breaking news
Saralamma temple
-
వన దేవత వచ్చె..
-
వన దేవత వచ్చె..
ఘనంగా మేడారం జాతర ప్రారంభం గద్దెపైకి చేరిన సారలమ్మ పగిడిద్దరాజు, గోవిందరాజులు కూడా.. దారిపొడవునా భక్తుల దండాలు నేడు సమ్మక్క ఆగమనం మేడారం నుంచి సాక్షి ప్రతినిధి: మేడారం గిరిజన జాతర ఘనంగా మొదలైంది. కోరిన కోరికలు నెరవేర్చే వన దేవత సారలమ్మ బుధవారం మేడారం గద్దెపై కొలువుదీరారు. పగిడిద్దరాజు, గోవిందరాజులు కూడా సారలమ్మతోనే గద్దెలపైకి చేరారు. బుధవారం సాయంత్రం కన్నెపల్లిలోని సారలమ్మ గుడి వద్ద ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం వడ్డెలు(పూజారులు) ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 6.18 గంటలకు గుడి నుంచి మొంటె (వెదురు బుట్ట)లో అమ్మవారి ప్రతిరూపమైన పసుపు, కుంకుమలు తీసుకుని మేడారానికి బయలుదేరారు. జంపన్నవాగులో నుంచి సమ్మక్క గుడికి చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పగిడిద్దరాజు, గోవిందరాజులతో కలసి వడ్డెలు ముగ్గురి రూపాలను రాత్రి 9.40ని.లకు గద్దెలపైకి చేర్చారు. కన్నెపల్లి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలోని మేడారం గద్దెల వద్దకు సారలమ్మ వస్తున్న వేడుకను చూసేందుకు లక్షలాది మంది భక్తులు పోటీపడ్డారు. సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య అమ్మవారి ప్రతిమను మొంటెలో తీసుకొస్తుండగా ఆలయం మెట్ల నుంచి వంద మీటర్ల పొడవునా భక్తులు కింద పడుకుని వరం పట్టారు. సారలమ్మను తీసుకువస్తున్న పూజారులు వీరిపై దాటి వెళ్లారు. ఇలా చేస్తే సంతానభాగ్యం కలుగుతుందని, కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. సారలమ్మ గద్దెలకు రాకను సూచిస్తూ ఆదివాసీ పూజారులు కొమ్ముబూరలు ఊదారు. ప్రత్యేక డోలు వాద్యాలు, శివసత్తుల పూనకాలు, హిజ్రాల శివాలుతో కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయం భక్తితో ఉప్పొంగింది. పూజారులు కాక సారయ్య, లక్ష్మీబా యమ్మ, కోరె ముత్యంబాయి, కాక కిరణ్, కాక వెంకన్న, కాక కనుకమ్మ, కాక భుజంగరావులు సారలమ్మను కన్నెపల్లి నుంచి గద్దెలపైకి తీసుకువచ్చారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క వీరికి తోడుగా వచ్చారు. హనుమాన్ జెండా నీడలో కన్నెపల్లి వెన్నెలమ్మగా పేరున్న సారలమ్మ గద్దెలపైకి చేరింది. ప్రభుత్వం తరఫున జేసీ పౌసమిబసు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ కిషన్ అంతకుముందు కన్నెపల్లికి చేరుకుని అక్కడ వడ్డెలు నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు. సీఆర్పీఎఫ్ పోలీసులు భద్రత కల్పించారు. జనమే... జనం: సారలమ్మ, ఆమె భర్త గోవిందరాజు, తండ్రి పగిడిద్దరాజులు ప్రతిమలను గద్దెలపైకి తీసుకురావడంతో మేడారం, కన్నెపల్లి, రెడ్డిగూడెం, జంపన్నవాగు, నార్లాపూర్ పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. లక్షలాదిగా వస్తున్న భక్తులతో అటవీదారులన్నీ కిటకిటలాడాయి. పుణ్యస్నానాలతో జంపన్నవాగు మొత్తం జనంతో నిండిపోయింది. నాలుగు కిలోమీటర్ల పొడవునా దారులు కిక్కిరిసిపోయాయి. సారలమ్మ గద్దెలపైకి రాగానే భక్తులు దర్శనం కోసం ఒక్కసారిగా గద్దెల వద్దకు వచ్చేందుకు ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. నేడు సమ్మక్క రాక...: జాతరలో అత్యంత ప్రధాన ఘట్టం సమ్మక్క మేడారం గద్దెలపైకి చేరడం. చిలుకలగుట్ట నుంచి మేడారానికి సమ్మక్క ప్రతిమను తీసుకువచ్చే ప్రక్రియ గురువారం జరుగుతుంది. సా.5గంటల సమయంలో గిరిజన సంప్రదాయం ప్రకారం ప్రధాన పూజారి చిలుకలగుట్టపై నుంచి కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను వెదురు బొంగులో భద్రపర్చుకుని తీసుకొస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కలెక్టర్ జి.కిషన్ సమ్మక్కను తీసుకువచ్చే కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. వరంగల్ రూరల్ ఎస్పీ ఎల్.కాళిదాసు గాలిలోకి కాల్పులు జరిపిన తర్వాత సమ్మక్క ప్రతిమతో వడ్డెలు బయల్దేరుతారు. ఆ సమయంలో భక్తులు సమ్మక్కకు ఎదురేగి కోళ్లను, మేకలను బలి ఇస్తారు. వన దేవతలందరు కొలుైవె ఉండటంతో గురువారం రాత్రి నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. మేడారం.. ట్రాఫిక్‌జాం సాక్షి, హన్మకొండ: మహా జాతర తొలిరోజే ట్రాఫిక్‌జాం అయ్యింది. పోలీసు శాఖ కనబరిచిన అతివిశ్వాసం మొదటికే మోసం తెచ్చింది. దీన్ని సరిదిద్దేందుకు పోలీసులకు పద్దెనిమిది గంటల సమయం పట్టింది. జాతరకు ముందు పోలీసు శాఖ చేసిన కసరత్తు, విధించిన నిబంధనలు పనికిరాకుండా పోయాయి. కాగా, భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో మంగళవారం సాయంత్రం మేడారానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పస్రా దగ్గర ట్రాఫిక్ జాం అయింది. మంగళవారం సాయంత్రం 5.00 గంటల నుంచి బుధవారం మధ్యాహ్నం 11.30 గంటల వరకు పస్రా నుంచి మల్లంపల్లి వరకు 40 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. రూరల్, అర్బన్ పోలీసుల మధ్య సమన్వయం లోపించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అమ్మలకు రాజన్న పట్టు వస్త్రాలు తాడ్వాయి, న్యూస్‌లైన్: మేడారం సమ్మక్క, సారలమ్మలకు వేములవాడ రాజన్న దేవస్థానం తరఫున బుధవారం పట్టు వస్త్రాలను సమర్పించారు. వేములవాడ పాల కమండలి చైర్మన్ బొమ్మ వెంకటేశ్వర్లు పట్టు వస్త్రాలను తెచ్చారు. తొలుత సమ్మక్క గుడిలో అమ్మవారికి వస్త్రాలు సమర్పించారు. -
నేటి నుంచి మేడారం మహాజాతర
-
జాతరెల్లి పోదామా..
నేటి నుంచి మేడారం మహాజాతర పోటెత్తుతున్న భక్తులు జాతర ఇలా... బుధవారం : సాయంత్రం గద్దెపైకి సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులు రాక గురువారం : సమ్మక్క గద్దెలపైకి రాక శుక్రవారం : గద్దెలపై కొలువుదీరనున్న అమ్మలు శనివారం : అమ్మల వనప్రవేశం ఇప్పటి వరకు దర్శించుకున్న భక్తులు: 30 లక్షల మంది సాక్షిప్రతినిధి, వరంగల్ : మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర అసలు ఘట్టం కొన్ని గంటల్లో మొదలుకానుంది. అటవీ ప్రాంతం ఇప్పటికే భక్తజన గుడారంగా మారగా, వన దేవత సారలమ్మ బుధవారం సాయంత్రం మేడారంలోని గద్దెపై కొలువుతీరనుంది. వన దేవతల వడ్డెలు (పూజారులు) ఇందుకోసం వారం రోజులుగా ఏర్పాట్లు చేస్తున్నారు. మేడారం సమీపంలోని కన్నెపల్లిలో ఉన్న సారలమ్మ గుడిలో మంగళవారం ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం గిరిజన పూజారులు సారలమ్మను కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలపైకి తెచ్చే ప్రక్రియ బుధవారం ఉదయం నుంచే మొదలవుతుంది. సాయంత్రం 6గంటలకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. తర్వాత కన్నెపల్లి నుంచి గిరిజన పూజారులు, జిల్లా అధికారులు సారలమ్మను తీసుకువస్తారు. సారలమ్మ గద్దెపైకి వచ్చేలోపే ఏటూరునాగారం మండలం కొండాయిలో కొలువైన గోవిందరాజులు, కొత్తగూడ మండలం పూనుగొండ్లలో కొలువైన పగిడిద్దరాజును సైతం మేడారం గద్దెల వద్దకు తీసుకువస్తారు. మంగళవారం కొత్తగూడ మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు పయనమయ్యూడు. పూనుగొండ్ల నుంచి కాలిబాటన 50 కిలోమీటర్లు ఉండడంతో వడ్డెలు ముందుగానే బయలుదేరారు. మేడారం సారలమ్మను కన్నెపల్లి నుంచి మేడారానికి తీసుకువచ్చే వేడుకను చూసేందుకు లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. వరాల తల్లి సమ్మక్క గురువారం మేడారం గద్దెలపై చేరనుంది. ఇద్దరు దేవతలు గద్దెలపై ఉండే శుక్రవారం మేడారం మొత్తం భక్తులతో నిండిపోనుంది. శనివారం దేవతలు గద్దెలపై నుంచి వనంలోకి వెళ్లడంతో జాతర ముగుస్తుంది. అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతరకు ఈసారి కోటి ఇరవై లక్షల మంది వస్తారని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు వారు ఏర్పాట్లు పూర్తి చేశా రు. అరుుతే జాతరకు నెల రోజుల ముందు నుంచే భక్తులు వస్తున్నారు. మంగళవారం వరకు 30 లక్షల మంది భక్తులు మేడారంలో మొక్కులు చెల్లించుకున్నారు. వందల ఏళ్లుగా... కాకతీయులతో సమ్మక్క పరివారం యుద్ధం క్రీస్తు శకం 1150-1159 మధ్యకాలంలో జరిగిందని తెలుగు విశ్వవిద్యాలయం శాస్త్రీయంగా చెబుతోంది. సమ్మక్క-సారలమ్మ జాత ర 12వ శతాబ్దం నుంచి జరుగుతోందని పలు శాసనాలు చెబుతున్నాయి. సమ్మక్కతో పోరు విషయంలో యుద్ధనీతికి వ్యతిరేకంగా సైనికులు చేసిన పనికి పశ్చాత్తాపపడిన రుద్రదేవుడు కోయ రాజ్యాన్ని తిరిగి వారికే అప్పగించాడు. తర్వాత ఈ కాకతీయరాజు సైతం సమ్మక్క భక్తుడయ్యారని 12 శతాబ్దంలోని శాసనాలు చెబుతున్నాయి. కాకతీయుల పరిపాలన ముగిసిన తర్వాతే మేడారం జాతర మొదలయ్యిందనే వాదనలు ఉన్నాయి. మొదట సమ్మక్కకు, సారలమ్మకు వేర్వేరు ప్రాంతాల్లో పూజలు చేసేవారు. సమ్మక్కతోపాటు యుద్ధంలో వీరమరణం పొందిన సారలమ్మకు మొదట మేడారంనకు మూడు కిలోమీటర్ల దూరంలోని కన్నెపల్లిలో మొక్కులు చెల్లించేవారు. 1960 తర్వాత సారలమ్మకు కూడా సమ్మక్క గద్దె పక్కనే గద్దెను నిర్మించారు. అప్పటి నుంచి మేడారం జాతర సమ్మక్క-సారలమ్మ జాతరగా మారింది. ప్రభుత్వపరంగా 1944లోనే మేడారం జాతరపై తహసీల్దారుతో కమిటీ ఏర్పాటైనట్లు పత్రాలు ఉన్నాయి. 1967లో జాతర దేవాదాయ శాఖ అధీనంలోకి వచ్చింది. 1968 నుంచి ప్రభుత్వం ఈ జాతర ఏర్పాట్లు చేస్తోంది. 1996లో రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. పాలకమండలి లేకుండానే... ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవంగా పేరొందిన మేడారం జాతర ఈసారి పాలకమండలి లేకుండానే జరుగుతోంది. గిరిజన జాతరపై పూర్తి స్థాయి పెత్తనం కోసం ప్రయత్నిస్తున్న ప్రభుత్వ తీరు వల్లే ఈ దుస్థితి దాపురించినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నారుు. రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర పూర్తిగా గిరిజన సంప్రదాయాల ప్రకారం జరుగుతుంది. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర పాలకమండలి పదవీ కాలం జనవరి 8తో ముగిసింది. ప్రస్తుతం సమ్మక్క-సారలమ్మ జాతరకు పాలకమండలి లేదు. ఈ పాలకమండలి గడువు ముగిసిపోతుందని ముందే తెలిసినా, దేవాదాయ శాఖ ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జాతరపై పెత్తనం కోసమే... కొత్త పాలకమండలి ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపలేదని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వనదేవతలకు ఎములాడ వస్త్రాలు వేములవాడ, న్యూస్‌లైన్: మేడారం సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లకు కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఆలయ పాలకమండలి చైర్మన్ బొమ్మ వెంకటేశ్వర్లు ప్రతిపాదనతో తొలిసారిగా ఈ సంప్రదాయానికి శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం శ్రీకారం చుట్టింది. సమ్మక్కకు పసుపు వర్ణపు పట్టుచీర, రెండు కనుములు.. సారలమ్మకు కుంకుమ వర్ణపు పట్టుచీర, రెండు కనుములు సమర్పిస్తారు. పగిడిద్దరాజుకు పట్టుపంచెను.. వీటితో పాటు 40 కిలోల బంగారం(బెల్లం) సమర్పించనున్నారు. ఆలయ చైర్మన్ వెంకటేశ్వర్లు, పాలకమండలి సభ్యులు, ఈవో సీహెచ్‌వీ కృష్ణాజీరావ్, ఏఈవో గౌరీనాథ్‌లు బుధవారం ఉదయం 10 గంటలకు వీటిని మేడారంలో సమర్పిస్తారు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే జాతరలో ఈ సంప్రదాయం కొనసాగించేలా దేవాదాయ శాఖ అనుమతి పొందారు. నేడు 3,525 బస్సులు మేడారం జాతరను పురస్కరించుకుని బుధవారం ఒక్కరోజే వివిధ ప్రాంతాల నుంచి 3,525 బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ మంగళవారం వెల్లడించింది. హైదరాబాద్, కరీంనగర్, మంచిర్యాల, గోదావరిఖని, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, ఇల్లందు, కొత్తగూడెం, నిజామాబాద్, ఆదిలాబాద్‌ల నుంచి ఈ బస్సులు నడుస్తాయని పేర్కొంది.