నేను బతకవచ్చు.. చనిపోవచ్చు., తప్పుగా అనుకోవద్దు

Rudravaram SI Vishnu Narayana Goes Missing At Midnight - Sakshi

సాక్షి, ఆళ్లగడ్డ : రుద్రవరం పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ విష్ణునారాయణ శనివారం అర్ధరాత్రి అదృశ్యమయ్యారు. తిరిగి ఆదివారం సాయంత్రం ఆళ్లగడ్డ డీఎస్పీ పోతురాజు ఎదుట హాజరయ్యారు. దీంతో జిల్లా పోలీసు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రుద్రవరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఓ కేసు విషయంలో ఎస్‌ఐ విష్ణునారాయణను, శిరివెళ్ల సీఐ విక్రమసింహను మూడు రోజుల క్రితం.. జిల్లా ఎస్పీ కర్నూలుకు పిలిపించారు. రెండు రోజులు కార్యాలయంలో ఉండాలని ఆదేశించారు. దీంతో మనస్తాపం చెందిన ఎస్‌ఐ.. శనివారం రాత్రి రుద్రవరం చేరుకుని పోలీస్‌ వాట్సాప్‌ గ్రూప్‌లో ‘ ఈ మెస్సేజ్‌ చదివే సమయానికి నేను బతకవచ్చు.. లేక చనిపోవచ్చు.. దయచేసి నన్ను చెడుగా అనుకోవద్దు’అని మెస్సేజ్‌ పెట్టారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఆళ్లగడ్డ డీఎస్పీని అప్రమత్తం చేయడంతో ఆయన, ఆళ్లగడ్డ సీఐ రమణ, శిరివెళ్ల సీఐ విక్రసింహ, అందుబాటులో ఉన్న ఎస్‌ఐలు రుద్రవరానికి వెళ్లి..ఎస్‌ఐ విష్ణునారాయణకు నచ్చజెప్పారు.

ఆయనకు ముఖ్యుడైన మరో ఎస్‌ఐని అక్కడే ఉంచి వచ్చారు. అయితే రాత్రి ఇంటికి వెళ్లిన విష్ణు నారాయణ తన సరీ్వస్‌ రివాల్వర్‌తో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నిస్తుండగా కుటుంబ సభ్యులు వారించారు. తెల్లవారు జామున కుటుంబ సభ్యులు లేచి చూసేసరికి ఆయన కనిపించలేదు. సెల్‌ఫోన్‌కూడా స్విచ్ఛాప్‌ కావడంతో ఆందోళన చెందారు. ఈ విషయాన్ని పోలీస్‌ అధికారుల దృష్టికి తీసుకు పోవడంతో వారు గాలింపు చర్యలు చేపట్టారు. కొంత సమయానికి ఆయన నడుపుతున్న కారు చాగలమర్రి టోల్‌గేట్‌లోనుంచి కడప వైపు వెళ్లిందని సమాచారం వచ్చింది. అయినప్పటికీ ఎక్కడకు వెళ్లాడు.. ఏం చేసుకున్నాడో అని ఆందోళన చెందుతున్న సమయంలో ఆదివారం సాయంత్రం సెల్‌ఆన్‌ కావడంతో ఫోన్‌ చేసి మాట్లాడారు. మనసు బాగాలేక బ్రహ్మంగారి మఠం వెళ్లానని చెప్పడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. డీఎస్పీ కార్యాలయం చేరుకున్న ఎస్‌ఐ విష్ణు నారాయణ మాట్లాడుతూ.. కుటుంబ సమస్యలు, పని ఒత్తిడిని తట్టుకోలేక మానసిక ప్రశాంతత కోసం తమ స్వగ్రామమైన వైఎస్సార్‌ జిల్లా తొండూరు మండలం సంతకొవ్వూరుకు వెళ్లానని చెప్పారు. డీఎస్పీ మాట్లాడుతూ.. జరిగిన విషయంపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top