నేడు జిల్లాలోకి షర్మిల బస్సు యాత్ర


తెలుగుజాతి ఒక్కటిగా ఉండాలన్నది మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయం. అడ్డగోలు విభజనను సహించరాదన్నది జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పం. ఆవిర్భావం నుంచి తెలుగువారి ఐక్యత, అభివృద్ధే లక్ష్యంగా దూసుకెళ్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం సమైక్యాంధ్ర పరిరక్షణ బాధ్యతను భుజానికెత్తుకుంది. అన్నదమ్ముల్లా అరవై ఏళ్ల పాటు కలిసిమెలిసి ఉన్న తెలుగువారి మధ్య చిచ్చుపెట్టిన కాంగ్రెస్ అధినాయకత్వ వైఖరికి నిరసనగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి షర్మిల పూరించిన సమైక్య శంఖారావ ం నేటి నుంచి రెండురోజులపాటు ‘తూర్పు’న ప్రతిధ్వనించనుంది.

 

 సాక్షి ప్రతినిధి, కాకినాడ : మూడువేల పై చిలుకు కిలోమీటర్ల పాదయాత్ర చేసిన మొట్టమొదటి మహిళగా ప్రపంచ రికార్డును నెలకొల్పిన షర్మిల ఇప్పుడు సమన్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో చేపట్టిన సమైక్య శంఖారావం యాత్ర శుక్రవారం జిల్లాలో అడుగిడుతోంది. తిరుపతిలో ఈనెల 2న శ్రీకారం చుట్టిన ఈ యాత్ర ఇప్పటివరకు చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో సాగింది. మరో ప్రజాప్రస్థానంలో భాగంగా జూన్ 4న జిల్లాలో అడుగుపెట్టి 21 రోజుల పాటు 270.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన షర్మిల జిల్లాలోనే 2500 కిలోమీటర్ల మైలు రాయిని దాటారు.

 

 మళ్లీ రెండున్నర నెలల అనంతరం రాష్ర్ట విభజనపై కేంద్రం తీసుకున్న అసంబద్ధ నిర్ణయం వల్ల తీవ్రంగా నష్టపోనున్న సీమాంధ్రులకు అండగా నిలిచేందుకు జగనన్న తరపున సమైక్య శంఖారావం పూరించిన షర్మిల మళ్లీ జిల్లాకు వస్తున్నారు. పశ్చిమలో యాత్ర ముగించుకొని సిద్ధాంతం-గోపాలపురం వారధి మీదుగా శుక్రవారం ఉదయం షర్మిల జిల్లాలో ప్రవేశించ నున్నారు. ఆమె యాత్ర  కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని రావులపాలెం వద్ద ప్రారంభమై పి.గన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురం, ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల మీదుగా  సాగనుంది.

 

 తొలిరోజు పర్యటనలో కోనసీమ ముఖద్వారమైనరావులపాలెం వద్ద రావులపాలెం మార్కెట్ సెంటర్‌లో సమైక్యవాదులనుద్దేశించి షర్మిల ప్రసంగించనున్నారు. అక్కడ నుంచి కొత్తపేట, పి.గన్నవరం నియోజకవర్గాల మీదుగా  సాయంత్రం అమలాపురం చేరుకుని అక్కడి హైస్కూల్ సెంటర్‌లో సమైక్యవాదులనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ముమ్మిడివరం నియోజకవర్గం మీదుగా తొలిరోజు యాత్ర సాగుతుంది. శనివారం ఉదయం ముమ్మిడివరం, కాకినాడ రూరల్ నియోజకవర్గాల మీదుగా కాకినాడ సిటీలోకి యాత్ర ప్రవేశిస్తుంది. కాకినాడ మెయిన్‌రోడ్డులో 216 జాతీయ రహదారిపై మసీద్‌సెంటర్‌లో కాకినాడ సిటీ తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం జరిగే మహాధర్నాలో షర్మిల ప్రసంగిస్తారు. అనంతరం కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురం, ప్రత్తిపాడు నియోజకవర్గాల మీదుగా యాత్ర తుని చేరుకుంటుంది. అక్కడ నుంచి పాయకరావుపేట వద్ద విశాఖ జిల్లాలోకి ప్రవేశిస్తుంది.

 

 ఘనస్వాగతానికి ఏర్పాట్లు

 రావులపాలెం : సిద్ధాంతం-గోపాలపురం వంతెన మీదుగా జిల్లాలో అడుగుపెడుతున్న షర్మిలకు ఘనస్వాగతం పలికేందుకు పార్టీశ్రేణులు ఉవ్విళ్లూరుతున్నాయి. కొత్తపేట నియోజక వర్గ పార్టీ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే చిర్లజగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఇందు కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. జగ్గిరెడ్డితో పాటు జిల్లా ఇండస్ట్రియల్, వాణిజ్య, సేవాదళ్ కన్వీనర్లు మంతెన రవిరాజు, కర్రి పాపారాయుడు, మార్గన గంగాధర్, జిల్లా అధికార ప్రతినిధి గొల్లపల్లి డేవిడ్‌రాజు ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఏర్పాట్లను పరిశీలించారు. రావులపాలెం మార్కెట్‌రోడ్డు సెంటర్‌లో జరిగే సభకు తరలి వచ్చే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొత్తపేట నుంచి వచ్చే వాహనాలకు రావుల పాలెం జెడ్పీ హైస్కూల్‌లో, ఆలమూరు నుంచి వైపు వచ్చే వాహనాలకు జూనియర్ కళాశాల గ్రౌండ్స్‌లో, ఆత్రేయపురం నుంచి వచ్చే వాహనాలకు రావులపాలెం పంచాయతీ కార్యాలయ ఆవరణలో పార్కింగ్ సౌకర్యం కల్పించినట్టు జగ్గిరెడ్డి తెలిపారు.

 

 సమైక్యశంఖారావాన్ని విజయవంతం చేయాలి : కుడుపూడి

 అమలాపురం : సమైక్యాంధ్ర పరిరక్షణకు షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి పిలుపు నిచ్చారు. అమలాపురంలో పార్టీ జిల్లా స్టీరింగ్‌కమిటీ సభ్యుడు టేకి రాజగోపాలరావు స్వగృహంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో చిట్టబ్బాయి మాట్లాడుతూ అమలాపురంలో జరిగే సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, సమైక్యాంధ్ర కోనసీమ ప్రతినిధులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, రైతు, కార్మిక జేఏసీ నాయకులు, ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. సభకు తరలి వచ్చే వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. పి.గన్నవరం, రాజోలు నుంచి వచ్చే వాహనాలు బస్టాండ్ ఆవరణలో, ముమ్మిడివరం, ఉప్పలగుప్తం, అయినవిల్లి నుంచి వచ్చే వాహనాలు బైపాస్‌రోడ్డు మీదుగా వచ్చి స్థానిక విట్స్ స్కూల్ కాంప్లెక్స్‌లో, అల్లవరం వైపు నుంచి వచ్చే వాహనాలను ఆదిత్య జూనియర్ కాలేజీ ఆవరణలో పార్కింగ్ చేయాలని సూచించారు.

 

 రావులపాలెం నుంచి షర్మిల యాత్ర కొత్తపేట, ముక్కామల, అంబాజీపేట మీదుగా అమలాపురం చేరుకుంటుందని తెలిపారు. మోటార్‌సైకిళ్లు, కార్లపై వచ్చే వారు మధ్యాహ్నం రెండు గంటలకు ముక్కామల చేరుకుని షర్మిలకు ఘనస్వాగతం పలికి అక్కడ నుంచి భారీ ర్యాలీతో అమలాపురం తోడ్కొని రావాలన్నారు. పార్టీ సీజీసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ కో ఆర్డినేటర్ గొల్ల బాబూరావు, పార్టీ కేంద్ర క్రమశిక్షణ కమిటీ సభ్యుడు ఎ.జె.వి.బి.మహేశ్వరరావు, నియోజకవర్గ కో ఆర్డినేటర్లు చింతా కృష్ణమూర్తి, మిండగుదిటి మోహన్ తదితరులు పాల్గొన్నారు.

 

 మహాధర్నాను జయప్రదం చేయాలి : ద్వారంపూడి

 కాకినాడ : సమైక్య శంఖారావ యాత్రలో భాగంగా శనివారం కాకినాడ మెయిన్‌రోడ్డులో షర్మిల పాల్గొనే మహాధర్నాలో పార్టీ శ్రేణులు, సమైక్యవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మసీద్ జంక్షన్ నుంచి జగన్నాథపురం వంతెన వరకు పార్టీ శ్రేణులు, సమైక్యవాదులు చేపట్టే ధర్నాలో షర్మిల ప్రసంగిస్తారన్నారు. ఆమెకు జగన్నాథపురం బాలయోగి విగ్రహం వద్ద సుమారు ఐదువేల బైక్‌లతో ఘనస్వాగతం పలకనున్నట్టు చెప్పారు. సుమారు వెయ్యిమంది దండోరా కార్యకర్తలు డప్పులతో స్వాగతిస్తూ ఆమె పర్యటనలో పాల్గొంటారన్నారు. సమావేశంలో పార్టీ నగర కన్వీనర్ ఆర్‌వీజేఆర్ కుమార్, నగర మహిళా విభాగం కన్వీనర్ పసుపులేటి వెంకటలక్ష్మి, నాయకులు సంగిశెట్టి అశోక్, పసుపులేటి చంద్రశేఖర్, ఎన్.ఎస్.రాజు, రాజాన నగేష్ తదితరులు ఉన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top