ఎరువులపై ధరల దరువు

Raising prices on fertilizers In Vizianagaram - Sakshi

నెల్లిమర్ల రూరల్‌ విజయనగరం : ఎరువుల ధరలు రైతులను కలవరపెడుతున్నాయి. ఒకేసారి పదిశాతం మేర ధరలు పెరగడంతో జిల్లా రైతాంగంపై మరో రూ.7 కోట్ల భారం పడనుంది. వాస్తవంగా జీఎస్టీ అమలు సమయంలో ఎరువుల ధరలు తగ్గుతాయనుకున్న రైతుల ఆశలు అడియాశలయ్యాయి. కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు ఎరువులపై ఇచ్చే సబ్సీడీలను ఎత్తివేయడంతో మార్కెట్‌లో రసాయనిక ఎరువులతో పాటు, పురుగు మందుల ధరలు పెరిగిపోతున్నాయన్న వాదన వినిపిస్తోంది. 

పెరుగుతున్న పెట్టుబడి వ్యయం... 

జిల్లాలో 1.92లక్షల హెక్టార్లలో రైతులు పంటలు సాగుచేస్తున్నారు. రసాయనిక ఎరువుల కొనుగోలు కోసం ఏటా రూ.71 కోట్ల దాకా ఖర్చు చేస్తారు. ఈ సంవత్సరం ఎరువుల ధరలు మరో 10 శాతం పెరగడంతో రైతులపై మరో.7 కోట్లు భారం పడనుంది. ఫలితంగా రైతులకు పెట్టుబడి భారం తడిసిమోపెడుకానుంది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎరువుల నియంత్రణపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

ఎరువులు, పురుగుల మందులపై గత ప్రభుత్వాలు సబ్సీడీలు అందిచేవి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎరువులపై ఇచ్చే సబ్సీడీలను పూర్తిగా ఎత్తేసింది. పెట్టుబడి రాయితీ కింద పక్క రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు రైతులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాయి.

రాష్ట్రంలోని చంద్రబాబు సర్కారు మాత్రం భూసార పరీక్షలు, చంద్రన్న వ్యవసాయ క్షేత్రాలంటూ ప్రచారం కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తూ పంటల సాగుకు ఎలాంటి సహకారం అందించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. సూక్ష్మ పోషక ఎరువులను ఉచితంగా అందిస్తామని చెప్పిన ప్రభుత్వం వాటిని కూడా సక్రమంగా పంపిణీ చేయడం లేదని విమర్శిస్తున్నారు. 

పెట్రో ధరల ప్రభావం....

ఎరువుల ధరలపై పెట్రో, డీజిల్‌ ధరల పెంపు ప్రభావం ఎక్కువుగా చూపుతోంది. పెట్రో ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు పెరిగి వ్యాపారులు మరింత ధరలు పెంచారంటూ రైతులు చెబుతున్నారు. కొనుగోలు తరువాత వాటిని ఇంటికి తెచ్చుకోవాలంతే రవాణా చార్జీలు భారమవుతున్నాయని అంటున్నారు. రవాణా చార్జీల పెంపు వల్ల ఒక్కో బస్తాపై రూ. 100 వరకు అదనంగా చెల్లించాల్సి వస్తోందంటున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top