వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ‘నరకాసురవధ’ పేరిట రెండో రోజైన శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఆందోళనలు పోటెత్తాయి.
సాక్షి ప్రతినిధి, ఏలూరు : రుణమాఫీపై రోజుకో ప్రకటనతో కాల యాపన చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరును నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ‘నరకాసురవధ’ పేరిట రెండో రోజైన శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఆందోళనలు పోటెత్తాయి. రైతులు, మహిళలు, వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. నియోజ కవర్గ, మండల కేంద్రాల్లో రాస్తారోకోలు, ధర్నాలు హోరెత్తాయి.
అన్నదాతలను, ఆడపడుచులను మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై 420 కేసు పెట్టాలని నినదించారు. పెనుగొండలో వైఎస్సార్ సీపీ నేతలు రాస్తారోకో చేపట్టారు. నరసాపురం లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్త వంక రవీ్రందనాథ్, ఆచం ట నియోజకవర్గ సమన్వయకర్త ముదునూరి ప్రసాదరాజు నాయకత్వంలో నిర్వహించిన ఆందోళనకు నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో కార్యకర్తలు, రైతులు తరలివచ్చారు. రాస్తారోకోతో రోడ్డుకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రవీ్రందనాథ్, ప్రసాదరాజు మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చినవిధంగా వ్యవసాయ, డ్వాక్రా రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేయాలని, ఖరీఫ్ సాగుకు వెంటనే వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బాబు బండారం బయటపడింది : బాలరాజు
బుట్టాయగూడెంలో చంద్రబాబు దిష్టిబొమ్మను దహ నం చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా మాజీ కన్వీనర్ తెల్లం బాలరాజు మాట్లాడుతూ.. తాను మారానంటూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నయవంచన రెండు నెలల్లోనే బయటపడిందని విమర్శించారు. ప్రజాందోళనతోనైనా దిగివచ్చి ఆంక్షలు లేకుండా రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
పాలకొల్లులో రాస్తారోకో చేపట్టి చంద్రబాబు దిష్టిబొమ్మకు నిప్పుపెట్టారు. ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడుతూ అధికారంలోకి వస్తే రుణాలన్నీ మాఫీ చేస్తానన్న చంద్రబాబు ఇప్పుడు రీషెడ్యూల్, మ్యాచింగ్ గ్రాంట్ అంటూ నాటకాలాడుతున్నారని ధ్వజమెత్తారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త గుణ్ణం నాగబాబు తదితరులు పాల్గొన్నారు.
జాతీయరహదారిపై రాస్తారోకో
వీరవాసరంలో పార్టీ నేతలు, రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. జెడ్పీటీసీ మానుకొండ ప్రదీప్‌కుమార్, ఎంపీపీ కౌరు శ్రీనివాస్, పార్టీ మండల కన్వీనర్ పోతుపల్లి బాబు నాయకత్వం వహించారు. దేవరపల్లి మూడుబొమ్మల సెంటర్, బంధపురం, గోపాలపురంలలో పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తలారి వెంకటరావు ఆధ్వర్యంలో చంద్రబాబు దిష్టిబొమ్మలను తగులబెట్టారు. ఉండిలో పార్టీ కార్యకర్తలు బాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. చాగల్లులో పార్టీ మండల కన్వీనర్ బొర్రా కృష్ణారావు, నాయకుడు జి.రామచంద్రరావు ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టి వెంటనే రుణాలను మాఫీ చేయాలని కోరుతూ తహసిల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.