విద్యుత్ సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కాంట్రాక్టు కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
- సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది
- గతంలో ఇచ్చిన హామీలు పట్టించుకోని వైనం
- ట్రేడ్ యూనియన్ల నిర్లక్ష్యం
	సాక్షి, విజయవాడ : విద్యుత్ సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కాంట్రాక్టు కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ట్రాన్స్‌కోతో పాటు నాలుగు విద్యుత్ పంపిణీ సంస్థల్లో జూనియర్ అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. నాలుగు విద్యుత్ పంపిణీ సంస్థల్లో   610 జూనియర్ అసిస్టెంట్ పోస్టులున్నాయి. వీటిని గతంలో భర్తీ చేసే సమయంలో కాంట్రాక్టు ఉద్యోగస్తులకు వెయిటేజ్ ఇచ్చే విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కొంతమంది హైకోర్టుకు వెళ్లారు. చివరకు కాంట్రాక్టు ఉద్యోగస్తులకు 45మార్కులు వెయిటేజ్ ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతం దాన్ని 20కే పరిమితం చేయడం పట్ల కాంట్రాక్టు కార్మికులు  అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇచ్చిన హమీ ప్రకారం 45 మార్కుల వెయిటేజ్‌ను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
	 
	పదేళ్ల నుంచి విద్యుత్‌శాఖలోనే.....
	 
	రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సంస్థలో 2500మంది కాంట్రాక్టు కార్మికులు జూనియర్ అసిస్టెంట్(ఎల్డీసీ) కేడర్‌లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఎస్పీడీసీఎల్‌లో  650 మంది కాంట్రాక్టు సిబ్బంది ఉన్నారు. వీరిలో సుమారు 300 మంది పదేళ్లబట్టి  పనిచేస్తున్నారు. ఎస్పీడీసీఎల్‌కు 144  జూనియర్ పోస్టులు మంజూరయ్యాయి.   20శాతం వెయిటేజ్ మార్కుల్ని పరిగణలోకి తీసుకోవడం వల్ల  కేవలం 45 మందికి మాత్రమే ఉద్యోగాలు  వచ్చే అవకాశం ఉంది.  45 మార్కులు వెయిటేజ్ ఇస్తే కనీసం ఇందులో 75 మందికి ఉద్యోగాలు వస్తాయి.  
	
	పదేళ్లుగా ఇదే సంస్థను నమ్ముకుని నామమాత్రపు జీతానికి పనిచేస్తున్న తమ సేవలను పరిగణలోకి తీసుకుని  తమకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యమాలు చేసేటప్పుడు ట్రేడ్ యూనియన్లు కాంట్రాక్టు కార్మికుల సేవలు వినియోగించుకుంటూ ఉద్యోగావకాశాలు కల్పించే సమయంలో మాత్రం వారిని నిర్లక్ష్యం చేయడంపై  కాంట్రాక్టు సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో విద్యుత్‌సంస్థలో సుదీర్ఘకాలం పనిచేసి విద్యుత్ పోల్స్ ఎక్కడం వచ్చిన వారికే తొలుత ఉద్యోగావకాశం కల్పించాలని వైఎస్సార్ ప్రభుత్వం నిర్ణయించిదని, ఇప్పుడూ ప్రభుత్వం అదే తరహా విధానాన్ని కొనసాగించాలని కోరుతున్నారు.
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
