అయ్యో! పాపం | Sakshi
Sakshi News home page

అయ్యో! పాపం

Published Thu, Oct 26 2017 8:30 AM

road accident in vijayawada - Sakshi

భార్యాభర్తలు చిరు ఉద్యోగులు.. రోజులాగానే డ్యూటీలకు బైక్‌పై బయలుదేరారు. మృత్యువు ఆగి ఉన్న విషయాన్ని గుర్తించలేదు. లారీని బైక్‌తో ఢీకొట్టాడు. వంశీకృష్ణతో పాటు కుమార్తె మృతి చెందింది. భార్య వైద్యశాలలో తీవ్రగాయాలతో చికిత్స పొందుతోంది. ఆ కుటుంబంలో పెనువిషాదం..

గన్నవరం: పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం ఉప్పులూరుకు చెందిన ఆచంట వంశీకృష్ణ(35) గ్రామ సమీపంలోని ఓ ప్రైవేట్‌ సంస్థలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. భార్య సౌజన్య గన్నవరంలోని శ్రీచైతన్య స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. కుమార్తె వశిష్ట(6) అదే పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. గ్రామం నుంచి ప్రతి రోజు ఉదయాన్నే వంశీకృష్ణ బైక్‌పై భార్య, కుమార్తెను స్కూల్‌కు తీసుకొస్తాడు. రోజు లాగానే బుధవారం ఉదయం బైక్‌పై భార్య, కుమార్తెను తీసుకుని వంశీకృష్ణ గన్నవరం బయలుదేరాడు.

కార్ల ఓవర్‌టెక్‌తో.. తికమక..
స్థానిక విమానాశ్రయం వద్దకు రాగానే జాతీయ రహదారిపై రెండు కార్లు ఓవర్‌టెక్‌ చేసుకుంటూ వెళ్తూబైక్‌పైకి దూసుకొచ్చాయి. దీంతో వాటిని తప్పించుకునే వెళ్లే క్రమంలో జాతీయ రహదారి పక్కనే పార్కింగ్‌ చేసి ఉన్న లారీని బలంగా ఢీకొట్టారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. చిన్నారి తల నుంచి పుర్రె వేరుకావడంతో స్థానికులు భయాందోళన చెందారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ..
ఈ ప్రమాదంలో ముందువైపు కూర్చున్న వశిష్ట తలకు, వంశీకృష్ణ చాతి భాగంలో బలమైన గాయాలయ్యాయి. సౌజన్యకు మాత్రం కాలికి తీవ్ర గాయమైంది. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది కొనఊపిరితో కొట్టుమిట్టడుతున్న విశిష్ట, వంశీకృష్ణను, సౌజన్యను సమీపంలోని పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రికి తరలించారు. వైద్య చికిత్సలు ప్రారంభించిన కొద్దిసేపటికే వంశీకృష్ణ, వశిష్టలు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం మృతదేహాలను గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత బంధువులకు అప్పగించారు. ప్రమాద ఘటన గురించి తెలియగానే బందువులు, ఉప్పులూరు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఆస్పత్రి వద్ద విషాదచాయలు అలుముకున్నాయి.  

Advertisement
Advertisement