
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండవరోజు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ బాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతివ్వడంతో క్యూలైన్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మనస్సు, బుద్ధి, చిత్తం శ్రీబాల త్రిపురసుందరీదేవి ఆధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో ఉండే ఈ తల్లి అనుగ్రహం కోసం ఉపాసకులు బాలార్చన చేస్తారు. ఈ రోజున రెండు నుంచి పదేళ్ల లోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి.. పూజించి కొత్త బట్టలు పెడతారు. అమ్మవారికి ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగు చీరలు కట్టి పాయసం, గారెలను నైవేద్యంగా నివేదిస్తారు. శ్రీ బాల త్రిపుర సుందరీదేవిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని అర్చకులు చెబుతున్నారు.
కన్నులపండువగా ప్రారంభం
ఇంద్రకీలాద్రిపై పదిరోజులపాటు సాగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం కన్నులపండువగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలిరోజున అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. కోటి కనక ప్రభలతో శోభాయమానంగా వెలిగిపోతున్న అమ్మవారిని భక్తులు దర్శించుకుని పునీతులయ్యారు. ఉదయం స్నపనాభిషేకం అనంతరం 8 గంటలకు భక్తులకు దర్శనానికి అనుమతించారు. దుర్గగుడి పరిసర ప్రాంతాలన్నీ దుర్గమ్మ నామస్మరణతో మార్మోగాయి. మల్లిఖార్జున మహామండపంలో ప్రత్యేక కుంకుమార్చన, చండీహోమం నిర్వహించారు. ఉదయం 10 గంటల తర్వాత భక్తుల రద్దీ బాగా పెరిగింది. ఆదివారం కావడంతో ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది. సాయంత్రం ఆరుగంటలకు అమ్మవారి నగరోత్సవం నేత్రపర్వంగా సాగింది.
శారదాపీఠంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
విశాఖపట్నం: చినముసిరివాడ శారదాపీఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండోరోజూ మహేశ్వరి అలంకరణలో రాజశ్యామల అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా గోపూజ నిర్వహించి.. శారదా చంద్రమౌళీవ్వరులకు విశేష పంచామృతాభిషేకాలతోపాటు చక్రనవావరణార్చనను స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి నిర్వహించారు.