రాష్ట్రపతి పాలనకు కేబినెట్ ఆమోదం

రాష్ట్రపతి పాలనకు కేబినెట్ ఆమోదం - Sakshi


ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలని, అసెంబ్లీని సుప్త చేతనావస్థలో ఉంచాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్రంలో రాజకీయంగా అస్తవ్యస్థ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రాజ్యాంగంలోని 356(1) అధికరణం కింద రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర విభజన బిల్లును రాజ్యసభ కూడా ఆమోదించిన తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడం, తదుపరి పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి పాలన సమయంలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పాలనా బాధ్యతలు నిర్వర్తిస్తారు. అసెంబ్లీ పదవీ కాలం ఈ సంవత్సరం జూన్ 2వ తేదీతో ముగుస్తుంది. కొద్ది రోజుల్లోనే అసెంబ్లీతో పాటు లోక్సభకు కూడా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.


రాష్ట్రంలో 41 సంవత్సరాల తర్వాత మళ్లీ రాష్ట్రపతి పాలన విధిస్తున్నారు. కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడంతో ఇక రాష్ట్రపతి ఆమోదమే తరువాయి. అది వచ్చిన తర్వాత, రాష్ట్ర చరిత్రలో రెండోసారి రాష్ట్రపతి పాలన వచ్చినట్లవుతుంది. తొలిసారిగా 1973లో పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జై ఆంధ్ర ఉద్యమం ఉధృతంగా రావడంతో శాంతి భద్రతల సమస్య తలెత్తింది. శాంతి భద్రతలను అదుపు చేయడం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వల్ల కాలేదు. దాంతో జనవరి 11 నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు రాష్ట్రపతి పాలన విధించారు.దేశంలో ఇప్పటివరకు 122 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. అత్యధికంగా మణిపూర్ రాష్ట్రంలో ఇప్పటికి 10 సార్లు విధించారు. తర్వాత ఉత్తరప్రదేశ్లో 9 సార్లు, బీహార్లో 8 సార్లు, పంజాబ్లో 8 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. ఇక కర్ణాటక, ఒడిశా, పుదుచ్చేరిలలో ఆరేసి సార్లు రాష్ట్రపతి పాలన వచ్చింది. మన రాష్ట్రంలో మాత్రం ఇప్పటికి ఒక్కసారే విధించగా, మరోసారి ఇప్పుడు రాష్ట్రపతి పాలన పెడుతున్నారు. రాష్ట్రపతి పాలన వస్తే.. శాసన వ్యవస్థ అంటూ ఉండదు. అధికారాలన్నీ గవర్నర్ చేతిలో ఉంటాయి. రాష్ట్రపతి ప్రతినిధిగా గవర్నరే పాలన కొనసాగిస్తారు. ప్రస్తుత గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గతంలో రాష్ట్రపతి పాలన విధించినప్పుడు మన రాష్ట్రంలోనే ఐపీఎస్ అధికారిగా పనిచేశారు. కాబట్టి, రాష్ట్రపతి పాలన గురించి కూడా ఆయనకు అవగాహన ఉంది.రాష్ట్రపతి పాలన నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతిని గవర్నర్ నరసింహన్ ప్రత్యేక కార్యదర్శి రమేష్ కుమార్ కలిశారు. వారిద్దరి మధ్య పాలనకు సంబంధించిన చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. వాస్తవానికి మహంతి పదవీ కాలం పూర్తయినా.. రాష్ట్ర విభజన, రాష్ట్రపతి పాలన లాంటి కీలక ఘట్టాలు ఉండటంతో ఆయన పదవీ కాలం పొడిగించిన విషయం తెలిసిందే.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top