వైఎస్సార్‌సీపీతోనే మైనార్టీలకు మేలు

Sajjala Ramakrishna Reddy at Minority Sessions State Convention - Sakshi

ఆచరణ సాధ్యం కాని హామీలను జగన్‌ ఇవ్వరు

బాబు వైఫల్యాలను, అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

మైనార్టీ విభాగం రాష్ట్ర సదస్సులో సజ్జల రామకృష్ణారెడ్డి

సాక్షి, అమరావతి: మైనార్టీల జీవితాల్లో వెలుగులు నింపే ప్రణాళిక వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద ఉందని, ఆయనను ముఖ్యమంత్రిని చేసి అభివృద్ధి దిశగా అడుగులు వేయడానికి సిద్ధంగా ఉండాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సోమవారం వైఎస్సార్‌సీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్‌బాషా అధ్యక్షతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు.   సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళలంతా కలిసికట్టుగా ఉండి సీఎం చంద్రబాబు అవినీతి, వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. నాలుగేళ్లుగా అధికార పార్టీ చేస్తున్న అవినీతి, దుర్మార్గాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ అతిగొప్ప ప్రతిపక్షనేతగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదిగారని గుర్తు చేశారు.

నిత్యం ప్రజల క్షేమం కోసం తపిస్తూ ఆయన అనేక పోరాటాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకువస్తూ.. నిజమైన ప్రజాపాలన ఎలా ఉంటుందో చెబుతూనే..మరోవైపు మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నారన్నారు. ముస్లిం మైనార్టీలంతా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ వెంటే ఉన్నారని చెప్పారు. మైనార్టీలకు వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేసిన ప్రయోజనాన్ని ఎవరూ మరువలేరని తెలిపారు. చంద్రబాబు చరిత్రంతా వంచన, మోసం, వెన్నుపోటు, దగా చేయడమేనని మండిపడ్డారు. ముక్కుసూటితనం, స్వచ్ఛమైన రాజకీయాలు చేయడమే వైఎస్‌ జగన్‌ వ్యవహారశైలి అని పేర్కొన్నారు.విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త షేక్‌ మహ్మద్‌ ఇక్బాల్‌ మాట్లాడుతూ ముస్లింలు సామాజికంగా, రాజకీయంగా, ఉద్యోగాల్లో రాణించే విధంగా వైఎస్సార్‌సీపీ పథకాలు ఉండబోతున్నాయని తెలిపారు.

ముస్లిం సోదరులంతా వైఎస్సార్‌సీపీకి అండగా నిలవాలని కోరారు.  మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్‌భాషా మాట్లాడుతూ  బీజేపీతో టీడీపీ కలిసి ముస్లింలకు ద్రోహం చేసిందన్నారు. చంద్రబాబు తన కేబినెట్‌లో ఒక్కముస్లింకు కూడా స్థానం కల్పించలేదంటే.. ఆయనకు ముస్లింలపై ఉన్న గౌరవం ఏపాటిదో తేలిపోతుందన్నారు. త్వరలో గుంటూరు వేదికగా వేలాది మందితో ముస్లిం గర్జన నిర్వహిస్తామని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హెచ్‌.ఆర్‌ రెహమాన్‌ మాట్లాడుతూ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముస్లింలను ఆదుకోవాలనే ఉద్దేశంతో 4 శాతం రిజర్వేషన్లను అమలు చేశారన్నారు.

విజయవాడలో జలీల్‌ఖాన్, కదిరిలో చాంధ్‌బాషా  వైఎస్సార్‌సీపీ టికెట్‌పై గెలిచి..తర్వాత కోట్ల రూపాయలకు చంద్రబాబుకు అమ్ముడు పోయారని విమర్శించారు. వైఎస్సార్‌ కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యే అంజాద్‌ భాషా, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్‌ ముస్తఫా మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే శక్తి జగన్‌మోహన్‌ రెడ్డికి మాత్రమే ఉందన్నారు. వైఎస్సార్‌సీపీ విజయవాడ నగర అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్, ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, సెంట్రల్‌ ఆఫీస్‌ మైనారిటీ విభాగం ఇన్‌చార్జి వెంకట్, జిల్లా డాక్టర్స్‌ సెల్‌ అధ్యక్షుడు మహబూబ్‌ షేక్, మైనార్టీ విభాగం అధ్యక్షుడు గౌస్‌ మొహిద్దీన్‌ పాల్గొన్నారు.
 
పార్టీకి అంకితభావంతో పనిచేసిన వారికి ప్రశంసా పత్రాలు..

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మైనారిటీ విభాగంలో అంకిత భావంతో పనిచేసిన వారికి సజ్జల రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు. ఇందులో భాగంగానే ఎస్‌.కె. జిలాని (గుంటూరు), ఐహెచ్‌ ఫరూఖీ (విశాఖపట్నం), ఇషాక్‌ భాషా (నంద్యాల)కు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతకంతో కూడిన ప్రశంసా పత్రాలను అందజేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top