మళ్లీ రెక్కలు విప్పిన డెంగీ | Sarvajanahospital reduced to 70 the number of inpatient | Sakshi
Sakshi News home page

మళ్లీ రెక్కలు విప్పిన డెంగీ

Aug 29 2014 3:03 AM | Updated on Sep 2 2017 12:35 PM

మళ్లీ రెక్కలు విప్పిన డెంగీ

మళ్లీ రెక్కలు విప్పిన డెంగీ

జిల్లాలో డెంగీ మహమ్మారి మళ్లీ జడలు విప్పుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల నుంచి గడిచిన వారం రోజుల్లో వచ్చిన 286 రక్త నమూనాలను ప్రభుత్వ వైద్య కళాశాలలో పరీక్షించగా (ఎలీసా టెస్ట్) అందులో 38 కేసులు డెంగీగా నిర్ధారణ అయ్యాయి.

- వారంలో 38 కేసుల నిర్ధారణ
- జూలై 12 నుంచి ఇప్పటి వరకు 165 కేసుల నమోదు
- సర్వజనాస్పత్రిలో 70కు తగ్గని ఇన్‌పేషెంట్ల సంఖ్య
అనంతపురం మెడికల్ : జిల్లాలో డెంగీ మహమ్మారి మళ్లీ జడలు విప్పుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల నుంచి గడిచిన వారం రోజుల్లో వచ్చిన 286 రక్త నమూనాలను ప్రభుత్వ వైద్య కళాశాలలో పరీక్షించగా (ఎలీసా టెస్ట్) అందులో 38 కేసులు డెంగీగా నిర్ధారణ అయ్యాయి. మరో మూడు డెంగీ అనుమానిత కేసులుగా నమోదు చేశారు. జూలై 12 నుంచి ఇప్పటి వరకు 1,330 కేసుల్లో ఎలీసా పరీక్ష నిర్వహించగా.. 165 డెంగీగా తేలాయి. సర్వజనాస్పత్రిలోనే కాకుండా జిల్లాలోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సర్వజనాస్పత్రిలో ప్రతి రోజూ ఎఫ్‌ఎం, ఎంఎం, పీడియాట్రిక్ వార్డుల్లో 70 మందికి తగ్గకుండా ఇన్‌పేషంట్లు చేరుతున్నారు. పరిస్థితి తీవ్రంగా ఉందనేందుకు ఈ సంఖ్య అద్దం పడుతోంది.

ప్రస్తుతం వాతావరణంలో మార్పులతో దోమల బెడద అధికంగా ఉంది. పట్టణాలు, గ్రామాల్లో దోమల నివారణకు చేపడుతున్న చర్యలు మొక్కుబడిగా ఉంటున్నాయి. ఇప్పటికైనా అధికారులు క్షేత్ర స్థాయిలో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడంతో పాటు దోమల నివారణకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
 
ఎఫ్‌ఎం వార్డులో నీటి సరఫరా బంద్
సర్వజనాస్పత్రిలోని ఎఫ్‌ఎం వార్డులో రెండు మరుగుదొడ్లు ఉంటే.. అందులో ఒకదాంట్లో నాలుగు రోజులుగా నీటి సరఫరా ఆగిపోయింది. దీంతో తీవ్ర ఇబ్బందికి గురవుతున్నామని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి అధికారులు స్పందించి నీటి సరఫరాకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

అవ్వ, మనవరాలికి డెంగీ లక్షణాలు
ఓడీ చెరువు :  మండలంలోని వీరప్పగారిపల్లిలో ఒకే ఇంట్లో అవ్వ, మనవరాలికి డెంగీ లక్షణాలు కనిపించాయి. సుబ్బమ్మ అనే వృద్ధురాలు, ఆమె మనవరాలు దివ్యశ్రీ వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. ఇంటివద్దనే ఉంటూ ప్రైవేట్ వైద్యులతో చికిత్స చేయించుకున్నా తగ్గలేదు. వీరితో పాటు మరికొంత మంది కూడా జ్వరాలతో మంచం పట్టారు.

విషయం తెలుసుకున్న ఎంపీపీ జీఎండీ ఇస్మాయిల్ వైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు గురువారం గ్రామానికి చేరుకుని వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. సుబ్బమ్మ, దివ్యశ్రీకి ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉండటంతో డెంగీ (ఇతర వైరల్ ఫీవర్స్ వల్ల కూడా ప్లేట్‌లెట్స్ తగ్గవచ్చు)గా అనుమానిస్తున్నారు. వారిని మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో అనంతపురం ఆస్పత్రికి తరలించినట్లు డాక్టర్ వెంకటరమణ నాయక్ తెలిపారు.

Advertisement
Advertisement