వద్దు అంటున్నా భార్య స్టేజీ ఎక్కిందని..
భార్య తన మాట వినలేదనే కోపంతో షేక్ బషీర్ అనే వ్యక్తి వంటి మీద పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు.
గుత్తి(అనంతపురం జిల్లా): భార్య తన మాట వినలేదనే కోపంతో షేక్ బషీర్ అనే వ్యక్తి వంటి మీద పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గుత్తి పట్టణంలో మంగళవారం అర‍్థరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. పట్టణంలోని కటిక బజారులో షేక్ బషీర్, సాధిక సంజరీ నివాసముంటున్నారు. షేక్ బషీర్ పట్టణంలోని బీరువాల షాపులో పని చేస్తున్నాడు. భార్య సాధిక సంజరీ పాటలు పాడుతుండేది. బషీర్ తాగుడు, మట్కాకు బానిసయ్యాడు. భార్య భర్తలు తరుచూ గొడవ పడుతుండేవారు.
ఈ నేపథ్యంలో గత ఆరు మాసాల క్రితం భర్త షేక్ బషీర్ నుంచి సాధిక విడిగా ఉంటోంది. సాధిక సంజరీ గాయనిగా ఖవ్వాలి చెబుతూ జీవిస్తున్నది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఆర్‌అండ్‌బీ బంగ్లాలో గుత్తి కోట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఉగాదిని పురష్కరించుకుని సందడి చేద్దాం రండి పేరుతో సాంస్కృతిక సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాయని సాధిక సంజరీ వెళ్లింది. భర్త షేక్ బషీర్ కూడా కార్యక్రమానికి వెళ్లారు. అయితే సాధిక సంజరీ స్టేజ్ ఎక్కకూడదని , పాటలు పాడకూడదని భర్త షేక్ బషీర్ ఆర్డర్ వేశాడు. అయితే పాటలు పాడితేనే నాలుగు డబ్బులు వస్తాయని నేను పాటలు పాడి తీరుతానని ఆమె స్టేజ్ ఎక్కింది.
దీంతో వెంట తెచ్చుకున్న బాటిల్‌లోని పెట్రోల్‌ను వంటి మీద పోసుకుని నిప్పు పెట్టుకున్నాడు. మంటలు శరీరమంతా వ్యాపించాయి. మంటలతోనే స్టేజి వద్ద నిలబడ్డాడు. దీంతో అందరూ భయాందోళన చెంది పరుగులు తీశారు. కొందరు కంబళి తెచ్చి మంటలు ఆర్పారు. పోలీసులు వచ్చి అతన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం రెఫర్ చేశారు. కాగా సాధిక సంజరీ తన భర్త నుంచి ప్రాణ భయం ఉందని మంగళవారం ఉదయమే పోలీసులకు ఫిర్యాదు చేసింది.


