త్రుటిలో తప్పిన పెనుప్రమాదం

School Bus Rolled In West Godavari - Sakshi

సాక్షి, తణుకు(పశ్చిమగోదావరి) : అందరూ నాలుగేళ్ల నుంచి పదేళ్ల లోపు చిన్నారులే.. అప్పటివరకు సరదాగా గడిపిన వారంతా... ఒక్కసారిగా హాహాకారాలతో భయభ్రాంతులకు గురయ్యారు.. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు వారంతా షాక్‌లోకి వెళ్లిపోయారు.. తణుకు మండలం తేతలి గ్రామ పరి«ధిలోని స్టెప్పింగ్‌ స్టోన్స్‌ స్కూలు బస్సు ప్రమాదానికి గురైన సంఘటనలో 34 మంది చిన్నారులు సురక్షితంగా బయటపడ్డారు. బుధవారం ఉదయం విద్యార్థులను తరలిస్తున్న ఏపీ 37 టీడీ 8878 నెంబరు కలిగిన బస్సు స్కూలు సమీపంలోని పంట కాల్వలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న చిన్నారులను స్థానికంగా పొలాల్లో పనిచేస్తున్న కూలీలు, రైతులు హుటా హుటిన చేరుకుని వారందరినీ బయటకు తీశారు. ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

పుంత రోడ్డులోనే రాకపోకలు
తణుకు మండలం తేతలి గ్రామ పరిధిలోని స్టెప్పింగ్‌ స్టోన్స్‌ స్కూలుకు చెందిన బస్సు పెరవలి, కాపవరం, కొత్తపల్లి, తూర్పువిప్పర్రు గ్రా మాల నుంచి 34 మంది విద్యార్థులను ఎక్కించుకుని బయల్దేరింది. వీరంతా ఎల్‌కేజీ నుంచి ఆరో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులే కావడం గమనార్హం. ఏఎస్‌ఆర్‌ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఇంజినీరింగ్‌ కాలేజీ ఆనుకుని స్టెప్పింగ్‌ స్టోన్స్‌ స్కూలు నడుస్తోంది. అయితే స్కూలు బస్సులు రాకపోకలకు అత్తిలి కాల్వ ఆనుకుని పుంతరోడ్డునే యాజమాన్యం వినియోగించుకుంటోంది. ఈ క్రమంలో అత్తిలి కాల్వకు రోడ్డుకు మధ్యలో పంట కాల్వ ప్రవహిస్తోంది. అయితే పుంత రోడ్డు ఇరుకుగా ఉండటంతోపాటు ఇటీవల కురుస్తున్న వర్షాలకు గట్టు తెగిపోయింది. దీనిని గమనించని బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బస్సు పంట కాల్వలోకి దూసుకెళ్లిపోయింది.  ఈ సమయంలో విద్యార్థులు కేకలు వేయడంతో సమీపంలో రైతులు, కూలీలు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే మధ్యలో పంట కాల్వ లేకపోతే నేరుగా పెద్ద కాల్వలోకే బస్సు వెళ్లిపోయేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 

ఎమ్మెల్యే కారుమూరి ఆరా..
ప్రమాదం విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు సంఘటనపై ఆరా తీశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మట్టా వెంకటేష్, సరెళ్ల వీరతాతయ్యను తక్షణమే సంఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే కారుమూరి స్కూలు యాజమాన్యంతో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకుని విద్యార్థుల యోగక్షేమాలు తెలుసుకున్నారు. నాయకులు వెంకటేష్, వీరతాతయ్యలు సంఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షించారు. సంఘటనా స్థలానికి మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ సంపత్‌కుమార్‌ చేసుకుని వివరాలు సేకరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన బస్సు డ్రైవర్, యాజమాన్యంపై రూరల్‌ ఎస్సై ఎన్‌.శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

భయం వేసింది
స్కూలులో తొమ్మిదో తరగతి చదువుకుంటున్నాను. కాపవరంలో ఉదయం బస్సు ఎక్కాను. అయితే రోజు కంటే ఆలస్యంగా బస్సు వచ్చింది. స్కూలు టైం అయిపోతోందనే ఆందోళనలో ఉన్నాం. మరికొద్ది సేపట్లోనే స్కూలుకు చేరుకుంటున్నాం అనగా పంట కాల్వలోకి బస్సు దూసుకెళ్లింది. దీంతో అందరికీ భయం వేసింది.      
–కట్టికూటి సుబ్రహ్మణ్యం, విద్యార్థి, కాపవరం

డ్రైవర్‌ను మార్చారు
నా ఇద్దరు పిల్లలు స్టెప్పింగ్‌ స్టోన్స్‌ స్కూలులోనే చదువుకుంటున్నారు. పెరవలి మండలం కాపవరం నుంచి బస్సులో స్కూలుకు వస్తున్నారు. అయితే ఇటీవల స్కూలు బస్సు డ్రైవర్‌ను మార్చారు. దీంతోపాటు రెండేసి ట్రిప్పులు వేస్తుండటంతో వేగంగా విద్యార్థులను తరలిస్తున్నారు.
–కాకరపర్తి శ్రీలక్ష్మి, విద్యార్థుల తల్లి, కాపవరం     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top