ఇసుక రీచ్‌లలో... ‘శాండ్‌’కేట్లు!

Sakshi Special Focus On Sand Mafia In Andhra Pradesh

మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే రీచ్‌లు

రేవులను సొంత జాగీర్లలా మార్చుకున్న ఇసుక మాఫియా 

అనధికారికంగా రహదారుల ఏర్పాటు 

కప్పం ఇస్తేనే వాహనాలకు అనుమతి 

కాగితాలకే ‘ఉచితం’ పరిమితం 

జిల్లా శాండ్‌ కమిటీల ధరలు బుట్టదాఖలు 

ఇష్టారాజ్యంగా వసూళ్లు 

బాబు మాటలు : ‘‘ఇసుక అక్రమాలపై కఠినంగా వ్యవహరిస్తాం. ఈ వ్యవహారంలో నాయకుల ప్రమేయం ఉండటానికి వీల్లేదు. ఏటా 600–700కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకుని ఉచితంగా ఇస్తున్నాం. అక్రమాల్లో ఎవరి పాత్ర ఉన్నా వారిపై వేటు పడుతుంది. ఎక్కడి వారు అక్కడే ఉచితంగా ఇసుక తీసుకోవచ్చు. ఎవరైనా అడ్డుకుంటే తిరగబడాలి’’.. అని ఇసుకను ఉచితంగా ఇస్తామని ప్రకటించిన సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న మాటలివి. 

వాస్తవం : ఆచరణను మాత్రం మాటలను తుంగలో తొక్కారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ జిల్లాలో ఏ రీచ్‌ చూసినా ఇసుక అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే ఇసుక దోపిడీ ఎక్కువగా జరుగుతోంది. సామాన్యులు ఇసుకను ఉచితంగా తీసుకెళ్లే పరిస్థితి ఎక్కడాలేదు. అడ్డగోలుగా సాగుతున్న ఇసుక అక్రమ తవ్వకాల కారణంగా నదీ పరీవాహక ప్రాంతాల్లో భూగర్భ జలాలు 
దారుణంగా పడిపోతున్నాయి. 

సాక్షి, అమరావతి : నాలుగేళ్ల టీడీపీ సర్కారు పాలనలో జరిగిన ఇసుక దందా విలువ అక్షరాలా రూ.8,600 కోట్లు. రాష్ట్రంలో ఇసుక మాఫియా ఏ విధంగా చెలరేగిపోతోందో ఇది చూస్తే తెలిసిపోతుంది. ఇసుక రేవు (రీచ్‌)లను కొందరు అధికార టీడీపీ నేతలు సొంత జాగీర్లలా మార్చుకుని అడ్డగోలుగా తోడేస్తున్నారు. ఇటు ఒడిశా సరిహద్దులోని శ్రీకాకుళం మొదలు అటు కర్ణాటక సరిహద్దులోని అనంతపురం వరకూ అంతటా ఇదే పరిస్థితి. రెండేళ్లుగా ‘ఉచిత ఇసుక’ కాగితాలకే పరిమితమైంది. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని శాండ్‌ కమిటీలు నిర్ణయించిన ధరలు ఎక్కడా అమలుకావడంలేదు. ఇసుక మాఫియా చెప్పిందే ధర. ఇక రాజధాని ప్రాంతమైన కృష్ణా, గుంటూరు జిల్లాల మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేల ఆగడాలకు అడ్డూ అదుపులేదు. వారు చెప్పిందే శాసనం. 

తనిఖీలతో హుటాహుటిన క్రేన్ల తరలింపు 
ఇదిలా ఉంటే.. కృష్ణా నదిలో యంత్రాలతో జరుపుతున్న ఇసుక తవ్వకాలను అడ్డుకోవాలంటూ ఓ స్వచ్ఛంధ సంస్థ జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో వేసిన కేసు నేపథ్యంలో నిజనిర్ధారణ నివేదిక సమర్పణ కోసం ట్రైబ్యునల్‌ నియమించిన కమిటీ ప్రతినిధులు గుంటూరు జిల్లాలో పర్యటించారు. దీంతో ఇసుక మాఫియా గ్యాంగులు నదుల్లోని భారీ క్రేన్లను అక్కడ లేకుండా చేశారు. కమిటీ ప్రతినిధులు అటు పోగానే మళ్లీ ఎక్కడ క్రేన్లు అక్కడ అమర్చి యథాతథంగా దందా సాగిస్తున్నారు. కాగా, రాష్ట్రంలో మొత్తం 459 ఇసుక రేవులు ఉండగా ప్రజలు సొంత అవసరాలకు ఎక్కడ నుంచైనా ట్రాక్టర్లలో ఇసుక తీసుకెళ్లవచ్చు. కానీ, ఇది ఎక్కడా అమలుకావడంలేదు. ఇసుక నింపుకోవాలంటే కప్పం కట్టాల్సిందే. ‘రీచ్‌లోకి దారి మేమే నిర్మించాం. అందువల్ల ట్రాక్టరు వెళ్లాలంటే డబ్బు ఇవ్వాల్సిందే..’ అంటూ మాఫియా గ్యాంగులు వసూళ్లు సాగిస్తున్నాయి.  

చీకట్లో విచ్చలవిడిగా తవ్వకాలు 
అలాగే, నిబంధనల ప్రకారం ప్రైవేటు వ్యక్తులు రేవుల్లోకి లారీలను తీసుకెళ్లరాదు. సాగునీటి ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణం లాంటి ప్రభుత్వ కార్యకలాపాలకు మాత్రమే అనుమతులున్నాయి. వీటికి గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టం (జీపీఎస్‌) పరికరాలు అమర్చామని అధికారులు చెబుతున్నారు. అయితే, జీపీఎస్‌ పరికరాలను పనిచేయకుండా చేసి రాత్రి వేళల్లో తోడేసి ప్రైవేట్‌గా అధిక రేట్లకు అమ్ముతున్నారు. కర్నూలు, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల నుంచి కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలకు కూడా తరలించడం ద్వారా వేల కోట్లు దండుకుంటున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన ఒక మంత్రి అనుచరులు ఏకంగా ఇసుక రీచ్‌కు అనధికారికంగా రహదారి వేయించి తన సొంత ఆస్తిలా నడుపుతున్నారంటే దోపిడీ ఎంత బహిరంగంగా సాగుతుందో అర్థమవుతుంది. తూర్పు గోదావరి జిల్లాలో కూడా ఇలాగే నదిలో రెండు కిలోమీటర్ల పొడవునా అనుమతి లేకుండా రోడ్డు వేసేశారు. ఇదంతా అధికార పార్టీ పెద్దల వ్యవహారం కావడంతో అధికారులు కిక్కురుమనడంలేదు.  

రెండేళ్లలో రూ.5,000 కోట్లు దోపిడీ 
జిల్లా కమిటీలు నిర్ణయించిన ధరలతో పోల్చితే దాదాపు అన్ని జిల్లాల్లో 50 నుంచి 100 శాతం అధిక ధరలకు ఇసుకను అమ్ముతున్నారు. ఇది చాలదన్నట్లు కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలకు అక్రమంగా తరలించి పెద్ద లారీ ఇసుకను రూ.50వేల నుంచి 60 వేల వరకూ విక్రయిస్తున్నారు. తద్వారా టీడీపీ ఇసుక మాఫియా గత రెండేళ్ల కాలంలో (2016 జూన్‌ నుంచి 2018 మే వరకూ) రూ.5,000 కోట్లకు పైగా దండుకుందని అనధికారిక అంచనా. అలాగే, డ్వాక్రా సంఘాలు ఇసుక రీచ్‌లను నిర్వహించిన కాలంలో (2014 నవంబరు నుంచి 2016 మార్చి వరకూ) టీడీపీ నేతలు రూ.3,600 వేల కోట్లకు పైగా దోచుకున్నారని అంచనా. ఆ కాలంలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణావల్ల సర్కారు ఖజానాకు రూ.2,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని సాక్షాత్తు రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్వయంగా ప్రకటించడం గమనార్హం. 

పొంచివున్న పెను ముప్పు 
నిబంధనలకు విరుద్ధంగా నదుల్లో ఎక్కువ లోతు వరకు ఇసుక తవ్వకాలు సాగుతుండటం ప్రమాదకరమని పర్యావరణవేత్తలతోపాటు భూగర్భ జల నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలోని రీచ్‌లలో 2.82 కోట్ల క్యూబిక్‌ మీటర్ల (సుమారు 4.22 కోట్ల మెట్రిక్‌ టన్నుల) ఇసుకను ఏటా తవ్వుకోవచ్చని ప్రభుత్వం 2015లో అంచనా వేసింది. కానీ, 7 కోట్ల టన్నులకు పైగా తవ్వుతున్నారు. మీటరు లోతు మించి ఇసుక తవ్వరాదన్న నిబంధనను బేఖాతరు చేస్తూ 2 నుంచి 4 మీటర్ల లోతు వరకూ తవ్వేస్తున్నారు. దీనివల్ల పలువురు మృత్యువాత పడిన సంఘటనలూ ఉన్నాయి.  

సీఎం ఇంటికి కూతవేటు దూరంలో.. 

  • గుంటూరు జిల్లాలో నిబంధనలను ‘కృష్ణ’లో కలిపేసి నది మధ్యలో భారీ క్రేన్లు ఏర్పాటుచేసి డ్రెడ్జింగ్‌ ద్వారా బాగా లోతు వరకూ ఇసుక తోడేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార నివాసానికి కూతవేటు దూరంలో ఇంత జరుగుతున్నా ప్రభుత్వానికి కనిపించడంలేదు.  
  • ఉత్తరాంధ్రకు నేనే మంత్రినని చెప్పుకునే ఒక నేత ఒడిశాకు ఇసుక అక్రమ తరలింపులు జరిపిస్తూ వందల కోట్లు దండుకుంటున్నారు. 
  • గోదావరి జిల్లాలో ఒక మంత్రి అతిముఖ్యమైన రేవును సొంత నదిలా మార్చుకుని అనుచరులకు అప్పగించి వాటాలు మింగుతున్నారు.  
  • కర్నూలు జిల్లాలో మరో మంత్రి అనుచరులు ఏకంగా తుంగభద్రలో ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్డు నిర్మించారనే విషయం ఉన్నత న్యాయస్థానం వరకూ వెళ్లింది.  
  • కాగా, తవ్విన ఇసుకను 30 శాతానికిపైగా ఇతర రాష్ట్రాలకు యథేచ్ఛగా తరలిస్తూ చెక్‌ పోస్టులను చెకింగ్‌ లేని పోస్టుల్లా మార్చేశారు. ఇలా గత రెండేళ్లలో టీడీపీ నేతలు ఇసుక మాఫియా ద్వారా దోచుకున్న సొమ్ము రూ.5,000 కోట్ల పైమాటేనని అనధికారిక అంచనా. అంతకుముందు.. డ్వాక్రా సంఘాల ముసుగులో రూ.3,600 కోట్లకు పైగా దోచుకున్నారు. మొత్తం మీద తెలుగుదేశం నాలుగేళ్ల పాలనలో టీడీపీ నేతలు ఇసుక ద్వారా దండుకున్న మొత్తం రూ. 8,600 కోట్ల పైమాటే.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top