పరీక్ష రాసినా ఫలితంలేదు!

SKU Students Suffering With Degree Results - Sakshi

ఎస్కేయూ డిగ్రీ ఫలితాలు తప్పులతడక

నాలుగేళ్లుగా ఇదే తంతు

నష్టపోతున్న వేలాది మంది విద్యార్థులు

ఎస్కేయూ :శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం డిగ్రీ ఫలితాలు విడుదల చేసినా ఫలితంలేకపోతోంది.  విద్యార్థులకు తప్పుల తడకన మార్కులు వస్తున్నాయి. కాలం చెల్లిన సాఫ్ట్‌వేర్‌తో సమస్య వస్తోంది. ఫలితాలు విడుదలైనప్పుడు పాస్‌ అయిన విద్యార్థులు ఫెయిల్‌ అని, ఫెయిల్‌ అయిన వారు పాస్‌ అయినట్లు వస్తోంది. గైర్హాజరైన వారు సైతం ఏకంగా ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. నాలుగేళ్లుగా ఇదే తంతు.. ఈ ఏడాది 40 వేల మంది సెమిస్టర్‌ ఫరీక్షలు రాశారు. ఇందులో అధికశాతం విద్యార్థుల మార్కులు జంబ్లింగ్‌ అయ్యాయి. ఏటా ఇలానే జరుగుతున్నా సమస్య పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు చేపట్టలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పరిశీలించకుండానే ఫలితాలు విడుదల :  డిగ్రీ 5వ సెమిస్టర్‌లో మార్కుల నమోదులో తప్పిదాలు చోటు చేసుకోవడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న వర్సిటీ యాజమాన్యం ముగ్గురు ప్రొఫెసర్లతో కూడిన కమిటీని సమగ్ర దర్యాప్తునకు  నియమించింది. ప్రొఫెసర్‌ రెడ్డి వెంకటరాజు కన్వీనర్‌గా ఉన్న కమిటీలో ప్రొఫెసర్‌ ఏవీ రమణ, ప్రొఫెసర్‌ చింతా సుధాకర్‌ సభ్యులుగా ఉన్నారు. కమిటీ సమగ్ర దర్యాప్తు ప్రారంభించింది. 

ఫలితాల్లో వ్యత్యాసం  :
అవార్డు షీట్‌ (ఎగ్జామినర్‌ వేసిన మార్కులు) ఆధారంగా చెక్‌లిస్ట్‌లో మార్కులు పొందుపరుస్తారు. చెక్‌లిస్ట్‌లోని మార్కుల ఆధారంగా ట్యాబులేషన్‌లో మార్కులు నమోదవుతాయి. అనంతరం మార్క్స్‌కార్డులు ప్రింట్‌ అవుతాయి. చెక్‌లిస్ట్‌లో ఉన్న మార్కులకు ట్యాబులేషన్‌లో నమోదైన మార్కులకు వ్యత్యాసం అధికంగా ఉంది. మూడో సబ్జెక్టులో నమోదైన మార్కులు తక్కిన అన్ని సబ్జెక్టులకూ యథాతథంగా పునరావృతమయ్యాయి. ఆ సబ్జెక్టులో ఫెయిల్‌ అయితే తక్కిన అన్ని సబ్జెక్టుల్లోనూ ఫెయిల్‌ అయినట్లే.  ఈ విధంగా మార్కులు నమోదు అయినట్లు కమిటీ నిర్ధారణకు వచ్చింది. వాస్తవానికి ఫలితాలు విడుదలకు  ముందు చెక్‌లిస్ట్‌లోని మార్కులు, ట్యాబులేషన్‌లోని మార్కులను పరిశీలించిన తర్వాత ఫలితాలు విడుదల చేయాలి.

కాలం చెల్లిన సాప్ట్‌వేర్‌ :
2015లో సెమిస్టర్‌ విధానం అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి ఇదే పరిస్థితి తలెత్తుతోంది. మార్కుల నమోదు వినియోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌ కాలం చెల్లింది. అయినా దాన్నే వాడుతున్నారు. గతంలో ఏడాది పరీక్షలు కాబట్టి..తక్కువ డేటాబేస్‌ సరిపోయేది. ప్రస్తుతం సెమిస్టర్‌ విధానం కొనసాగుతోంది. అయినా వర్సిటీ  సాఫ్ట్‌వేర్‌ సామర్థ్యాన్ని పెంచలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డిజిటలైజేషన్‌ విధానంలో పరీక్షల విభాగంలో పూర్తిగా సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉందనే భావన వ్యక్తమవుతోంది.

రెండు సార్లు ఫలితాలువిడుదల చేసినా...
డిగ్రీ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి.  విద్యార్థులందరూ ఫలితాలు చూసుకున్నారు. ఫలితాలు  తప్పులతడక వచ్చాయని ఫిర్యాదులు అందాయి. దీంతో సోమవారం తిరిగి ఫలితాలు విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన ఫలితాలు పరీక్షలకు గైర్హాజరయిన వారు సైతం ఉత్తీర్ణత చెందినట్లు వచ్చింది. దీంతో సమస్య మొదటికొచ్చింది. కమిటీ అవార్డు షీట్‌లోని ప్రతి విద్యార్థీ మార్కులను పరిశీలిస్తోంది. వారం రోజుల్లో మొత్తం అన్నీ మార్కులను పరిశీలించి.. తుది ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top