సీమాంధ్రలో సమైక్యాంధ్ర కోసం ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో సోమవారం నుంచి ప్రారంభమైన ఇంజనీరింగ్, ఫార్మసీ కౌన్సెలింగ్ సజావుగా సాగేందుకు అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకోవాలని హైకోర్టు సోమవారం పోలీసులను ఆదేశించింది.
ఎంసెట్ కౌన్సెలింగ్‌పై ఉన్నత విద్యాశాఖ, పోలీసులకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో సమైక్యాంధ్ర కోసం ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో సోమవారం నుంచి ప్రారంభమైన ఇంజనీరింగ్, ఫార్మసీ కౌన్సెలింగ్ సజావుగా సాగేందుకు అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకోవాలని హైకోర్టు సోమవారం పోలీసులను ఆదేశించింది. అవసరమైన ప్రతిచోటా భద్రత కోసం పోలీసుల సాయాన్ని తీసుకోవాలని ఉన్నత విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. కౌన్సెలింగ్ సజావుగా సాగేందుకు ఏ చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని పోలీసులకు, ఉన్నత విద్యాశాఖ అధికారులకు హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు ఉత్తర్వులు జారీ చేశారు.
ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు కేంద్రాల వద్ద తగిన రక్షణ ఏర్పాట్లు చేసేలా పోలీసులను ఆదేశించాలని అనంతపురం జిల్లాకు చెందిన ఈ.రోజా, మరో ఆరుగురు విద్యార్థినులు గతవారం హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం సోమవారం విచారించింది. రాష్ట్ర విభజన ప్రకటన తరువాత సీమాంధ్రలో భారీ ఆందోళనలు జరుగుతున్నాయని, దీని ప్రభావం ఇంజనీరింగ్, ఫార్మసీ కౌన్సెలింగ్‌పై పడే ప్రమాదం ఉందని, అందువల్ల భద్రతతోపాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేలా ఆదేశించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది చారి కోర్టును కోరారు.