
గ్రీన్ సిగ్నల్ ఇవ్వండి
నూతన రాజధానిలో రైల్వే సేవలను విస్తరించాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవను పలువురు ఎంపీలు కోరారు.
ముందుగా రైల్వేశాఖ సర్వే నిర్వహించాలి
బెజవాడను మోడల్ స్టేషన్‌గా తీర్చిదిద్దాలి : కేశినేని
కోస్తా రైల్వేలైన్ నిర్మించాలి : కొనకళ్ల
రైల్వే బడ్జెట్ కోసం జీఎంకు ప్రతిపాదనలు అందించిన ఏపీ ఎంపీలు
విజయవాడ బ్యూరో : నూతన రాజధానిలో రైల్వే సేవలను విస్తరించాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవను పలువురు ఎంపీలు కోరారు. రైల్వే సేవల విస్తరణ కోసం ముందుగా సమగ్ర సర్వే నిర్వహించాలని సూచించారు. రైల్వే బడ్జెట్ రూపకల్పన కోసం అవసరమైన ప్రతిపాదనలు స్వీకరించేందుకు మంగళవారం ఎంపీలతో రైల్వే జీఎం నగరంలో సమావేశం నిర్వహించారు. విజయవాడ, బందరు, ఏలూరు, రాజమండ్రి, గుంటూరు ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ, మాగంటి బాబు, మాగంటి మురళీమోహన్, గల్లా జయదేవ్, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తదితరులు రాజధాని ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని రైల్వే ప్రాజెక్టులను కేటాయించాలని జీఎంను కోరారు. కృష్ణా-గుంటూరు జిల్లాల్లో విస్తరించే రాజధాని ప్రాంతానికి రైల్వే సేవలను చేరువచేసేలా ఈసారి ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు.
ఎవరు ఎమన్నారంటే...
విజయవాడ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ రాష్ట్ర రాజధానికి తగినట్టుగా విజయవాడ రైల్వేస్టేషన్‌ను మోడల్ స్టేషన్‌గా తీర్చిదిద్దాలని కోరారు. రాజధాని ప్రాంతంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రైళ్లను పెంచాలని కోరారు. రాయనపాడు వ్యాగన్ వర్క్‌షాప్‌ను అప్‌గ్రేడ్ చేయాలని, రైల్వే ఆస్పత్రిని 1,000 పడకలకు విస్తరించాలని విన్నవించారు. విజయవాడ నుంచి ముంబయి, కొచ్చిన్, త్రివేండ్రం, సూరత్, గౌహౌతి, కోయంబత్తురుకు రైళ్లు నడపాలని ప్రతిపాదించారు. గుణదల, వాంబేకాలనీతోపాటు నగరంలో అవసరమైన ప్రాంతాల్లో రైల్వే ఓవర్ బ్రిడ్జిలు(ఆర్‌వోబీ) నిర్మించి, ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు.
బందరు పోర్టును దృష్టిలో పెట్టుకుని మచిలీపట్నం కేంద్రంగా రైల్వే కోస్టల్ కారిడార్‌ను ఏర్పాటుచేయాలని ఎంపీ కొనకళ్ల నారాయణరావు కోరారు. బందరు నుంచి కోటిపల్లి, రేపల్లే రైల్వేలైన్లను విస్తరిస్తే భవిష్యత్తులో కోస్తా రైలుమార్గం కీలకంగా మారుతుందని చెప్పారు. బందరు రైల్వేస్టేషన్‌ను మోడల్ స్టేషన్‌గా తీర్చిదిద్దాలని కోరారు. మచిలీపట్నం-విజయవాడ రైల్వే లైన్ డబ్లింగ్‌ను త్వరగా పూర్తిచేయాలన్నారు. బందరు నుంచి విశాఖపట్నం, తిరుపతికి నడుపుతున్న రైళ్లకు అదనపు భోగీలు ఏర్పాటుచేయాలన్నారు. నూజివీడులో మరికొన్ని రైళ్లకు హాల్ట్ ఇవ్వాలని, కొత్త రైళ్ల కేటాయింపులో బందరును దృష్టిలో పెట్టుకోవాలని కోరారు.
ప్రతి జిల్లా కేంద్రం నుంచి రాజధాని ప్రాంతానికి చేరుకునేలా రైళ్లను నడపాలని ఏలూరు ఎంపీ మాగంటి బాబు కోరారు. నరసాపురం-విజయవాడ లైన్ డబ్లింగ్‌కు గతంలో రూ.450 కోట్లతో ప్రతిపాదనలు చేయగా, ఆలస్యం కావడంతో ఇప్పుడు నిర్మాణ వ్యయం రూ.1,500కోట్లకు పెరిగిందని రైల్వే జీఎం దృష్టికి తెచ్చారు. విజయవాడ-నిడదవోలు, విజయవాడ-నరసాపురం లైన్ డబ్లింగ్‌కు రూ.1,500 కోట్లు అవసరమని, అందుకు ఏపీ ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంటుగా రూ.200 కోట్లు కేటాయించే విషయంలో సీఎంతో మాట్లాడతానని చెప్పారు.
కొవ్వూరు నుంచి భద్రాచలం వరకు రైల్వేలైన్ విస్తరణ పూర్తిచేయాలని రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ కోరారు. రాష్ట్ర రాజధానికి కనెక్టివిటీ కోసం కొత్త రైళ్లు వేయాలని కోరారు.
సీఆర్‌డీఏ ఏర్పడిన నేపథ్యంలో అందుకు అనుగుణంగానే రైల్వే ప్రాజెక్టులు ఈ ప్రాంతానికి కేటాయించాలని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కోరారు. ఎంపీలంతా ఏకతాటిపైకి వచ్చి రాజధాని ప్రాంతానికి రైల్వే ప్రాజెక్టులు సాధిస్తారని తెలిపారు. కొత్త రాజధాని నుంచి దేశం నలుమూలలకు వెళ్లేలా రైల్వే జంక్షన్‌గా అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు.
మచిలీపట్నం నుంచి తిరుపతి రైలును కడప వరకు పొడిగించాలని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కోరారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహనరెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, బుట్టా రేణుక, వరప్రసాద్ తమ నియోజకవర్గాల పరిధిలో రైల్వే బడ్జెట్‌లో తగిన న్యాయం చేయాలంటూ రైల్వే జీఎం శ్రీవాస్తవకు పలు ప్రతిపాదనలు అందించారు.