ట్రాన్స్‌కో అధికారుల తీరును నిరసిస్తూ మండలంలోని గుడవళ్లూరుకు చెందిన రైతులు మంగళవారం విద్యుత్ సబ్‌స్టేషన్ మెయిన్ గేటుకు, కార్యాలయానికి తాళాలు వేసి, కంప అడ్డం వేసి సిబ్బం దిని బయటకు గెంటేశారు.
కొండాపురం, న్యూస్‌లైన్: ట్రాన్స్‌కో అధికారుల తీరును నిరసిస్తూ మండలంలోని గుడవళ్లూరుకు చెందిన రైతులు మంగళవారం విద్యుత్ సబ్‌స్టేషన్ మెయిన్ గేటుకు, కార్యాలయానికి తాళాలు వేసి, కంప అడ్డం వేసి సిబ్బం దిని బయటకు గెంటేశారు. మూడు గంటల పాటు కలిగిరి, కొండాపురం రోడ్డుపై బైఠాయించి వాహన రాకపోకలను అడ్డుకున్నారు. నాలుగు రోజుల క్రితం ఇదేవిధంగా సబ్‌స్టేషన్‌కు తాళాలు వేసి నిరసన తెలిపిన రైతులు రెండో దఫా నిరసనకు దిగారు.
రైతులు మాట్లాడుతూ వ్యవసాయానికి 7 గంటలు విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వ సూచించినా కనీసం నాలుగు గంటలు కూడా సరఫరా చేయడం లేదని, అది కూడా ఒక్కో దఫా గంట మాత్రమే ఇస్తుండటంతో ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. దీంతో పంటలు ఎండుముఖం పడుతున్నాయన్నారు. వ్యవసాయానికి 7 గంటలు ఇవ్వవలసిన విద్యుత్‌ను సక్రమంగా ఇవ్వకుండా ఇదే సబ్‌స్టేషన్ పరిధిలోని ఉప్పులూరు గ్రామానికి ఎక్కువ సమయం ఇస్తున్నారని ఆరోపించారు. తమకు 7 గంటలు విద్యుత్ ఇస్తున్నట్లుగా రికార్డుల్లో రాస్తున్నారని ఆరోపించారు. రోడ్డుపై బైఠాయించిన రైతులు ఎంతకూ ధర్నాను విరమించకపోవడంతో సంఘటన స్థలానికి చేరుకున్న హెడ్ కానిస్టేబుల్ రమణయ్య ఏఈతో ఫోన్లో మాట్లాడి రైతులకు నచ్చజెప్పడంతో ధర్నా విరమించారు.