రీ పోలింగ్‌.. బీఅలర్ట్‌!

RO Visit Re Polling Station in Nellore Kovuru Constituency - Sakshi

రీ–పోలింగ్‌స్టేషన్‌ను పరిశీలించిన ఆర్వో

సాక్షి ప్రతినిధి, నెల్లూరు:   జిల్లాలోని నెల్లూరు పార్లమెంట్‌ పరిధిలోని కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాళెం మండలం పల్లెపాళెంలో ఉన్న పోలింగ్‌ కేంద్రం 41లో,  తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గంలోని సూళ్లూరుపేట మండలంలోని అటకానితిప్పలో ఉన్న బూత్‌ నంబర్‌ 197లో ఈ నెల 6వ తేదీన పార్లమెంట్‌ అభ్యర్థి ఓటుకు సంబంధించి రీ పోలింగ్‌ జరగనుంది. జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్న కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు పోలింగ్‌ నిర్వహణకు సంబంధించిన ప్రక్రియపై కసరత్తు మొదలు పెట్టారు. జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి కూడా అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో ఏర్పాటు చేసే తరహాలో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. మరో వైపు వైఎస్సార్‌సీపీ, టీడీపీలు బూత్‌లోని ఓటర్లపై దృష్టి సారించారు. అధికార టీడీపీ అయితే మళ్లీ ప్రలోభాల పర్వాన్ని నమ్ముకొని కసరత్తు మొదలు పెట్టింది. ఆయా బూత్‌ల పరిధిలో ఉన్న సామాజిక సమీకరణాలపై దృష్టి నిలిపి ప్రలోభాల కొనసాగించడానికి సన్నద్ధం అయింది. వాస్తవానికి రాజకీయ పార్టీలు జిల్లాలో ఫలితాలపై రకరకాల చర్చలు, లెక్కలు వేసుకొని గెలుపు తమదేనని ఇప్పటికే ప్రకటించకున్నాయి. ఈ క్రమంలో రీపోల్‌ రావడంతో అందరి దృష్టి దానిపై నెలకొంది. అది కూడా నెల్లూరు, తిరుపతి పార్లమెంట్‌కు సంబంధించిన ఒక్క ఓటు కావటంతో ఎంపీ అభ్యర్థులు రీపోల్‌ జరిగే ప్రాంతాల్లో బూత్‌ ఏజెంట్ల నుంచి అందరితో మాట్లాడుతున్నారు. పల్లెపాళెం బూత్‌ పరిధిలో 1,084 ఓట్లు,  అటకాని తిప్ప బూత్‌ పరిధిలో 5,53 ఓట్లు ఉన్నాయి.  

రిజర్వ్‌లోని ఈవీఎంలతో..
జిల్లాలో ఒక్కొక్క పార్లమెంట్‌ సెక్టార్‌ పరిధిలో రిజర్వ్‌లో ఈవీఎంలను ఎన్నికల కమిషన్‌ ఏర్పాటు చేసింది. వాటిలో ఒక్కొక్క ఈవీఎంను ఒక్కొక్క పోలింగ్‌ కేంద్రంలో ఏర్పాటు చేయనున్నారు. కేవలం ఎంపీ ఓటు ఒక్కటే వినియోగించుకోవాల్సి ఉండటంతో రెండు చోట్ల ఒక్కొక్క ఈవీఎంను ఏర్పాటు చేయడంతో పాటు రిజర్వ్‌లో మరో ఈవీంను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. వేసవి కాలం కావడంతో వడగాలులు అధికంగా ఉన్న క్రమంలో రెండు నియోజకవర్గాల్లోని పోలింగ్‌ కేంద్రాల వద్ద టెంట్‌లు ఏర్పాటు చేయటంతో ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. శుక్రవారం ఎన్నికల కమిషన్‌ జిల్లా కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనుంది. సమావేశం అనంతరం పోలింగ్‌ స్టేషన్‌కు సిబ్బంది కేటాయింపుపై సృష్టత ఇచ్చే అవకాశం ఉంది. రీపోలింగ్‌ జరిగే రెండు చోట్ల అధికారులను సస్పెండ్‌ చేసిన క్రమంలో వారి స్థానంలో కొత్త అధికారులను నియమించే అవకాశం ఉంది. ఒక్కొక్క స్టేషన్‌కు పోలింగ్‌ అధికారితో కలిపి ఆరుగురు సిబ్బందిని నియమిస్తారు. 4వ తేదీన రెండు పోలింగ్‌ స్టేషన్‌ సిబ్బందికి ట్రైనింగ్‌ కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్‌ ముత్యాలరాజు ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. జనరల్‌ అబ్జర్వర్‌తో పాటు మరో అబ్జర్వర్, పోలీస్‌ అబ్జర్వర్లు ఈ నెల 4 నుంచి విధుల్లో ఉంటారని వివరించారు.

నేడు నగరంలో డీజీపీ సమీక్ష
6న రీపోలింగ్‌ జరగనున్న రెండు సెంటర్లలో బందోబస్తు వ్యవహారాలపై శుక్రవారం డీజీపీ ఆర్పీ ఠాగూర్‌ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆయనతో పాటు లా అండ్‌ ఆర్డర్‌ అదనపు డీజీపీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ ఇప్పటికే నెల్లూరు నగరానికి చేరుకున్నారు. రీపోల్‌ ఏర్పాటుతో పాటు 23న జరిగే కౌంటింగ్‌కు సంబంధించి కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లపై సమీక్షించి స్ట్రాంగ్‌ రూమ్‌లు పరిశీలించనున్నారు.  

బుచ్చిరెడ్డిపాళెం : మండలంలోని ఇస్కపాళెం పంచాయతీ పల్లిపాళెంలోని 41వ పోలింగ్‌స్టేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సుధాకర్‌ రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీన 41వ పోలింగ్‌ స్టేషన్‌లో పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధిం చి రీ పోలింగ్‌ నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించిందన్నారు. ఈ నేపథ్యంలో పోలింగ్‌ స్టేషన్లోని వసతులను పరిశీలించేందుకు వచ్చామన్నారు. వసతుల కల్పనపై స్థానిక అధికారులతో మాట్లాడామన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఆయన వెంట ఎంపీడీఓ డి.వి.నరసింహారావు, తహసీల్దార్‌ విజయలక్ష్మి తదితరులు ఉన్నారు.

అట్టకానితిప్పపైనేఅందరి దృష్టి
సూళ్లూరుపేట రూరల్‌: అందరి దృషి ఈ నెల 6వ తేదీన రీపోలింగ్‌ జరుగనున్న అట్టకానితిప్పపైనే ఉంది. 197వ బూత్‌లో రీ పోలింగ్‌ నిర్వహించాలని ఈసీ ఉత్తర్వులు జారీచేయడంతో రాజకీయనాయకులు కన్నేశారు. గత నెల 11వ తేదీన జరిగిన సాధారణ ఎన్నికల పోలింగ్‌ సమయంలో అటకానితిప్పలో ఎంపీ స్థానానికి చెందిన  ఈవీఎం మొరాయించింది.  దాని స్థానంలో వేరే ఈవీఎం మిషన్‌ను ఏర్పాటు చేశారు. అయితే మొరాయించిన ఈవీఎం మిషిన్‌లో అప్పటికే దాదాపు 200 ఓట్లు నమోదయ్యాయి. ఎన్నికలు పూర్తయిన అనంతరం అదనపు ఈవీఎం మిషన్‌ను సీల్‌వేసి స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించారు. అక్కడ ఈవీఎంలు లెక్క తేలలేదు. దీంతో ఈసీ ఈ ప్రాంతంలో రీపోలింగ్‌ నిర్వాహించాలని ఆదేశాలు జారీ చేసింది..  ఈ పోలింగ్‌ కేంద్రంలో దాదాపు 558 ఓట్లు ఉన్నాయి. దీంతో ఆయా పార్టీ నాయకులు నేతలు సంప్రదింపులు జరిపి ఓటింగ్‌ శాతం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే స్థానిక అధికారులకు మాత్రం రీ పోలింగ్‌ సంబంధించి ఎటువంటి సమాచారం అందలేదని చెబుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top