సీఎం చుట్టూ భజన బృందం | Rebellion brewing in Kiran Kumar cabinet | Sakshi
Sakshi News home page

సీఎం చుట్టూ భజన బృందం

Oct 3 2013 12:56 AM | Updated on Jul 29 2019 5:28 PM

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ మండిపడ్డారు.

సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ మండిపడ్డారు. పార్టీ అధిష్టానవర్గం నిర్ణయాన్ని ధిక్కరిస్తూ ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడడాన్ని తప్పుపట్టారు. ‘ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి చుట్టూ భజన బృందం చేరింది.  పొగడ్తలకు ఆయన పడిపోతున్నారు. పొగిడే వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. నాకు పొగడడం రాదు. నేను చెప్పే విషయాలను ముఖ్యమంత్రి గౌరవించరు. ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్న చాలా నిర్ణయాలు నాకు నచ్చవు. అనేక నిర్ణయాలపై విభేదించాలని ఉన్నా..ఆ నిర్ణయాలను  విమర్శించకుండా గౌరవిస్తున్నాను.
 
 రాష్ట్రవిభజన పై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) నిర్ణయాన్ని పార్టీ నాయకులు గౌరవించాల్సిందే. మనకు నచ్చకపోయినా సరే, పార్టీ శ్రేయస్సు కోసం కట్టుబడి ఉండాల్సిందే. ముఖ్యమంత్రి నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారని శంకర్రావును, డీఎల్ రవీంద్రారెడ్డిని కిరణ్‌కుమార్‌రెడ్డి తప్పించలేదా..? నేను ముఖ్యమంత్రి నిర్ణయాలను వ్యతిరేకిస్తే నన్ను తొలగించరా..?’ అని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ప్రశ్నించారు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తప్పుపట్టడాన్ని ప్రస్తావిస్తూ,.. మంత్రులను తప్పించినట్లు ముఖ్యమంత్రిని కూడా తప్పించాలని మాణిక్యవరప్రసాద్ పరోక్షంగా  కోరారు. ఆయన బుధవారం సచివాలయంలోని తన చాంబర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘పార్టీ నాకు మంత్రి హోదా కల్పించింది. ఈ హోదా లేకుంటే మీరెవరూ వచ్చేవారు కాదు. అలాంటప్పుడు పార్టీ నిర్ణయాన్ని అంగీకరించాలి’  అన్నారు. విభజనపై సీమాంధ్ర ప్రజల వునోభావాలను చెప్పే సమయంలో  పార్టీ అధిష్టానం గురించి ముఖ్యమంత్రి ప్రస్తావించకుంటే బావుండేదన్నారు.
 
 చంద్రబాబుకు పట్టిన గతే...
 ‘ముఖ్యమంత్రి చుట్టూ చేరిన వారు సర్వేలు, రేటింగ్‌లు అంటూ ఆయనను తప్పుదోవపట్టిస్తున్నారు. సర్వేలను, రేటింగ్‌లను నమ్ముకున్న చంద్రబాబుకు గతంలో ఏ గతి పట్టిందో కిరణ్‌కుమార్‌రెడ్డికి అదే గతిపడుతుంది. రాష్ట్రాన్ని విభజిస్తే జలయుద్ధాలు వస్తాయని ముఖ్యమంత్రి చెబుతారు. అదే సమయంలో,.. ముఖ్యమంత్రికి ప్రీతిపాత్రుడైన భారీ నీటిపారుదల శాఖ మంత్రి మాత్రం, జల యుద్దాలు రానేరావంటారు. ఇలా ఒకే మంత్రివర్గం నుంచి భిన్న వాదనలు రావడం మంచిది కాదు. వ్యవస్థను గౌరవించాలి. విభజనకు సంబంధించి సీమాంధ్రకు న్యాయం చేయాలని మేమంతా కోరుతున్నాం. విభజన నిర్ణయాన్ని పునస్సమీక్షించాలని కోరాం. దీనిపై ఆంటోనీ కమిటీ నివేదిక రావాలి. అది వచ్చిన తరువాత ఏమి చేయాలో నిర్ణయిస్తాం. కాగా సోమవారం పలువురు మంత్రులం కలిసి, సేవ్ ఏపీ.. సేవ్ కాంగ్రెస్ నినాదంతో ముందుకెళ్తాం’ అని మంత్రి చెప్పారు.
 
 సమైక్యాంధ్రను గట్టిగా కోరేవారు కొద్దిమందే...
 సమైక్యాంధ్ర కావాలని గట్టిగా కోరుతున్న వారు గాదె వెంకటరెడ్డి, కేవీపీ రామచంద్రరావు, ైశె లజానాథ్ ఇలా నలుగురైదుగురు మాత్రమే ఉన్నారని, మిగిలిన వారు సందిగ్ధంలో ఉన్నారని మంత్రి అన్నారు. రాష్ట్రం 1972లోనే విడిపోయి ఉంటే బావుండేదనిపిస్తోందని, ఇంతకాలం తరువాత విడిపోవడమంటే బాధగా ఉంటుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితులను చక్కదిద్దాలంటే ఎన్టీఆర్ లేదా రాజశేఖరరెడ్డి రావాల్సిందేనని మంత్రి అభిప్రాయపడ్డారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా  పూర్తి విధేయంగా ఉంటానని ఒక ప్రశ్నకు సమాధానంగా  మంత్రి చెప్పారు. రాజకీయ పార్టీలన్నీ తమ అభిప్రాయాలు చెప్పిన తరువాతే, తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందన్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయానికి ముందుగా, ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎంలతో కూడా పార్టీ పెద్దలు మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. టీడీపీ లేఖ ఇవ్వడమేకాక.. అసెంబ్లీలో తీర్మానాన్ని బలపరుస్తావుని కూడా ప్రకటించిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement