ఒంటరి ఏనుగు హల్‌చల్‌

Single Elephant Attacks on Crops in Chittoor - Sakshi

ఎదురుదాడికి దిగుతున్న వైనం

రంగనాయకచెరువు గ్రామస్తులపై దాడి

పలువురికి గాయాలు

యాదమరి/చిత్తూరు జిల్లా పరిషత్‌ : మండల ప్రజలకు ఒంటరి ఏనుగు కునుకులేకుండా చేస్తోంది. డీకే చెరువు, రంగనాయకుల చెరువు, పెరగాండ్లపల్లె, అయ్యప్ప వూరు, కూసూరు గ్రామాలు అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్నాయి. నెల రోజులుగా ఏనుగుల గుంపు ఈ గ్రామాల్లో సంచరిస్తూ పంట నష్టం కలిగిస్తోంది. అటవీ అధికారులు తీసుకున్న చర్యల కారణంగా కొన్ని రోజుల క్రితం ఏనుగుల గుంపు గుడిపాల మండలం వైపు వెళ్లిపోయినా వాటి నుంచి విడిపోయిన ఒంటరి ఏనుగు మాత్రం భయబ్రాంతులకు గురిచేస్తోంది. అది ఆదివారం రాత్రి రంగనాయక చెరువు గ్రామంలోని పొలా ల్లోకి ప్రవేశించి పంటలను నాశనం చేసింది. రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే అది గ్రామం వైపు వస్తుండడంతో రైతులు, యువకులు టపాకాయలు పేల్చారు. ఆగ్రహించిన ఏనుగు టపాకాయలు పేల్చిన తోట కాలితో తన్నుతూ, ఘీంకరిస్తూ వారి వైపు పరుగులు తీసింది. తప్పించుకునే క్రమంలో పలువురు యువకులు, రైతులు గాయపడ్డారు. బంగారుపాళెం మండలంలోని శేషాపురం గ్రామంలోనూ ఆదివారం రాత్రి పంటలపై ఏనుగులు దాడి చేశాయి. గ్రామానికి చెందిన రైతులు రత్నంనాయుడు, ప్రసాద్‌కు చెందిన వరి మడిని తొక్కేశాయి. అరటి, పనస చెట్లను విరిచేశాయి.

ఊరును ఖాళీ చేయించిన అధికారులు
గ్రామస్తుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు ఏనుగు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుసుకుని గ్రామస్తులను ఊరి నుంచి పంపించేశారు. రాత్రిపూట వేరే గ్రామాల్లో తలదాచుకోవాలని సూచించారు. పొద్దుపోయాక పొలాలకు వెళ్లవద్దని పేర్కొన్నారు. తాము వెళ్లిపోతాము సరే.. పశువుల సంగతేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఏనుగు వాటిపై దాడి చేస్తే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు.

ఏనుగులను రెచ్చగొట్టకండి
తమిళనాడులోని అటవీ ప్రాంతాల నుంచి కొన్ని ఏనుగులు జిల్లాలోకి ప్రవేశించాయని, ఆహారం దొరక్క జనావాసాల్లోకి వస్తున్నాయని, వాటిని రెచ్చగొట్టవద్దని చిత్తూరు పశ్చిమ డివిజన్‌ అటవీ శాఖాధికారి (వెస్ట్‌ డీఎఫ్‌వో) సునీల్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమ వారం ఉదయం గుడిపాల మండలం నల్లమడుగు అటవీ ప్రాంతంలో ఏనుగులు నాశనం చేసిన పంట పొలాలను పరిశీలించిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏనుగుల గుంపును తమిళనాడు అటవీ ప్రాంతానికి తరిమేసినా మళ్లీ వస్తున్నాయని చెప్పారు. రైతులు తమ పంటలను కాపాడుకోవాలన్న ఆతృతతో వాటిని రెచ్చగొట్టరాదన్నారు. తద్వారా ప్రాణాపాయం ఉంటుందని హెచ్చరించారు. ఇవి జిల్లాలోకి రాకుండా తమిళనాడు అటవీ శాఖ అధికారులతో చర్చించి, తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు. వేసవి రానుండడంతో మరిన్ని ఏనుగులు జనావాసాల్లోకి వచ్చే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top