సుస్థిర అభివృద్ధే ధ్యేయం

Republic Day Celebrates In Chittoor - Sakshi

చిత్తూరు కలెక్టరేట్‌ : సుస్థిర అభివృద్ధే ధ్యేయం కలిసికట్టుగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్న పిలుపునిచ్చారు. శనివారం స్థానిక డీటీసీ పెరేడ్‌ మైదానంలో 70వ గణతంత్ర దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిం చారు. ఉదయం 7.45 గంటలకు కలెక్టర్‌ జాతీయ పతాకావిష్కరణ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం పోలీసులు, ఎన్‌సీసీ విద్యార్థుల నుంచి కలెక్టర్‌ గౌరవవందనం స్వీకరించారు.

ఈ సందర్భంగా ప్రజలనుద్దేశిం చి కలెక్టర్‌ ప్రసంగించారు. గణతంత్ర దినోత్సవ గొప్పతనాన్ని చెబుతూ జిల్లా అభివృద్ధి గురించి వివరించారు. ఈ వేడుకల్లో ఎస్పీ విక్రాంత్‌పాటిల్, జాయింట్‌ కలెక్టర్‌ గిరీషా, జేసీ– 2 చంద్రమౌళి, డీఆర్వో గంగాధరగౌడ్, ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్యే సత్యప్రభ, జెడ్పీ చైర్‌పర్సన్‌ గీర్వాణి, నగర మేయర్‌ కఠారి హేమలత తదితరులు పాల్గొన్నారు.

పడమటి మండలాలు సస్యశ్యామలంగా..
కరువుతో తల్లడిల్లుతున్న పడమటి కరువు సీమను రతనాల సీమగా సస్యశ్యామలంగా తీర్చిదిద్దాలనే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. డీఆర్‌డీఏ ద్వారా జిల్లాలో దాదాపు 4.50 లక్షల మంది గ్రామీణ డ్వాక్రా మహిళలకు రూ.1571 కోట్ల బ్యాంకు రుణాలను మంజూరు చేసి జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచినట్లు చెప్పారు. మెప్మా ద్వారా రూ.399 కోట్ల బ్యాంకు రుణాలను అందజేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచామన్నారు. మహిళల ఆత్మగౌరవ నినాదంతో చేపట్టిన స్వచ్ఛభారత్‌ ఉద్యమానికి జిల్లా ప్రజల నుంచి గొప్ప సహకారం లభించిందన్నారు. 2017–18 సంవత్సరంలో దేశంలోనే అత్యధికంగా 2,70,251 వ్యక్తిగత మరుగుదొడ్లను ఉద్యమస్థాయిలో నిర్మించి దేశంలో ప్రథమస్థానం సాధించినట్టు చెప్పారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం డీటీసీ పోలీసు పరేడ్‌ మైదానంలో వేడుకలను అద్భుతం, అమోఘంగా నిర్వహిం చారు. పలు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు జయహో అనిపిం చాయి. దేశభక్తి, భారత దేశ సంస్కృతి, సాంప్రదాయాలు, స్వాతంత్య్ర సమరయోధుల పోరా టం, దేశగొప్పతనం, ప్రజాస్వామ్యం విశిష్టతను చాటిచెబుతూ రచించిన గేయాలకు విద్యార్థులు అద్భుతంగా అభినయించారు. ప్రదర్శనను చూసిన కలెక్టర్‌ ప్రద్యుమ్న విద్యార్థులను అభినందించారు. జాగిలాల విన్యాసాలు, అగ్ని మాపక శాఖ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇక జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన అధికారు లు, సిబ్బందికి  ప్రశంసాపత్రాలు అందజేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top