ముదురుతున్న రైల్వే ఎస్పీ వివాదం

ముదురుతున్న రైల్వే ఎస్పీ వివాదం

  •  ఎస్పీ శ్యాంప్రసాద్ బంగళాకు ధోబీ, క్లీనింగ్ ఉద్యోగి నిలిపివేత

  •  మోటార్‌సైకిల్  తొలగింపు

  •  న్యాయపోరాటానికి ఎస్పీ సిద్ధం

  • సాక్షి, విజయవాడ :  విజయవాడ రైల్వే ఎస్పీ డాక్టర్ సీహెచ్.శ్యామ్‌ప్రసాద్ బదిలీ వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఏ కారణం లేకుండా  తనను బదిలీ చేస్తున్నారంటూ ఎస్పీ కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్)కు ఫిర్యాదుచేసిన సంగతి విదితమే. క్యాట్ ఆయన బదిలీని నిలుపుదల చేస్తూ తొమ్మిదో తేదీ వరకు కేసును వాయిదా వేసింది. ప్రస్తుతం బదిలీ ఆగినప్పటికీ ఆయనపై పోలీసు బాస్‌ల వేధింపులు  మాత్రం ఆగలేదు.



    ఆయనతో మాట్లాడవద్దంటూ  కిందిస్థాయి ఉద్యోగులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. దీంతో శ్యామ్ ప్రసాద్ తన కార్యాలయానికి వెళ్లకుండా బంగళాలోనే ఉంటున్నారు. ఆయన కోరిన ఫైల్స్ ఇవ్వవద్దని, ఆయన ఇచ్చే ఆదేశాలను అమలు చేయాల్సిన పనిలేదంటూ ఒక పోలీసు ఉన్నతాధికారి  నుంచి సూచనలు వస్తున్నట్లు తెలిసింది.

     

    ధోబీ, క్లీనింగ్ సిబ్బంది తొలగింపు..

     

    రైల్వే ఎస్పీని ఇక్కడినుంచి పంపించేందుకు అన్ని రకాల చర్యలను ఉన్నతాధికారులు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా  ఎస్పీ బంగళాలో పనిచేసే ధోబీ (రజకుడు)ని, 20 ఏళ్లుగా పనిచేస్తున్న క్లీనింగ్ ఉద్యోగిని నిలుపుదల చేశారు. గతంలో ఎస్పీకి ముగ్గురు డ్రైవర్లు మూడు షిప్టులలో అందుబాటులో ఉండేవారు. ఆయన ఏ నిమిషంలో తనిఖీలకు వెళ్లాలన్నా వారు సిద్ధంగా ఉండేవారు.  ప్రస్తుతం ఒక్క డ్రైవర్‌ను ఉంచి మిగిలిన ఇద్దరినీ తొలగించి వారికి వేరేచోట పోస్టింగ్ ఇచ్చినట్లు తెలి సింది. ఎస్పీ కోసం ఒక మోటార్ సైకిల్ ఎప్పుడూ  సిద్ధంగా ఉండేది. దీన్ని విజయవాడ సీఐకి కేటాయించారు. ఎంతో క్రమశిక్షణ కలిగిన డిపార్టుమెంట్‌లో ఐపీఎస్ స్థాయి అధికారిని ఈ విధంగా వేధించడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఉన్నతాధికారుల  నుంచి ఎన్ని వేధింపులు వచ్చినా న్యాయపోరాటానికి ఎస్పీ సిద్ధంగా ఉన్నారు.

     

    వివాదానికి కారణమిదే....



    రైల్వే ఎస్పీని తొలుత పోలీసు చీఫ్ కార్యాలయంలో రిపోర్టు చేయాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి.  ఏ కారణం చూపకుండా తనను బదిలీ చేయడాన్ని ప్రశ్నిస్తూ ఆయన క్యాట్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన బదిలీపై క్యాట్ స్టే ఇచ్చింది. ఈ ఉత్తర్వులను పట్టించుకోకుండా రైల్వే ఎస్పీని పోలీస్ అకాడమీకి బదిలీ చేశారు. ఆయన తిరిగి క్యాట్‌కు వెళ్లడంతో తొమ్మితో తేదీ వరకు కేసును వాయిదా వేసింది. శ్యామ్‌ప్రసాద్ బదిలీపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలుచేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించడంతో ఆయనపై ఉన్నతాధికారులు వేధింపులకు పాల్పడుతున్నారనే ప్రచారం జరుగుతోంది.

     

    కోర్టుకు ఫిర్యాదు చేయనున్న ఎస్పీ భార్య..

     

    తమ ఇంట్లోంచి అర్ధంతరంగా ధోబీని, క్లీనింగ్ ఉద్యోగిని తొలగించడం వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని, తమ బంగళా అపరిశుభ్రంగా మారడంతో తమకు అలర్జీ వస్తోందంటూ కోర్టుకు వెళ్లేందుకు రైల్వే ఎస్పీ భార్య సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది.  

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top