పక్కాగా నొక్కేశారు | scam out in ananthapur commercial tax office | Sakshi
Sakshi News home page

పక్కాగా నొక్కేశారు

Sep 24 2015 10:41 AM | Updated on Sep 3 2017 9:54 AM

వ్యాపారులు ప్రతి నెలా ట్యాక్స్ చెల్లిస్తున్నారు...

  •  కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో రూ.2.70కోట్లు స్వాహా
  •  తప్పుడు సీళ్లు, బిల్లులతో నలుగురు ఉద్యోగుల అక్రమార్జన
  •  2011 నుంచి కొనసాగిన స్వాహాపర్వం...  
  •  ఇటీవల వెలుగులోకి రావడంతో విచారణకు కమిషనర్ ఆదేశం
  •  
     సాక్షిప్రతినిధి, అనంతపురం:
    వ్యాపారులు ప్రతి నెలా ట్యాక్స్ చెల్లిస్తున్నారు... ఆ డబ్బులు అకౌంటెంట్ బ్యాంకులో చెల్లించి బ్యాంకుసీలుతో ముద్రవేసి చలానాలు అధికారులకు ఇస్తున్నారు. వీటిని చిట్టాబుక్కులో పొందుపరుస్తున్నారు. పన్ను వసూళ్లపై క్లియర్ రిపోర్టు ఇస్తున్నారు.
     - ఇది బయటికి తెలిసిన వ్యవహారం
     అయితే ఆ నలుగురికే తెలిసిన తతంగం మరొకటి ఉంది. వ్యాపారులు ప్రతినెలా ఇచ్చేట్యాక్స్ డబ్బులు బ్యాంకులో చెల్లించరు. నకిలీ సీళ్లు తయారు చేసి చెల్లించినట్లు చలానాపై తప్పుడు ‘ముద్ర’ వేస్తారు. వాటిని చిట్టాబుక్కులో పెట్టి ‘క్లియర్ రిపోర్టు’ ఇస్తున్నారు.  2011 నుంచి వాణిజ్య పన్నుల శాఖ (కమర్షియల్‌ట్యాక్స్) కార్యాలయంలో నలుగురు అధికారులు కలిసి చేసిన స్వాహాపర్వం. వారంతా కలిసి ఏకంగా రూ.2.70కోట్లు స్వాహా చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే నాలుగేళ్ల బిల్లులు ఒక్కసారి తిరగేస్తే 7కోట్ల కుంభకోణం దాకా ఉంటుందని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ స్వాహాపర్వం వివరాలు ఇలా ఉన్నాయి.


     అనంతపురంలో వాణిజ్యపన్నులశాఖ సర్కిల్-1, -11 ఉన్నాయి. వీటి పరిధిలోని వ్యాపారులు ప్రతీనెలా పన్నులు చెల్లించాలి.  ఈ డబ్బులు స్వాహా చేసేందుకు నలుగురు అధికారులు ఓ వ్యూహం రచించారు. ఇందులో ఓ అకౌంటెంట్, ఓ జూనియర్ అసిస్టెంట్, సీటీవోతో పాటు మరో అధికారి ఉన్నట్లు తెలుస్తోంది. పన్ను డబ్బులను బ్యాంకులో చెల్లించకుండానే చెల్లించినట్లు అకౌంటెంట్ నకిలీసీళ్లతో చలానాలపై సీలు వేశాడు. ఈ చలానాలను చిట్టాబిక్కులో అతికించి జూనియర్ అసిస్టెంట్ క్లియరెన్స్ రిపోర్టు ఇచ్చాడు. ఇలా తమ పరిధిలోని కొన్ని దుకాణాల పన్నులు చెల్లిస్తూ... మరికొన్ని తప్పుడు సీళ్లతో చెల్లించనట్లు చూపిస్తూ సర్కారు సొమ్మును మింగేస్తూ వచ్చారు. వీరిద్దరితో మరో అధికారి చేతులు కలిపారు. వీరి ముగ్గురూ ఓ సీటీవీ చాంభర్‌లో రోజూ రాత్రి 8-9గంటల వరకూ ఉండేవాళ్లు! అయితే వీరేం చేస్తున్నారో? ఎందుకు రాత్రిదాకా ఆఫీసులో ఉన్నారో ఎవ్వరికీ అర్థమయ్యేది కాదు.

    కుంభకోణం వెలుగులోకి వచ్చిందిలా:
     వెంకటేశ్వర ట్రేడర్స్‌కు చెందిన  రూ.67వేల బిల్లు పెండింగ్‌లో ఉంది. ట్రేడర్స్ యాజమాన్యం ఐపీ పెట్టారు. దీంతో ట్రేడర్స్‌కు సంబంధించి బిల్లులు తనిఖీలు చేశారు. ట్రేడర్స్ చెల్లించినట్లు చలానాలు ఉన్నాయి. కానీ పన్ను మొత్తం జమకాలేదు. ఆరా తీస్తే కుంభకోణం బయటపడింది. ఈ విషయం వాణిజ్యపన్నులశాఖ కమిషనర్‌కు తెలిసింది. ఇది ఒక్కటే ఇలా ఉందా? ఇంకేమైనా ఉన్నాయా? అని విచారణకు ఆదేశించారు. దీంతో విచారణ కమిటీ  అనంతపురానికి వచ్చి తనిఖీలు చేపట్టింది. తీగ లాగితే డొంక కదిలింది. నాలుగేళ్లుగా కొన్ని బిల్లులు బ్యాంకులో చెల్లించకుండానే తప్పుడు చలానాలతో మాయ చేసినట్లు గ్రహించారు. ఇప్పటివరకూ కోటిరూపాయల దాకా గోల్‌మాల్ అయినట్లు విచారణలో తేలినట్లు సమాచారం. అయితే అది రూ.2.70కోట్లదాకా ఉంటుందని ఆశాఖ వర్గాలు చెబుతున్నాయి.  

    నాలుగేళ్లుగా నలుగురు డీసీలు గుర్తించలేకపోయారా?
    2011 నుంచి ఈ కుంభకోణం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ కాలంలో శోబాబు, నరసింహం, ద్వారకనాథరెడ్డి డిప్యూటీ కమిషనర్లుగా పనిచేశారు. ప్రస్తుతం కల్పన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తప్పుడు చలానాతో సొమ్ముస్వాహా చేస్తున్నా వీరి నలుగురిలో ఏఒక్కరూ గుర్తించకపోవడం గమనార్హం. వీరికి తెలీకుండానే ఇదంతా జరిగిందా? అనేది తేలాల్సి ఉంది.

    డిప్యూటీ కమిషనర్ ఏమన్నారంటే!:
    ఈ విషయంపై కమర్షియల్‌ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ కల్పనను 'సాక్షి' వివరణకోరగా ‘ నా దృష్టికి వచ్చింది. అయితే ఎలా జరిగింది? ఎవరు పాత్రదారులు? అనే విషయాలపై క్లారిటీ లేదు. అంతకు మించి ఇప్పుడు తానేమీ చెప్పలేనన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement