వికేంద్రీకరణతోనే సమగ్రాభివృద్ధి

Protests All over Andhra Pradesh To Support Decentralization - Sakshi

వికేంద్రీకరణకు మద్దతుగా వంటావార్పు

పలుచోట్ల కొనసాగిన దీక్షలు

పాలన, అధికార వికేంద్రీకరణతోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమగ్రాభివృద్ధి సాధిస్తాయని మేధావులు, విద్యావేత్తలు స్పష్టం చేశారు. ‘ఒకే రాజధాని వద్దు–మూడు రాజధానులే ముద్దు’ అని నినదిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమాలు జరిగాయి. కొత్త రాష్ట్రంలో అభివృద్ధికి అడ్డుపడొద్దని ప్రతిపక్షాలకు ప్రజలు సూచించారు. 
– సాక్షి నెట్‌వర్క్‌

మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద వంటావార్పు నిర్వహించారు. చిలకలూరిపేట, బాపట్ల తదితర ప్రాంతాల్లో వివిధ సంఘాల ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమాలు జరిగాయి. పాలన, అభివృద్ధి వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి సాధిస్తాయని పలువురు పేర్కొన్నారు. ఎమ్మెల్యే షేక్‌ మొహమ్మద్‌ ముస్తఫా పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు, చీరాల, యర్రగొండపాలెం, పర్చూరులో వంటావార్పు కార్యక్రమాలు జరిగాయి. స్వార్థ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు వికేంద్రీకరణకు అడ్డు తగలడం సరికాదని వివిధ సంఘాల నేతలు ధ్వజమెత్తారు.

ఉత్తరాంధ్ర జిల్లాల్లో..
మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయాన్ని స్వాగతిస్తూ విశాఖ జిల్లాలో వంటావార్పు కార్యక్రమాలు జరిగాయి. ఆంధ్రా యూనివర్సిటీ మెయిన్‌ గేట్‌ వద్ద నిర్వహించిన వంటావార్పు కార్యక్రమానికి అకడమిక్‌ డీన్‌ ప్రొఫెసర్‌ కె.వెంకట్రావ్, ప్రొఫెసర్లు పి.ప్రేమానందం, కె.సారున్‌రాజు, వి.సిద్ధయ్య, విశాఖ తూర్పు సమన్వయకర్త అక్కమాని విజయనిర్మల హాజరయ్యారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధిలోని బాలయ్య శాస్త్రి లే–అవుట్, భీమిలి, పాయకరావుపేట, పాత గాజువాక జంక్షన్, అనకాపల్లి, అచ్యుతాపురం తదితర ప్రాంతాల్లో వంటావార్పు కార్యక్రమాలు జరిగాయి. ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, గుడివాడ అమర్‌నా«థ్, కన్నబాబురాజు హాజరై సంఘీభావం తెలిపారు.

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం, సోంపేట, ఇచ్ఛాపురం, ఎచ్చెర్లలలో వంటావార్పు నిర్వహించారు. మందస మండలం బుడారిసింగి పంచాయతీ పరిధిలోని పాతకోట గిరిజన గ్రామంలో మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మూడు రాజధానులను స్వాగతిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యేలు విశ్వసరాయి కళావతి, సీదిరి అప్పలరాజు పాల్గొని సంఘీభావం తెలిపారు. విజయనగరం జిల్లా బొబ్బిలి, సాలూరు, విజయనగరం, పార్వతీపురం, నెల్లిమర్ల, గజపతినగరం తదితర ప్రాంతాల్లో వంటావార్పు కార్యక్రమాలు జరిగాయి. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, రాజన్నదొర, కోలగట్ల వీరభద్రస్వామి, అలజంగి జోగారావు, బొత్స అప్పలనరసయ్య మద్దతు తెలిపారు.

రాయలసీమలో..
మూడు రాజధానులకు మద్దతుగా కడప అంబేడ్కర్‌ సర్కిల్‌లో చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. దీక్షల్లో కార్పొరేటర్లు దీక్షలో పాల్గొన్నారు. వైఎస్సార్‌ జిల్లాలోని రైల్వే కోడూరులో వంటావార్పు నిర్వహించి రోడ్డుపైనే భోజనాలు చేశారు. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి హాజరై భోజనాలు వడ్డించారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు, నందికొట్కూరు, పత్తికొండ నియోజకవర్గాల్లోని ప్రధాన రహదారులు, సర్కిళ్లలో వంటావార్పు నిర్వహించారు. కర్నూలు–చెన్నై ప్రధాన రహదారిపై చేపట్టిన కార్యక్రమానికి ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్‌రెడ్డి హాజరై సంఘీభావం తెలిపారు. అనంతపురం జిల్లా మడకశిర, పుట్లూరు మండలం ఎ.కొండాపురం, కల్యాణదుర్గం తదితర ప్రాంతాల్లో వంటావార్పు నిర్వహించారు. ఎమ్మెల్యేలు డాక్టర్‌ తిప్పేస్వామి, జొన్నలగడ్డ పద్మావతి, ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్, విప్‌ కాపు రామచంద్రారెడ్డి సతీమణి కాపు భారతి మద్దతు తెలిపారు.

గోదావరి జిల్లాల్లో..
వికేంద్రీకరణ నిర్ణయానికి మద్దతుగా పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట, తాళ్లపూడి మండలం ప్రక్కిలంక, లింగపాలెం మండలం ధర్మాజీగూడెం, తణుకు తదితర ప్రాంతాల్లో వంటావార్పు నిర్వహించారు. తాడేపల్లిగూడెం, తణుకు పట్టణాల్లో చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరం, రాజమహేంద్రవరం రూరల్, సామర్లకోట, పి.గన్నవరం, తుని తదితర ప్రాంతాల్లో వంటావార్పు కార్యక్రమాలు జరిగాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top