అంబేడ్కర్‌ విగ్రహ తొలగింపు యత్నం

Revenue Staff Trying To Remove ambedkar statue - Sakshi

టీడీపీ నేతల దురాగతం అడ్డుకున్న ప్రజలు

చావడానికైనా సిద్ధమేనంటూ ఆందోళన

వెనుతిరిగిన రెవెన్యూ, పోలీస్‌ అధికారులు

పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల: మండలంలోని కోడిగూడెంలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని తొలగించేందుకు వచ్చిన రెవెన్యూ సిబ్బందిని, పోలీసులను స్థానికులు శుక్రవారం అడ్డుకున్నారు. తమ ప్రాణాలు పోయినా సరే విగ్రహ తొలగింపునకు ఒప్పుకునేది లేదంటూ జేసీబీకి అడ్డుపడ్డారు. దీంతో అక్కడున్న అధికారులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. దీంతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. చివరకు రెవెన్యూ సిబ్బంది,పోలీసులు అక్కడి నుంచి వెనుతిరగడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది.  స్థానికుల కథనం ప్రకారం.. ద్వారకాతిరుమల మండలం కోడిగూడెంలో ఎస్సీ కమ్యూనిటీ హాలు వద్ద ఈ ఏడాది అక్టోర్‌ 24న రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

అయితే ఆ స్థలంలో సుమారు రూ. 6 లక్షలతో వెలుగు గ్రామ సంఘం కార్యాలయ భవనాన్ని నిర్మించాలని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చెలికాని సోంబాబు మరికొందరు నిర్ణయించారు. అయితే ఆ స్థలంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ విగ్రహాన్ని తొలగించాలని రెవిన్యూ, పోలీస్‌ అధికారులపై సోంబాబు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ఎస్సీ కాలనీ వాసులంతా కలసి కొద్దిరోజుల క్రితం సోంబాబు, చెలికాని వేణుగోపాలరావు, డొక్కా ధర్మరాజు, బొబ్బిలి గంగాధరరావు, మానుకొండ ఏసోబులపై  రెవెన్యూ, పోలీస్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే శుక్రవారం తహసీల్దారు టీడీఎల్‌ సుజాత, ఆర్‌ఐ వెంకటరమణ, ద్వారకాతిరుమల, భీమడోలు ఎస్సైలు ఐ.వీర్రాజు, బి.మోహనరావు, రెవెన్యూ, పోలీస్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని అంబేడ్కర్‌ విగ్రహాన్ని జేసీబీ సహాయంతో తొలగించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ఎస్సీ కాలనీ వాసులంతా కలిసి జేసీబీని, అధికారులను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. చివరకు రెవెన్యూ, పోలీస్‌ యంత్రాంగం అక్కడి నుంచి వెనుతిరగడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది.

చావడానికైనా సిద్ధమే
అధికారం చేతిలో ఉంది కదా అన్న ధీమాతో సోంబాబు అతని అనుచరులు విగ్రహ తొలగింపునకు పట్టుబట్టడం సరికాదని ఎస్సీ కాలనీ వాసులు ధ్వజమెత్తుతున్నారు. విగ్రహ ఏర్పాటుకు అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలన్న విషయం తెలియక విగ్రహాన్ని నిర్మించామని, ఇప్పుడు తమ మనోభావాలు దెబ్బతినే విధంగా విగ్రహాన్ని తొలగిస్తానంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ కోసం తమ ప్రాణాలను అర్పించడానికైనా సిద్ధమేనని అంటున్నారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు దౌర్జన్యం ఆపాలని, లేకుంటే తగిన మూల్యం చెల్లించక తప్పదని వారు ధ్వజమెత్తారు.

కాసులకోసం కక్కుర్తి!
ఏదైనా ప్రభుత్వ భవనం నిర్మించాలంటే ముందు గ్రామ సభ నిర్వహించి, ప్రజలకు అనుకూలమైన ప్రాంతంలో దాన్ని నిర్మించాల్సి ఉంటుందని, అయితే దానికి విరుద్ధంగా టీడీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతంలో నుయ్యి ఉండేదని, దాన్ని ఇటీవలే పూడ్చారని చెబుతున్నారు. ఆ ప్రాంతంలో భవనం ఎలా కడతారని ప్రశ్నిస్తున్నారు. భవనాలు నిర్మించడం ద్వారా వచ్చే కమీషన్ల కోసం కక్కుర్తి పడి నాయకులు తమపై ఇలా అధికారులతో దౌర్జన్యాలు చేయిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు విగ్రహ తొలగింపు చర్యలను విరమించకుంటే తాము పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని దిర్శిపాం తాతయ్య, డొక్కా ఎర్రవెంకటేష్, డొక్కా దుర్గారావు, డొక్కా పెద్దిరాజు, డి.నాగసుబ్బారావు తదితరులు హెచ్చరిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top