
వర్సిటీ అభివృద్ధికి రూ.97 కోట్లు
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు, మౌలిక వసతుల కల్పనకు, బోధన..
- ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని వీసీ వియ్యన్నారావు వెల్లడి
- వృత్తి విద్యాకళాశాల అభివృద్ధికి చర్యలు
- స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు
ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు, మౌలిక వసతుల కల్పనకు, బోధన.. బోధనేతర కార్యక్రమాల నిర్వహణకు 97 కోట్ల రూపాయలు అవసరమని పేర్కొంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని వైస్‌చాన్సలర్ ఆచార్య కె.వియ్యన్నారావు చెప్పారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 5న జరిగిన విశ్వవిద్యాలయాల వీసీల సమావేశంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య ఎల్.వేణుగోపాలరెడ్డి సూచన మేరకు ఈ ప్రతిపాదనలను సిద్ధం చేశామని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్రం ప్రత్యేకంగా విడుదల చేయనున్న నిధులకు సంబంధించి ఉన్నత విద్యారంగం నుంచి రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఈ ప్రతిపాదనలను కోరిందన్నారు. ఈ మేరకు వర్సిటీలోని ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కాలేజీల అభివృద్ధికి, వృత్తి విద్యా కళాశాలల్లో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది నియామకం, మౌలిక వసతుల కల్పన, పరికరాలు, పుస్తకాలు, ఫర్నీచర్ కొనుగోలుకు విడివిడిగా ప్రతిపాదనలు పంపామని పేర్కొన్నారు.
వీటితోపాటు వర్సిటీలో కొత్తగా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయూలని ప్రతిపాదించామన్నారు. అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి అయా అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు స్టాఫ్‌ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు నిధులు ఇవ్వాలని కోరామని తెలిపారు. అన్ని యూనివర్సిటీల నుంచి వచ్చిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిస్తుందని వీసీ వెల్లడించారు. గతంలో రూసా(రాష్ట్రీయ ఉచ్చాతర్ శిక్షా అభియాన్) పథకం కింద ఏఎన్‌యూ నుంచి కేంద్ర మానవ వనరుల శాఖకు పంపిన ప్రతిపాదనల్లో పేర్కొనని అంశాలను ఇప్పుడు ప్రతిపాదించామని తెలిపారు.