‘అంగన్వాడీ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నా. నా కన్నా తక్కువ మార్కులు వచ్చిన వారికి పోస్టు ఇచ్చేశారు’..
విజయనగరం కంటోన్మెంట్:
‘అంగన్‌వాడీ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నా. నా కన్నా తక్కువ మార్కులు వచ్చిన వారికి పోస్టు ఇచ్చేశారు’.. గంట్యాడ మండలం కొర్లాం గ్రామానికి చెందిన పొనగంటి గీతా వాణి ఆవేదన ఇది. ‘నాకు 75 శాతం అంధత్వం ఉంది. వికలాంగుల కోటాలో అంగన్వాడీ పోస్టును నాకివ్వాలి. కానీ నాకన్నా తక్కువ మార్కులు వచ్చినమరో మహిళకు ఇచ్చేశారు’.. మెంటాడ మండలం కుంటినవలసకు చెందిన పెదిరెడ్ల దుర్గ ఆక్రోశమిది. వీళ్లిద్దరూ కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం కలెక్టరేట్‌కు వచ్చారు. తమకు జరిగిన అన్యాయంపై కలెక్టర్‌కు మొర పెట్టుకుందామని నిరీక్షించారు. వీళ్లేనా.. జిల్లావ్యాప్తంగా ఎందరో బాధితులు గగ్గోలు పెడుతున్నారు.
చలో కలెక్టరేట్: అంగన్వాడీ కార్యకర్తలు, మినీ కార్యకర్తలు, హెల్పర్ల పోస్టులు అనర్హులకు అమ్ముకున్నారని అర్హులకు అన్యాయం జరిగిందంటూ కలెక్టరేట్‌కు తరలి వస్తున్నారు. కలెక్టర్ ఎంఎం నాయక్‌కు ఫిర్యాదు చేసేందుకు బారులు తీరుతున్నారు. ఓట్లేసిన నేతల్ని అడిగితే మొహం చాటేశారని.. మీరైనా న్యాయం చేయండంటే అధికారులు కూడా మొహం తిప్పుకుంటున్నారని వాపోతున్నారు. సోమవారం జరిగే గ్రీవెన్స్‌సెల్‌కు ఫిర్యాదులు రావడం సహజమే. మామూలు రోజుల్లో సైతం ఈ అక్రమాలపై ఫిర్యాదులు వస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన అంగన్వాడీ పోస్టుల భర్తీలో అర్హులను పక్కన పెట్టి అనర్హులకు పోస్టులు కేటాయించడంతో ప్రభుత్వ యంత్రాంగంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోస్టులు అమ్ముకున్నారని కొందరు కోర్టుకు కూడా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
విజయనగరం మండలం కోరుకొండ అంగన్‌వాడీ పోస్టును అనర్హులకు ఇచ్చేశారు. ఇక్కడ ఎంపిక చేసిన పోలిపల్లి హైమావతి స్థానికురాలు కాదని, భర్త ఆర్మీలో ఉద్యోగం చేస్తుంటే విశాఖపట్నంలో ఉంటున్నారని సర్పంచ్ లగుడు శివాజీ ఫిర్యాదు చేశారు. గ్రామంలోని మూడు పోస్టులనూ అనర్హులకు మంజూరు చేశారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
- నెల్లిమర్ల మండలం జరజాపుపేట గ్రామానికి చెందిన బొలే వరలక్ష్మికి ఇద్దరు పిల్లలు. భర్త నారాయణరావు మృతి చెందడంతో పిల్లల పోషణ కష్టమై ఆయా పోస్టుకు దరఖాస్తు చేసింది. ఆమెకు పదో తరగతిలో 319 మార్కులు వచ్చాయి. ఈమె కంటే తక్కువ మార్కులు (248) వచ్చిన మద్దిల అపర్ణకు పోస్టు ఇచ్చారు.