
1. జక్కంపూడి రాజాను తోసేస్తూ... కాలర్ పట్టి నెట్టేస్తున్న ఎస్‌ఐ నాగరాజు 2. చంటిబిడ్డతో కారులో కూర్చున్న రాజా భార్య రాజశ్రీ
రామచంద్రపురం: వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాపై తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎస్సై కె.నాగరాజు ఆదివారం దౌర్జన్యం చేశారు. రోడ్ పక్కన పార్క్ చేసిన కారును వెంటనే తీయాలంటూ హుకుం జారీ చేశారు. ఒక్క నిమిషం.. చేతిలో పసిపాప ఉందని చెబుతున్నా వినకుండా రాజా కాలర్ పట్టుకుని దురుసుగా ప్రవర్తించారు. ఈడ్చుకుంటూ లాక్కెళ్లి పోలీస్ జీపు ఎక్కించారు. స్టేషన్‌కు తీసుకెళ్లిన తర్వాత కూడా రాజాను లాఠీ విరిగేలా కొట్టారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
భార్య రాజశ్రీ, ఐదు నెలల కుమార్తెతో కలసి రాజా ఆదివారం సాయంత్రం ద్రాక్షారామం నుంచి రాజమహేంద్రవరం వైపు కారులో వెళ్తున్నారు. మధ్యలో రామచంద్రపురంలోని మసీదు సెంటర్ వద్దనున్న నగల దుకాణం వద్ద కారు ఆపారు. చంటిపాపను రాజాకు అప్పగించి ఆయన భార్య నగల షాపులోకి వెళ్లారు. ఈలోగా అక్కడికి వచ్చిన ఎస్సై నాగరాజు.. కారు తీయాలంటూ హుకుం జారీ చేశారు. ‘ఒక్క నిమిషం.. ఒడిలో చంటిపాప ఉంది’ అని రాజా సర్ది చెప్పబోయారు.
అయినా ఎస్సై వినకుండా దురుసుగా ప్రవర్తించబోగా.. తాను మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు కుమారుడినని, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడినని రాజా చెప్పారు. కానీ ఆయన చెప్పే మాట వినకుండా.. ఒడిలో చంటిపాప ఉందని కూడా చూడకుండా.. రాజాను కాలర్ పట్టుకొని కారు లోపలి నుంచి ఎస్సై బయటకు లాగారు. ఇంతలో నగల షాపు నుంచి వచ్చిన రాజశ్రీ.. చంటిబిడ్డను తన చేతిలోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు రాజాను తోసివేస్తూ తమ వాహనం ఎక్కించి స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ సైతం లాఠీ విరిగేలా కొట్టారు. కాగా, ఎస్సై తీరును నిరసిస్తూ రాజశ్రీ రోడ్డుపై కారు వద్దే కూర్చున్నారు. దీన్నంతటినీ కళ్లారా చూసిన స్థానికులు ఎస్సై తీరుపై దుమ్మెత్తిపోశారు.
ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ పార్టీలకు అతీతంగా నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, రాజా తల్లి, పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్, రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణు తదితరులు రామచంద్రపురం పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని ఆందోళనకు దిగారు. దీంతో స్టేషన్ వద్ద ఉద్రిక పరిస్థితులు తలెత్తాయి. ఆందోళనకారుల్లో కొందరు అక్కడున్న టెంట్లను తగలబెట్టారు. కాగా, టీడీపీ స్థానిక ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని.. ఇరువర్గాలతో చర్చించారు.