చంపాస్తున్నారు | river surplus Champawati | Sakshi
Sakshi News home page

చంపాస్తున్నారు

May 29 2015 3:21 AM | Updated on Aug 28 2018 8:41 PM

ధనార్జనే ధ్యేయంగా ఇసుకాసురులు చేస్తున్న ఆగడాలతో చంపావతి నదికి గర్భశోకం మిగులుతోంది. అక్రమార్కులు నదిని ఆక్రమించుకుని సొంతంగా ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేసుకుం టూ ఇసుకను తోడేస్తున్నారు.

ధనార్జనే ధ్యేయంగా ఇసుకాసురులు చేస్తున్న ఆగడాలతో చంపావతి నదికి గర్భశోకం మిగులుతోంది. అక్రమార్కులు నదిని  ఆక్రమించుకుని సొంతంగా ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేసుకుం టూ ఇసుకను తోడేస్తున్నారు. అధికార పక్షం అండదండలుండడంతో  అధికారులు కూడా అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. అధికార యంత్రాంగానికి సవాల్ విసురుతూ ఇసుక మాఫియా జిల్లాలో ఎక్కడికక్కడ తిష్ఠ వేసింది.  
 
 విజయనగరం, సాక్షిప్రతినిధి: చిన్న మరుగుదొడ్డి కట్టుకునేందుకు కూడా ఇసుక దొరకడం కష్టమవుతున్న ఈ రోజుల్లో చంపావతి నది ఒడ్డును సైతం లాగేసి రెండు కిలోమీటర్ల దూరంలో వందల లోడ్ల ఇసుకను  డంపింగ్ చేస్తున్నారు. గజపతినగరం మండలం కెంగువ గ్రామం వెంబడి చంపావతి నది ప్రవహిస్తోంది. ఈ నదిలో ఇసుక మేటలు బాగానే ఉన్నాయి. గ్రామానికి చెందిన తెలుగు దేశం నాయకుడొకరు నదిలో ఉన్న ఇసుకను యథేచ్ఛగా  దోచుకుంటున్నారు. ఇసుక రీచ్ మంజూరు కాకుండానే ఇక్కడి ఇసుకను గ్రామ పరిసరాల్లోనూ, పొలిమేరల్లోనూ ఎక్కడ బడితే అక్కడ డంపింగ్‌చేసి నిల్వలు పెంచుకుంటున్నారు. వర్షాకాలంలో  ఇసుక ధర పెరిగి వ్యాపారం బంగారంలా సాగుతుంది. అందుకే ప్రస్తుతం తవ్వుతున్న ఇసుక అంతా అమ్ముకోకుండా కొద్ది కొద్దిగా అమ్ముతూ మరికొంత దాచుకుంటు న్నారు. మూడు నెలలుగా ఈ ఇసుక దందా జరుగుతోంది. రోజుకు 20 యూనిట్ల మేరకు నది నుంచి 2 కిలోమీటర్ల పరిధిలో ఇసుకను డంపింగ్ చేస్తున్నారు.
 
 మరిన్ని ట్రాక్టర్లున్నా..!: కెంగువ అనధికార రీచ్‌లో ఇసుక తరలించేందుకు ఏ ట్రాక్టరు యజమానీ ముందుకు రాకపోవడం విశేషం. అనధికార రీచ్‌ను నడుపుతున్న టీడీపీ నాయకుడి వాహనం ఒక్కటే రోజంతా ఇసుకను తరలించి డంపింగ్ చేస్తూ నిల్వలను పెంచుతున్నారు.  గ్రామంలో సుమారు ఆరు నుంచి పది ట్రాక్టర్ల వరకూ ఉన్నట్టు భోగట్టా! కానీ వీరెవరూ ఈ ఇసుకను తరలించడానికి ముందుకు రావడం లేదంటే అధికార పక్షం దన్ను ఎంతగా ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. ప్రస్తుతం ఇక్కడి నుంచి ఇసుక ట్రాక్టరు లోడ్‌కు రూ.1500 నుంచి రెండు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. వ్యాపారం జరుగుతుండగానే  ఇసుక లోడ్లను నిల్వలు చేస్తున్నారు.
 
 కమిటీలు ఏం చేస్తున్నట్లో..!:  గ్రామస్థాయిలోనూ, మండల స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ ఇసుక అక్రమ రవాణా నిరోధక కమిటీలను కలెక్టర్ ఆధ్వర్యంలో వేశారు. ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తే మూడు విడతలుగా భారీ జరిమానాలు అమలు చేస్తున్నామని అధికారులు ప్రకటించారు. ఈ కమిటీల్లో ఎస్సై, తహశీల్దార్, వీఆర్వో తదితరులున్నా ఎక్కడా తనిఖీలు లేకపోవడంతో  ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదని స్పష్టమవుతోంది. ఈ కమిటీలు కూడా చూసీ చూడనట్లు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని జిల్లా వ్యాప్తంగా విమ ర్శ లు వస్తున్నాయి. ప్రారంభంలో కాస్త కఠినంగా వ్యవహరించిన జిల్లా, మండల స్థాయి యంత్రాంగం ఇప్పుడు ఆ స్థాయిలో వ్యవహ రించడం లేదని, తిరిగి అక్రమార్కులకే వంత పాడుతూ ఇసుక రవాణాకు పరోక్షంగా సహకరిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరిచి ఈ అక్రమ డంపింగ్‌ను నిలిపివేయాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement