మేడారం గిరిజన జాతర ఘనంగా మొదలైంది. కోరిన కోరికలు నెరవేర్చే వన దేవత సారలమ్మ బుధవారం మేడారం గద్దెపై కొలువుదీరారు. పగిడిద్దరాజు, గోవిందరాజులు కూడా సారలమ్మతోనే గద్దెలపైకి చేరారు. బుధవారం సాయంత్రం కన్నెపల్లిలోని సారలమ్మ గుడి వద్ద ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం వడ్డెలు(పూజారులు) ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 6.18 గంటలకు గుడి నుంచి మొంటె (వెదురు బుట్ట)లో అమ్మవారి ప్రతిరూపమైన పసుపు, కుంకుమలు తీసుకుని మేడారానికి బయలుదేరారు. జంపన్నవాగులో నుంచి సమ్మక్క గుడికి చేరుకున్నారు.