వన దేవత వచ్చె.. | Sammakka Saralamma jatara starts over Medaram | Sakshi
Sakshi News home page

వన దేవత వచ్చె..

Feb 13 2014 2:03 AM | Updated on Oct 9 2018 5:58 PM

వన దేవత వచ్చె.. - Sakshi

వన దేవత వచ్చె..

మేడారం గిరిజన జాతర ఘనంగా మొదలైంది. కోరిన కోరికలు నెరవేర్చే వన దేవత సారలమ్మ బుధవారం మేడారం గద్దెపై కొలువుదీరారు. పగిడిద్దరాజు, గోవిందరాజులు కూడా సారలమ్మతోనే గద్దెలపైకి చేరారు.

ఘనంగా మేడారం జాతర ప్రారంభం
గద్దెపైకి చేరిన సారలమ్మ
పగిడిద్దరాజు, గోవిందరాజులు కూడా..
దారిపొడవునా భక్తుల దండాలు
నేడు సమ్మక్క ఆగమనం

 
 మేడారం నుంచి సాక్షి ప్రతినిధి: మేడారం గిరిజన జాతర ఘనంగా మొదలైంది. కోరిన కోరికలు నెరవేర్చే వన దేవత సారలమ్మ బుధవారం మేడారం గద్దెపై కొలువుదీరారు. పగిడిద్దరాజు, గోవిందరాజులు కూడా సారలమ్మతోనే గద్దెలపైకి చేరారు. బుధవారం సాయంత్రం  కన్నెపల్లిలోని సారలమ్మ గుడి వద్ద ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం వడ్డెలు(పూజారులు) ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 6.18 గంటలకు గుడి నుంచి మొంటె (వెదురు బుట్ట)లో అమ్మవారి ప్రతిరూపమైన పసుపు, కుంకుమలు తీసుకుని మేడారానికి బయలుదేరారు. జంపన్నవాగులో నుంచి సమ్మక్క గుడికి చేరుకున్నారు.
 
 అప్పటికే అక్కడికి చేరుకున్న పగిడిద్దరాజు, గోవిందరాజులతో కలసి వడ్డెలు ముగ్గురి రూపాలను రాత్రి 9.40ని.లకు గద్దెలపైకి చేర్చారు. కన్నెపల్లి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలోని మేడారం గద్దెల వద్దకు సారలమ్మ వస్తున్న వేడుకను చూసేందుకు లక్షలాది మంది భక్తులు పోటీపడ్డారు. సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య అమ్మవారి ప్రతిమను మొంటెలో తీసుకొస్తుండగా ఆలయం మెట్ల నుంచి వంద మీటర్ల పొడవునా భక్తులు కింద పడుకుని వరం పట్టారు. సారలమ్మను తీసుకువస్తున్న పూజారులు వీరిపై దాటి వెళ్లారు. ఇలా చేస్తే సంతానభాగ్యం కలుగుతుందని, కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. సారలమ్మ గద్దెలకు రాకను సూచిస్తూ ఆదివాసీ పూజారులు కొమ్ముబూరలు ఊదారు.
 
ప్రత్యేక డోలు వాద్యాలు, శివసత్తుల పూనకాలు, హిజ్రాల శివాలుతో కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయం భక్తితో ఉప్పొంగింది. పూజారులు కాక సారయ్య, లక్ష్మీబా యమ్మ, కోరె ముత్యంబాయి, కాక కిరణ్, కాక వెంకన్న, కాక కనుకమ్మ, కాక భుజంగరావులు సారలమ్మను కన్నెపల్లి నుంచి గద్దెలపైకి తీసుకువచ్చారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క వీరికి తోడుగా వచ్చారు. హనుమాన్ జెండా నీడలో కన్నెపల్లి వెన్నెలమ్మగా పేరున్న సారలమ్మ గద్దెలపైకి చేరింది. ప్రభుత్వం తరఫున జేసీ పౌసమిబసు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ కిషన్ అంతకుముందు కన్నెపల్లికి చేరుకుని అక్కడ వడ్డెలు నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు. సీఆర్‌పీఎఫ్ పోలీసులు భద్రత కల్పించారు.
 
 జనమే... జనం: సారలమ్మ, ఆమె భర్త గోవిందరాజు, తండ్రి పగిడిద్దరాజులు ప్రతిమలను గద్దెలపైకి తీసుకురావడంతో మేడారం, కన్నెపల్లి, రెడ్డిగూడెం, జంపన్నవాగు, నార్లాపూర్ పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. లక్షలాదిగా వస్తున్న భక్తులతో అటవీదారులన్నీ కిటకిటలాడాయి. పుణ్యస్నానాలతో జంపన్నవాగు మొత్తం జనంతో నిండిపోయింది. నాలుగు కిలోమీటర్ల పొడవునా దారులు కిక్కిరిసిపోయాయి. సారలమ్మ గద్దెలపైకి రాగానే భక్తులు దర్శనం కోసం ఒక్కసారిగా గద్దెల వద్దకు వచ్చేందుకు ప్రయత్నించడంతో తోపులాట జరిగింది.
 
 నేడు సమ్మక్క రాక...: జాతరలో అత్యంత ప్రధాన ఘట్టం సమ్మక్క మేడారం గద్దెలపైకి చేరడం. చిలుకలగుట్ట నుంచి మేడారానికి సమ్మక్క ప్రతిమను తీసుకువచ్చే ప్రక్రియ గురువారం జరుగుతుంది. సా.5గంటల సమయంలో గిరిజన సంప్రదాయం ప్రకారం ప్రధాన పూజారి చిలుకలగుట్టపై నుంచి కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను వెదురు బొంగులో భద్రపర్చుకుని తీసుకొస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కలెక్టర్ జి.కిషన్ సమ్మక్కను తీసుకువచ్చే కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. వరంగల్ రూరల్ ఎస్పీ ఎల్.కాళిదాసు గాలిలోకి కాల్పులు జరిపిన తర్వాత సమ్మక్క ప్రతిమతో వడ్డెలు బయల్దేరుతారు. ఆ సమయంలో భక్తులు సమ్మక్కకు ఎదురేగి కోళ్లను, మేకలను బలి ఇస్తారు. వన దేవతలందరు కొలుైవె  ఉండటంతో గురువారం రాత్రి నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు.
 
 మేడారం.. ట్రాఫిక్‌జాం
 సాక్షి, హన్మకొండ: మహా జాతర తొలిరోజే ట్రాఫిక్‌జాం అయ్యింది. పోలీసు శాఖ కనబరిచిన అతివిశ్వాసం మొదటికే మోసం తెచ్చింది. దీన్ని సరిదిద్దేందుకు పోలీసులకు పద్దెనిమిది గంటల సమయం పట్టింది. జాతరకు ముందు పోలీసు శాఖ చేసిన కసరత్తు, విధించిన నిబంధనలు పనికిరాకుండా పోయాయి. కాగా, భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో మంగళవారం సాయంత్రం మేడారానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పస్రా దగ్గర ట్రాఫిక్ జాం అయింది. మంగళవారం సాయంత్రం 5.00 గంటల నుంచి బుధవారం మధ్యాహ్నం 11.30 గంటల వరకు పస్రా నుంచి మల్లంపల్లి వరకు 40 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. రూరల్, అర్బన్ పోలీసుల మధ్య సమన్వయం లోపించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
 అమ్మలకు రాజన్న పట్టు వస్త్రాలు
 తాడ్వాయి, న్యూస్‌లైన్:  మేడారం సమ్మక్క, సారలమ్మలకు వేములవాడ రాజన్న దేవస్థానం తరఫున బుధవారం పట్టు వస్త్రాలను సమర్పించారు. వేములవాడ పాల కమండలి చైర్మన్ బొమ్మ వెంకటేశ్వర్లు పట్టు వస్త్రాలను తెచ్చారు. తొలుత సమ్మక్క గుడిలో అమ్మవారికి వస్త్రాలు సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement