రాష్ట్రంలో దోపిడీ పాలన

Rajampeta TDP MLA Meda Mallikarjuna Reddy joins YSRCP - Sakshi

రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి

ప్రజలకు మంచి చేయాలనే టీడీపీని వీడా

చంద్రబాబును ‘నిన్ను నమ్మంగాక నమ్మం’ అంటున్నారు

ఏపీకి తదుపరి సీఎం వైఎస్‌ జగనే

భారీగా అనుచరులతో కలసి వైఎస్సార్‌సీపీలో చేరిక

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో దోపిడీ పాలన సాగుతోందని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు. సీఎం చంద్రబాబును ప్రజలు ఛీ కొడుతున్నారని చెప్పారు. ‘నిన్ను నమ్మం బాబూ.. నమ్మంగాక నమ్మం’ అని అంతా ముక్తకంఠంతో నినదిస్తున్నారన్నారు. దివంగత వైఎస్సార్‌ ఆశయాల మేరకు సుపరిపాలన  సాధించేందుకు టీడీపీకి రాజీనామా చేసినట్లు మేడా తెలిపారు. రాష్ట్రానికి తదుపరి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనడంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. బడుగు, బలహీన వర్గాలను ఆదరించే సీఎంగా వైఎస్‌ జగన్‌ ముందుకు వెళ్తారని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లో వైఎస్సార్‌ సీపీలో చేరిన అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఆరోజు నుంచి ఈరోజు వరకు ఒకటే మాట చెబుతున్నా. వైఎస్‌ జగన్‌ ఏపీకి కాబోయే సీఎం’ అని పేర్కొన్నారు. రాజంపేట, రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలని నిర్ణయించుకుని వైఎస్సార్‌ సీపీలో చేరానన్నారు. తాము టీడీపీ మాదిరిగా ప్రజాస్వామ్య విలువలు తెలియని వాళ్లం కాదని మేడా వ్యాఖ్యానించారు. 

స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా..
వైఎస్సార్‌ సీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి టీడీపీ కొనుగోళ్లకు పాల్పడితే ఈరోజు దాకా వారి విషయంలో స్పీకర్‌ నిర్ణయం తీసుకోలేదని మేడా పేర్కొన్నారు. ‘వైఎస్‌ జగన్‌ నాకు ఒకే మాట చెప్పారు. పార్టీలో చేరే ముందు టీడీపీ ద్వారా వచ్చిన అన్ని పదవులకు రాజీనామా చేసి రమ్మని కోరారు. ఈ నెల 22వ తేదీనే ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశా. ఈరోజు స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా పంపా’ అని మేడా వివరించారు. 

అన్ని వర్గాలకూ టీడీపీ దగా..
రాష్ట్రాన్ని సశ్యశ్యామలం చేసి అన్ని వరాలకు మంచి జరిగే పరిపాలన రావాలన్నది తన అభిమతమని మేడా చెప్పారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ప్రతి వర్గాన్ని దగా చేశారని ధ్వజమెత్తారు. రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగ యువత, కాపులు.. ఇలా అందరినీ  టీడీపీ మోసగించిందన్నారు. వైఎస్సార్‌ సీపీ జిల్లాలో వైఎస్సార్‌ సీపీ పదికి పది స్థానాలు గెలుస్తుందని ప్రకటించారు. రాజకీయంగా అనుభవజ్ఞుడైన మాజీ ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డితో కలసి రాజంపేట నియోజకవర్గంలో ముందుకు వెళ్తానని మేడా చెప్పారు. 

భారీగా తరలివచ్చిన మేడా అనుచరులు
రాజంపేట శాసనసభ్యుడు మేడా మల్లికార్జునరెడ్డి వైఎస్సార్‌ సీపీలో చేరిక సందర్భంగా ఆయన అనుచరులు పెద్ద ఎత్తున తరలి రావడంతో హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం కిక్కిరిసింది. రాజంపేట నుంచి భారీగా వాహనాల్లో తరలి రావడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. మేడాకు లోటస్‌పాండ్‌లో వైఎస్‌ జగన్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగన్‌ ప్రతి ఒక్కరినీ సాదరంగా పలకరించారు. పార్టీలో చేరిన వారందరికీ తోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు. అంతా కలసి మళ్లీ రాజన్న రాజ్యాన్ని తెచ్చుకుందామన్నారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌ జిల్లాలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక అభ్యర్థి మేడా మల్లికార్జునరెడ్డి కావడం గమనార్హం. కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులుతోపాటు మేడా రఘునాథ్‌రెడ్డి, మేడా విజయభాస్కర్‌రెడ్డి, పార్టీ నేతలు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top