బులు ఇవ్వలేదని కొడుకుల నిర్వాహకం

మూడు రోజులపైబడి పస్తులున్న ఓ వృద్ధు్ధడు

మానవత్వం మాయమవుతోంది..పేగు బంధం రోడ్డుపైకి చేరుతోంది. కన్నవాళ్లు కానివాళ్లు అవుతున్నారు. డబ్బే సర్వçస్వం అని భావించే సుపుత్రులు చూపే మమ ‘కారానికి’ తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలు, చెట్లకిందకు చేరుతున్నారు. స్వర్గం తల్లిదండ్రుల పాదాల కింద ఉందంటారు..అలాంటి వారిని బతికుండగానే నరకం చూపుతున్నారు కొందరు ప్రభుద్ధులు. ఇదే కోవలో లక్కిరెడ్డిపల్లెలో 80 ఏళ్ల వెంకటేష్‌ను కొడుకులు డబ్బు కోసం మత్తుమందు ఇచ్చి రోడ్డుపై వదిలేశారు.

వైఎస్‌ఆర్‌ జిల్లా , లక్కిరెడ్డిపల్లె : మండలంలోని అనంతపురం గ్రామం ప్యారంవాండ్లపల్లెకు చెందిన మొగర్తి వెంకటేష్‌కు ముగ్గురు కొడుకులు, ఒక కుమార్తె. సర్వస్వం వారే అని భావించి వయస్సులో ఉన్నంత వరకు ఊరూర, ఇంటింటికి తిరిగి కూలి పనులు చేసి పిల్లలను ప్రయోజకులను చేశాడు. ప్రస్తుతం ఆయన వయస్సు 80 సంవత్సరాలు. బిడ్డలను నమ్మి ఉన్న భూములను వారి పేరిట రాయగా ఇద్దరు కుమారులు ఆ పొలంను అమ్మేసి తండ్రిని గెంటేశారు. లక్కిరెడ్డిపల్లెలో ఆయన పేరిట మరొక మూడన్నర సెంట్ల ఇంటి స్థలం ఉండగా అది కూడా కావాలని కుమారులు నడవలేని స్థితిలో ఉన్న తండ్రిని చిత్రవధ చేస్తున్నారు. తండ్రికి మత్తు సూదులు వేసి లక్కిరెడ్డిపల్లె సమీపంలోని మర్రిచెట్టు వద్ద మూడు రోజుల క్రితం వదిలేసి వెళ్లిపోయారు. ముగ్గురు కుమారుల్లో పెద్దకుమారుడు రమణయ్య మర్రిచెట్టు సమీపంలోని రవీంద్రనగర్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు.

తండ్రి వెంకటేష్‌ పెద్ద కుమారుడిని సక్రమంగా చూసుకోకపోవడంతో ఆయనవైపు కన్నెత్తి కూడా చూడలేదు. రెండవ కుమారుడు చిత్తూరు జిల్లా మంగళం పేట వద్ద నివాసం ఉంటున్నాడు.  మూడవ కుమారుడు నందలూరులో నివాసం ఉంటున్నాడు. కుమార్తె లక్కిరెడ్డిపల్లెలో నివాసం ఉంటోంది. అయితే రెండవ, మూడవ కుమారులు, కోడల్లు, కుమార్తెలు అందరిదీ ఒకటే దారి. తండ్రి పేరు మీద ఉన్న మూడన్నర సెంట్ల స్థలం అమ్మి తమకు ఇవ్వాలని డిమాండ్‌. అయితే గతంలోనే తండ్రి పేరిట ఉన్న పొలాన్ని కుమారులు అమ్ముకొని రోడ్డున పడవేశారు. తన ఆలనా పాలనా చూసుకోవడానికి భార్య కూడా లేదు. ఇంటి స్థలాన్ని కూడా రాసిస్తే చూసుకునే దిక్కు ఎవ్వరని వెంకటేష్‌ వాపోతున్నాడు.  మూడు రోజులుగా రోడ్డు పక్కన తిండి తిప్పలు లేకుండా పడిఉండడంతో స్థానికులు గమనించి శుక్రవారం ఉదయం వేమయ్య కుటుంబ సభ్యులు ఆయనకు తిండి పెట్టి, పోలీసులుకు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. దీంతో పాటు పాత్రికేయులకు కూడా సమాచారం ఇచ్చారు. రెవెన్యూ పోలీసుల చొరవతో వెంకటేష్‌ కుమారులను, బంధువులను పిలిపించి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top