ముంపు గ్రామాలు ఖాళీ చేయాలి | Plain villages to be evacuated | Sakshi
Sakshi News home page

ముంపు గ్రామాలు ఖాళీ చేయాలి

Sep 21 2013 2:45 AM | Updated on Sep 1 2017 10:53 PM

గండికోట జలాశయంలో ఐదు టీఎంసీల కృష్ణా జలాలను నిల్వ చేస్తున్నామని, ముంపు గ్రామాల్లోని నిర్వాసితులు ఖాళీ చేసి తరలి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ అధికారులను ఆదేశించారు.

 కడప సిటీ, న్యూస్‌లైన్ : గండికోట జలాశయంలో ఐదు టీఎంసీల కృష్ణా జలాలను నిల్వ చేస్తున్నామని, ముంపు గ్రామాల్లోని నిర్వాసితులు ఖాళీ చేసి తరలి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ అధికారులను ఆదేశించారు. కృష్ణా జలాలను గండికోటలో నింపడం ద్వారా ముంపుకు గురయ్యే గ్రామాల ప్రజలను వచ్చేనెల 31వ తేదీలోగా ఖాళీ చేసి వెళ్లాలన్నారు.
 
 కలెక్టర్ బంగ్లాలో శుక్రవారం జాయింట్ కలెక్టర్‌నిర్మల, నీటిపారుదలశాఖ ఇంజనీర్లు, జమ్మలమడుగు ఆర్డీఓ రఘునాథరెడ్డి, జీఎన్‌ఎస్‌ఎస్ స్పెషల్ కలెక్టర్ సుబ్బారెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు రోహిణి, సిద్దిరాముడు, ప్రకాశ్, రాధాకృష్ణయ్య,  ఎస్‌ఈలు శ్రీనివాసులు, రమణమూర్తి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మనోహర్‌రెడ్డి, ఈఈ రామచంద్రారెడ్డిలతో సమావేశం నిర్వహించారు.  జిల్లాలో వర్షపు నీటి ప్రవాహం మైలవరం, గండికోట జలాశయాల స్థితిగతులపై సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మైలవరం జలాశయంలో ఎంతమేర నీటి నిల్వలు ఉన్నాయి? ఎన్ని  క్యూసెక్కుల నీరు కర్నూలుజిల్లా అవుకు నుంచి వస్తోంది? అన్న విషయాలను తెలుసుకున్నారు. కొండాపురం మండలం గండికోట జలాశయం నీటి నిల్వ సామర్థ్యం, నీటిని నిల్వ చేస్తే పరిస్థితులు ఏమిటి? అన్న విషయాలను ప్రాజెక్టుల ముఖ్య ఇంజనీరు రవిశంకర్‌ను అడిగి తెలుసుకున్నారు.
 
 అందుకు ఆయన సమాధానమిస్తూ మైలవరం జలాశయంలోకి అవుకు నుంచి 720 క్యూసెక్కుల నీరు వస్తోందని, ఇప్పటికీ 1.07 టీఎంసీల నీరు నిల్వ ఉందని, గండికోట నీటి నిల్వ సామర్థ్యం 26.8 టీఎంసీలుగా తెలిపారు. అవుకు నుంచి గండికోటకు శనివారం నీటిని మళ్లిస్తే నవంబరు నెలకు ఐదు టీఎంసీల నీరు చేరుతుందని, 204 కాంటూరు కింద ఓబన్నపేట, గండ్లూరు, సీతాపురం, కె.బొమ్మేపల్లె గ్రామాలు తొలి దశలో ముంపునకు గురవుతారని వివరించారు. ఇందుకు స్పందించిన కలెక్టర్ మాట్లాడుతూ నాలుగు గ్రామాల్లోని ప్రజలను వచ్చేనెల 31వ తేదీలోగా ఖాళీ చేయిం చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ ప్రాంత ప్రజలను సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపు కోసం అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. పునరావాస కాలనీల్లో అన్ని మౌళిక వసతులు కల్పించాలన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement