జెడ్పీలో పవర్ గేమ్ | Sakshi
Sakshi News home page

జెడ్పీలో పవర్ గేమ్

Published Wed, Aug 13 2014 1:36 AM

జెడ్పీలో  పవర్ గేమ్ - Sakshi

సాక్షి ప్రతినిధి, విజయనగరం :  జెడ్పీలో ఆధిపత్యం కోసం టీడీపీ నేతల మధ్య అంతర్గత యుద్ధం జరుగుతోంది. చైర్‌పర్సన్ వర్గం ఒకవైపు, ఎమ్మెల్యేలు మరోవైపు పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు. చైర్‌పర్సన్ హోదాలో జెడ్పీలో పూర్తిగా తమ అజమాయిషీయే ఉండాలని ఆ వర్గం భావిస్తుండగా, సన్నిహిత అధికారులను తీసుకొచ్చి జెడ్పీలో హవా సాగించాలని అదే పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు తాపత్రయ  పడుతున్నారు. జెడ్పీలో వేరొకరు వేలు పెట్టొద్దని చైర్‌పర్సన్ వర్గం, తమకు ప్రాధాన్యం ఇవ్వకపోతే ఒప్పుకోమని ఎమ్మెల్యేల వర్గం పంతానికి పోతున్నాయి. ఈ క్రమంలో అధికార పార్టీ నేతల మధ్య అంతరం పెరుగుతోంది.
 
 జెడ్పీలో సీఈఓగా ఎవరుండాలి? డిప్యూ టీ సీఈఓగా ఎవర్ని ఉంచాలి? అకౌంట్ ఆఫీసర్‌గా ఎవర్ని వేసుకోవాలి? ఇంజినీరింగ్ అధికారులను ఎక్కడెక్కడ నియమించాలి?  ఎంపీడీఓలకు పోస్టింగ్‌లు ఎక్కడెక్కడ ఇవ్వాలి? సూపరింటెండెంట్, కింది స్థాయి ఉద్యోగులను ఎక్కడెక్కడికి బదిలీ చేయాలి? తదితర విషయాల్లో తమదే పూర్తి అజమాయిషీ ఉండాలని చైర్‌పర్సన్ వర్గం భావిస్తోంది. ఎవర్ని ఉంచాలో, ఎవర్ని పంపించాలో అన్నదానిపై తమ నిర్ణయమే శిరోధార్యం కావాలని ఈ వర్గం అభిప్రాయ పడుతోంది. ఇందులో ఏ ఒక్కరూ జోక్యం చేసుకోవద్దని  పరోక్షంగా సంకేతాలిస్తోంది. కానీ, అదే పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు దానిని వ్యతిరేకిస్తున్నారు. తాము ఎమ్మెల్యేలమని, తమ సిఫారసులే చెల్లుబాటు కావాలని కొంతమంది పట్టుబడుతున్నారు. జెడ్పీలో తమ హవా సాగాలంటే తాము సూచించిన అధికారులను నియమించాలని సంబంధిత మంత్రిపై ఒత్తిళ్లు చేస్తున్నారు. ఈ అభిప్రాయ బేధాలే నేతల మధ్య చిచ్చు రేపుతున్నాయి.
 
 ప్రస్తుత జెడ్పీ సీఈఓనే ఇంకొన్నాళ్లు కొనసాగించాలని ఓ వర్గం భావిస్తుంటే,  కాదూ కూడదని ఓ ఇద్దరు అధికారులను తెరపైకి తీసుకొచ్చి వారినే నియమించాలని పంచాయతీరాజ్ మంత్రి అయ్యన్నపాత్రుడు వద్ద విశ్వప్రయత్నాలు చేస్తున్నారు మరో వర్గం వారు.  గతంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డెరైక్టర్‌గా పనిచేసిన డి.వి.రమణమూర్తిని లేదంటే జిల్లాలో గతంలో   హౌసింగ్ స్పెషలాఫీసర్‌గా పనిచేసిన ఓ.రామ్మూర్తిని నియమించాలని ఆ వర్గం మంత్రిపై ఒత్తిడి తెస్తోంది. ఇందులో ఒక అధికారి మంత్రి సామాజిక వర్గం కావడంతో తమ సిఫారసు ఫలిస్తుందని ఆ వర్గం ఆశిస్తోంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న జెడ్పీ అకౌంట్ ఆఫీసర్ పోస్టులో తమ వారిని నియమించాలని కొంతమంది ఎమ్మెల్యేలు సిఫారసు చేస్తుండగా, తమకు నచ్చిన వ్యక్తిని నియమించుకునే పనిలో చైర్‌పర్సన్ వర్గం  ఉంది. ఇదే తరహాలో ఎంపీడీఓల నియామకంలో భిన్నాభిప్రాయాలు చోటు చేసుకున్నాయి.
 
 పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారుల బదిలీల విషయంలో కూడా తమదే పైచేయి కావాలని ఇరువర్గాలు ప్రయత్నిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా అధికారుల జాబితాలను తయారు చేసుకుంటున్నారు. తాము సూచించిన వారికి ప్రాధాన్యం కల్పించాలని ఎవరికివారు పట్టు పడుతున్నారు. ఇప్పటికే పంచాయతీరాజ్ ఇన్‌చార్జి ఈఈగా పనిచేసిన శ్రీనివాస్‌కుమార్ విషయంలో అటు చైర్‌పర్సన్, ఇటు ఎమ్మెల్యేల మధ్య వైరం చోటు చేసుకుంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వారికే అధికారులు అనుకూలంగా పనిచేస్తారని, ఆ క్రమంలో శ్రీనివాస్‌ను కూడా మార్చుకోవచ్చని కొంతమంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు గట్టిగా ఒత్తిడి చేశారు. కానీ శ్రీనివాస్ విషయంలో జెడ్పీ పాలకపెద్దలు వెనక్కి తగ్గలేదు. ఈఈ ఇన్‌చార్జి బాధ్యతలను తొలగిస్తూ డీఈగా వెనక్కి పంపించేశారు. ఈ నిర్ణయంతో పలువురు ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. తాము చెప్పినా వినలేదని, ఇలాగైతే కష్టమనే అభిప్రాయానికొచ్చారు. మిగతా ఇంజినీరింగ్ అధికారుల బదిలీల్లో కూడా ఇదే పరిస్థితి ఎదురైతే తాడోపేడో తేల్చుకునే యోచనలో ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతానికైతే వేచి చూసే ధోరణిలో ఉన్నారు.
 
 ఎమ్మెల్యేలుగా తమకు ప్రాధాన్యం ఇవ్వకపోతే విషయాన్ని ఎక్కడికైనా తీసుకెళ్తామని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. ఏకులా వచ్చి మేకులా కూర్చొన్నారని ఒకరిపైఒకరు  విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఇచ్చి పుచ్చుకునే ధోరణి లేకపోతే కష్టమేనని, సమన్వయ లోపంతో సమస్యలు వచ్చి పడతాయని పలువురు బాహాటంగా  వ్యాఖ్యానిస్తున్నారు. ఒకరి ఆధిపత్యం కోసం మిగతా వాళ్లు చిన్నపోకూడదని ఒక వర్గం, అధికారం తమదైతే  మిగతా వారి పెత్తనమేంటని మరో వర్గం పంతానికి పోతున్నాయి. చినికి చినికి గాలివానగా మారి ఇదెక్కడికి దారితీస్తుందోనన్న వాదన టీడీపీ వర్గాల్లో విన్పిస్తోంది.
 

Advertisement
Advertisement