ఒక్క భారీ చోరీతో సెటిలవుదామని..

Plans To Settled Through A Huge Robbery.. - Sakshi

సాక్షి, భీమవరం టౌన్‌: చిల్లర దొంగతనాలు మాని ఒకే ఒక్క భారీచోరీతో స్థిరపడిపోవాలని నిర్ణయించుకున్నాడు ఆ దొంగ. తాను దొంగిలించిన వస్తువులను తాకట్టుపెట్టే జ్యూయలరీ షాపునే అందుకు ఎంచుకున్నాడు. ఒక మోటార్‌ సైకిల్‌ను అపహరించి రెండుసార్లు రెక్కీ చేశాడు. ప్లాన్‌ ప్రకారం ఒక్కడే రూ.1.50 కోట్లు విలువ చేసే నాలుగు కిలోల బంగారు ఆభరణాలు, 1.3 కిలోల వెండి ఆభరణాలను చోరీ చేశాడు. చోరీ సమయంలో ముఖానికి వస్త్రం కట్టుకుని ఉన్న తనను జ్యూయలరీ షాప్‌ సీసీ కెమెరాలో కనిపించినా ఏ మాత్రం గుర్తు పట్టకూడదని పోలీసులను ఏమార్చేందుకు దేవుని గుడికి వెళ్లి గుండుకొట్టించుకున్నాడు. ఇక జీవితం బంగారుమయం అనుకున్నంతలోనే పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. భీమవరం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఎం.రవిప్రకాష్, డీఎస్పీ కె.నాగేశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 

ఉండి నియోజకవర్గం ఉండి గ్రామం కొత్తపేట సాయిబాబా గుడి ప్రాంతానికి చెందిన ఇర్రింకి చంద్రరావు వయసు 35 ఏళ్లు. కూలి పని చేసుకుంటూ దొంగతాలను ప్రవృత్తిగా ఎంచుకున్నారు. ఇతనిపై గతంలో ఉండి పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు, భీమవరం టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు, పెంటపాడు పోలీస్‌స్టేషన్‌లో ఒక కేసు నమోదై ఉన్నాయి. ఉండి కేసులో పట్టుబడి గతేడాది అక్టోబర్‌లో జైలుకు వెళ్లి డిసెంబర్‌లో విడుదల అయ్యాడు. ఆ తర్వాత జీవితంలో స్థిరపడాలని నిర్ణయించుకుని అందుకు చీకటి మార్గా్గన్నే ఎంచుకున్నాడు. 

చోరీకి పక్కా ప్లాన్‌
ఈ ఏడాది మార్చి 25న పెంటపాడు గ్రామంలోని ఒక మద్యం దుకాణం వద్ద ఇర్రింకి చంద్రరావు మోటార్‌ సైకిల్‌ను అపహరించాడు. దానిపై భీమవరం వచ్చి భీమవరం ప్రకాశంచౌక్‌లోని మద్దుల వెంకటకృష్ణారావు జ్యూయలరీ షాపు వద్ద రెండు సార్లు రెక్కీ నిర్వహించారు. ఆ షాపు ప్రధాన గుమ్మం మెయిన్‌ రోడ్డులో ఉండడం, పోలీసు సీసీ కెమెరాతో పోటు గస్తీ కూడా ఉండడంతో వెనుక వైపు నుంచి చోరీకి నిర్ణయించాడు. మార్చి 31వ తేదీ రాత్రి 8 గంటలకు రూపాంతర దేవాలయంపై నుంచి జ్యూయలరీ షాపుపై అంతస్తు వెనుక భాగం వద్దకు చేరుకున్నాడు. రూపాంతర దేవాలయానికి చర్చి ఉన్న జ్యూయలరీ షాపు పై భాగంలో గోడకు బదులుగా ఉన్న ఐరన్‌ గ్రిల్స్‌ మెస్, ఇనుప గేటు, రెండు షెట్టర్ల తాళాలు తన వద్ద ఉన్న గునపం, స్క్రూ డ్రైవర్, కటింగ్‌ ప్లేయర్‌తో తొలగించాడు. లోపలికి ప్రవేశించి లాకర్లో పెట్టిన ఆభరణాలను కొట్టేశాడు. వాటిని బ్యాగ్‌లో వేసుకుని ఇంటికి చేరుకున్నాడు. 

సింహాచలం వెళ్లి గుండు కొట్టించుకుని.. 
చోరీసొత్తు నుంచి ఒక బ్రాస్‌లెట్, మూడు లాకెట్లు, రెండు జతల చెవిదిద్దులు మినహా మిగిలినవి ఇంట్లో మరో బ్యాగ్‌లో పెట్టి రహస్యంగా దాచేశాడు. బయటకు తీసిన కొన్ని ఆభరణాలను భీమవరంలోని ముత్తూట్‌ ఫిన్‌కార్ప్‌లో తాకట్టుపెట్టి సింహాచలం వెళ్లి అక్కడ గుండు కొట్టించుకుని ఈనెల 5న ఇంటికి చేరుకున్నాడు. 

వేగవంతంగా పోలీసుల దర్యాప్తు
భారీచోరీతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దుకాణ యజమాని మద్దుల వీరనాగరాజు ఫిర్యాదుతో జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్‌ ఆదేశాల మేరకు నరసాపురం డీఎస్పీ కె.నాగేశ్వరరావు పర్యవేక్షణలో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. క్లూస్‌ టీమ్‌ సంఘటనా స్థలాన్ని అన్ని కోణాల్లోనూ పరిశీలించింది. సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. పాత నేరస్తులే ఈ పనిచేసి ఉంటారని భావించారు. ఇటీవల కాలంలో జైలు నుంచి విడుదలై బయట ఉన్న నేరస్తులపై దృష్టి పెట్టారు. మూడు నెలల క్రితం బయటకు వచ్చిన చంద్రరావును గతేడాది భీమవరం పోలీసులు అరెస్ట్‌ చేయగా అతను ఇచ్చిన సమాచారం మేరకు చంద్రరావు దొంగతనం చేసినట్టు భావించారు. సీసీ కెమెరా ఫుటేజిలో వ్యక్తి పోలికలు కూడా పోలీసులకు దర్యాప్తులో సహకరించాయి. సింహాచలం నుంచి ఇంటికి చేరుకున్న చంద్రరావు పెంటపాడులో అపహరించిన మోటార్‌ సైకిల్‌పై శనివారం చోరీ సొత్తుతో బయల్దేరాడు.

టూటౌన్‌ సీఐ ఎస్‌ఎస్‌వీ నాగరాజు, కానిస్టేబుల్‌ ఎం.ప్రకాష్‌బాబుకు అందిన సమాచారంతో అప్రమత్తమయ్యారు. వన్‌టౌన్, టూటౌన్‌ సీఐలు పి.చంద్రశేఖరరావు, ఎస్‌ఎస్‌వీ నాగరాజు సిబ్బందితో కలిసి నర్సయ్య అగ్రహారం బైపాస్‌ రోడ్డు శివారులో నిందితుడిని పట్టుకుని అరెస్ట్‌ చేశారు. విచారణలో చంద్రరావు దొంగతనాన్ని ఒప్పుకున్నాడు. కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు. అతడిపై రౌడీషీట్‌ తెరుస్తామన్నారు. చాకచక్యంగా కొద్ది రోజుల్లోనే కేసును ఛేదించి మొత్తం సొత్తును రికవరీ చేసిన సిబ్బందిని అభినందించారు. ఇద్దరు సీఐలు, సిబ్బందికి రివార్డులు అందచేశారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top