అవినీతి రహిత అభివృద్ధి చేసి చూపిస్తా

Sakshi Interview With Balineni Srinivas Reddy

ఒంగోలులో ఎలాంటి సమస్యలున్నాయో తెలుసు

సొంత ఇల్లు లేని వారికి ఉచితంగా ఇల్లు

సాక్షి ఇంటర్వ్యూలో బాలినేని శ్రీనివాసరెడ్డి

సాక్షి, ఒంగోలు సిటీ: ఒంగోలు కార్పొరేషన్‌ అయిన తర్వాత ప్రజలు ఆశించినంతగా అభివృద్ధికి నోచుకోలేదు. కొత్తపట్నం, ఒంగోలు మండలాల్లో అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఎక్కడ ఏ సమస్యలు ఎలాంటివి ఉన్నాయో అన్నీ తెలుసు. సమస్యలను గుర్తించాను. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ఒంగోలు నియోజకవర్గాన్ని బహుముఖంగా అభివృద్ధి చేయాల్సి ఉందని ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. సాక్షి ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. జనాభా పెరుగుతున్న కొద్ది వారి అవసరాలు బాగా పెరిగాయని, ప్రజల పాలకుల వద్ద నుంచి అభివృద్ధిని, అవినీతి రహిత పాలన ఆశిస్తున్నారు. ఈ రెండు చేయాలన్న కృతనిశ్చయంతో ఉన్నానన్నారు.

బహుముఖ అభివృద్ధి
ఒంగోలు నగరం జిల్లా కేంద్రం కావడంతో ఇక్కడ ఏర్పడాల్సిన స్థాయిలో హంగులు ఏర్పడలేదు. పాత ఒంగోలుతో పాటు కొత్తగా ఏర్పడిన శివారు కాలనీలు, నగరంలో కలిసిన గ్రామాల్లో ప్రజలు తాగేందుకు నీరు, రహదారుల విస్తరణ, మురుగునీటి పారుదలకు మెరుగైన సౌర్యాలు, మౌలికంగా అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఒంగోలు పరిపాలనా కేంద్రం కావడంతో ఇక్కడికి ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తున్నారు. వారికి ఏ కాస్త ఇబ్బంది కలగకుండా, ప్రజలు సౌకర్యవంతంగా జీవించేందుకు వీలుగా బహుముఖంగా అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సి ఉంది. గతంలో ఇక్కడ ప్రజలతో మమేకమై ప్రతిపక్షంలోనూ, స్వపక్షంలోనూ ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన అనుభవంతో అన్ని విధాల అభివృద్ధికి చర్యలు తీసుకంటా.

తాగునీటికి శాశ్వత పరిష్కారం
ఒంగోలు ప్రజలకు తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటాను. ఇప్పుడు రెండు సమ్మర్‌స్టోరేజీ ట్యాంకులు ఉన్నా వీటి నిల్వ సామర్థ్యం సరిపోవడం లేదు. ప్రజల అవసరాలు బాగా పెరిగాయి. శివారు కాలనీలకు ఓవర్‌హెడ్‌ ట్యాంకులు కావాలి. మూడో సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు కావాలి. ఇందుకు ఒంగోలుకు సమీపంలోనే భూసేకరణ చేసి స్టోరేజీ ట్యాంకు నిర్మాణానికి చర్యలు తీసుకుంటా. పైపులైన్లు బాగా దెబ్బతిన్నాయి. కొన్నిలైన్లు సిమెంట్‌ రోడ్ల కిందకి పోయి లీకేజీలు వచ్చినప్పుడు మరమ్మతులకు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. పైపులైన్ల వ్యవస్థను ఆధునీకరించేందుకు చర్యలు తీసుకుంటాను. గుండ్లకమ్మ నుంచి నీటిని తీసుకొని నగర ప్రజలకు తాగునీటి సమస్యలను శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటాను.

అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థకు చర్యలు
ఒంగోలుకు ఎప్పటి నుంచో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ కల సాకారం కాలేదు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు రూ.110 కోట్ల తాత్కాలిక అంచనాలతో అప్పట్లో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధికి ప్రతిపాదనలు ఇచ్చాను. ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబుకు కూడా అనేక సందర్భాల్లో ఈ ప్రాజెక్టుకు వినతిపత్రాలను ఇచ్చారు. అయితే ఈ ప్రతిపాదనలు ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు వ్యవ అంచనాలు బాగా పెరిగాయి. సుమారు రూ.500 కోట్లకుపైగా అంచనాలు పెరిగాయి. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ రావడం ద్వారా ఒంగోలును నిత్యం ఇబ్బంది పెడుతున్న మురుగు ముంపు బారి నుంచి రక్షణ పొందడమే కాకుండా పారిశుధ్య సమస్య తీరుతుంది. దోమల బెడద నుంచి తప్పించుకునేందుకు వీలు కలుగుతుంది. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాం.

సొంతింటి కల నెరవేరుస్తా
నగరంలో సుమారు 60 వేల కుటుంబాలు ఉన్నాయి. కొత్తపట్నం, ఒంగోలు మండలాల్లో ఇల్లు లేని కుటుంబాలు అనేకం ఉన్నాయి.  నగరంలో సుమారు పాతికవేల మందికిపైగా సొంత ఇల్లు లేని వారు ఉన్నారు. వీరిలో అర్హులైన వారందరికి పార్టీలతో సంబంధం లేకుండా సొంతింటి కల నేర్చాలన్నదే లక్ష్యం. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే ఉచితంగా ఇల్లు ఇస్తామన్న హామీని అమలు చేస్తామని..ఇందులో సొంతిల్లు లేని వారందరినీ ఇంటి యజమానులను చేస్తాం.

శివారుకాలనీల్లో మౌలిక వసతులు కల్పిస్తాం..
ఒంగోలు కార్పొరేషన్‌ కావడానికి శివారు గ్రామాలు కలిశాయి. శివారు కాలనీలు అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నాయి. తాగునీరు, మెరుగైన కరెంటు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఇలా వారికి ఏ సదుపాయం సక్రమంగా లేదు. ఒంగోలు కార్పొరేషన్‌లో కలిసిన గ్రామాలను నగరానికి అనుసంధానం చేస్తూ నగరాభివృద్ధికి చర్యలు తీసుకుంటా. గ్రామాలను అనుసంధానం చేస్తూ అభివృద్ధి చేయడం ద్వారా కార్పొరేషన్‌ అభివృద్ధి వేగవంతంగా ఉంటుందని వివరించారు.

పోతురాజు కాలువ ఆధునికీకరణ
ఒంగోలు నగరానికి మురుగునీటి అవుట్‌లెట్‌ లేకపోవడమే పెద్ద సమస్య. నగరంలో మురుగునీరు బయటకు వెళ్లడానికి సరైన వసతి లేదు. నగరానికి పెరిగిన అవసరానికి అనుగుణంగా మురుగునీటి అవుట్‌లెట్‌ లేదు. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ ద్వారా కొంత సమస్య తీరినా పోతురాజు కాలువ ఆధునికీకరణ పనులు చేపడితే గానీ సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు. వైఎస్సార్‌ సీఎంగా ఉన్న సమయంలో పోతురాజు కాలువ ఆధునికీరణకు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రతిపాదనలు ఇచ్చాను. ఇంత వరకు టీడీపీలోనూ ఈ ప్రతిపాదనలు ముందుకు పోలేదు. పోతురాజు కాలువ ఆధునీకరణ కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తాను.

నిరుపేదలందరికీ నివేశన స్థలాలు
నగరంలో ఇప్పటికే పది వేల మందికిపైగా ఇంటి నివేశన స్థలాలను ఇచ్చాను. సుమారు 600 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిలో పట్టాలిచ్చాను. తెలుగుదేశం ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలకు పొజిషన్‌ చూపించకుండా, కొన్ని పట్టాలను రద్దు చేసింది. ఇంకా 15 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. నగరంతోపాటు శివారుకాలనీలు, కొత్తపట్నం, ఒంగోలు గ్రామీణంలోని నిరుపేదలకు ఇంటి నివేశన స్థలాలను పెద్ద ఎత్తున ఇవ్వాలన్నది సంకల్పం. ఇందు కోసం భూసేకరణకు చర్యలు తీసుకొనైనా నిరుపేదల కల నెరవేరుస్తాను.

సామర్థ్యానికి తగ్గట్లుగా డంపింగ్‌ యార్డు
ఒంగోలుకు నిత్యం వస్తున్న చెత్తను డంపింగ్‌ చేసుకోవడానికి డంపింగ్‌యార్డు సమస్య తీవ్రంగా ఉంది. గుత్తికొండవారిపాలెం వద్ద ఉన్న డంపింగ్‌యార్డు సమస్యను తీర్చకుంది. నగరానికి దూరంగా కొత్తగా అవసరానికి తగ్గట్లు, తగిన సామర్థ్యం ఉన్న డంపింగ్‌యార్డులను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటాను. ప్రధానంగా అవినీతిరహిత పాలన అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాను. ఒంగోలు అసెంబ్లీలో ఎలాంటి సమస్యలున్నాయో అన్నీ తెలుసునని, వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే..జగన్‌ సీఎం అయిన వెంటనే  ఆదర్శ ఒంగోలుగా తీర్చిదిద్దుతా.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top