‘పోలవరం’పై కేంద్రానికి నివేదిక | Polavaram project on Center Report | Sakshi
Sakshi News home page

‘పోలవరం’పై కేంద్రానికి నివేదిక

Sep 13 2015 12:42 AM | Updated on Aug 21 2018 8:34 PM

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఉన్న ఇబ్బందులను గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని బీజేపీ ప్రతినిధి బృందం తెలిపింది. బృందం శనివారం

పోలవరం : పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఉన్న ఇబ్బందులను గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని బీజేపీ ప్రతినిధి బృందం తెలిపింది.  బృందం శనివారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, జాతీయ కార్యదర్శి సోము వీర్రాజు, మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ పర్యటనలో పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎస్‌ఈ వీఎస్ రమేష్‌బాబు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రాజెక్టు గురించి వివరించారు. పోలవరం స్పిల్‌వే నిర్మాణ ప్రాంతంలో నిర్వహించిన సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడారు. నిర్వాసితుల సమస్యలను మంత్రులు తెలుసుకున్నారు.
 
 ఈ బృందం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం నుంచి తిరిగి వస్తుండగా నిర్వాసితులు అడ్డుకున్నారు. పాత ఇళ్ల విలువ అంచనాల్లో అధికారులు తమకు అన్యాయం చేశారని కోండ్రుకోట నిర్వాసితులు ఆరోపించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగలేదని చెప్పారు. తమకు డి-ఫారం పట్టాభూములు ఉన్నాయని, డైవర్షన్ రోడ్డు నిర్మాణంలో ఆ భూములు తీసుకున్నారని, నష్టపరిహారం ఇస్తామనిచెప్పి ఇవ్వలేదని చేగొండిపల్లి నిర్వాసితులు మంత్రులకు వివరించారు. ఆర్టీసీ బస్సులు డైవర్షన్ రోడ్డుపై నుంచి తిరగడం లేదని, తాము గ్రామాల నుంచి బయటకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నామని కొందరు చెప్పారు. అన్ని రాయితీలు ఇస్తే గ్రామాలు విడిచి వెళ్లిపోతామని పేర్కొన్నారు. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని అమలు చేయాలని రామయ్యపేట నిర్వాసితులు విజ్ఞప్తి చేశారు.
 
 రాష్ట్రానికి ’ప్రత్యేకం’పై అధ్యయనం
 కంభంపాటి  హరిబాబు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ కల్పించే విషయంపై అధ్యయనం జరుగుతోందన్నారు. నివేదిక వచ్చిన తరువాత తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు.  రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు, బీజేపీ జిల్లా అద్యక్షుడు శ్రీనివాసవర్మ, మహిళా మోర్చ రాష్ట్ర అధ్యక్షురాలు కె.మాలతిరాణి, కార్యదర్శి బి.నిర్మలాకిషోర్, జిల్లా అధ్యక్షురాలు ఎస్.సుభద్రాదేవి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీంద్రరాజు, దళిత మోర్చ జిల్లా అధ్యక్షులు ఎంవీ బెనర్జీ, ఐటీ సెల్ జిల్లా కన్వీనర్ గణపతిరాజు, పోలవరం నియోజకవర్గ కన్వీనర్ ముళ్లపూడి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
 
 కేంద్ర సహాయం ఎంత కావాలో గుర్తిస్తాం
 కొవ్వూరు టౌన్ : అంతకు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కంభంపాటి హరిబాబు కొవ్వూరులో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పరిశీలించి కేంద్ర సహాయం ఏ మేరకు కావాలో గుర్తిస్తామని చెప్పారు. మొదటి విడతగా శనివారం తాడిపూడి, పట్టిసీమ ఎత్తిపోతల, పోలవరం ప్రాజెక్టులను పరిశీలిస్తున్నామని, ఆదివారం విజయనగరం, తోటపల్లి ప్రాజెక్టులను సందర్శిస్తామన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కనుక కేంద్రానికి నిధులకై నివేదిస్తామని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement