వరదపై ఆందోళన వద్దు

Pilli Subhaschandra Bose and Sucharitha comments about Godavari Flood - Sakshi

మంత్రులు బోస్, సుచరిత

మండపేట/సాక్షి, అమరావతి బ్యూరో: గోదావరి వరదపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎంతటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ తెలిపారు. రెండు రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన తూర్పుగోదావరి జిల్లా మండపేటలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఉభయ గోదావరి జిల్లాల్లో 13 వేల మందికి పునరావాస కేంద్రాలు సిద్ధం చేశామన్నారు. పోలవరం వద్ద ప్రస్తుత నీటిమట్టం 26 మీటర్లు ఉందని, 35 మీటర్ల వరకూ పెరిగినా ఇబ్బంది లేదని చెప్పారు. రెండు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. వరద ప్రభావిత గ్రామాల్లో అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉందన్నారు.

జలదిగ్బంధంలో చిక్కుకున్న దేవీపట్నం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు.  రాకపోకలకు వీలు లేని గ్రామాల ప్రజలకు ఒక్కో కుటుంబానికి 20 కేజీల బియ్యం, పప్పులు, పంచదార, నూనె, కిరోసిన్‌ తదితర నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నామని వివరించారు. మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ముంపు సమస్య తలెత్తకుండా గోదావరి జిల్లాల్లోని డ్రైన్లలో యుద్ధప్రాతిపదికన గుర్రపుడెక్క తొలగించాల్సిందిగా అధికారులను ఆదేశించా మన్నారు. సోమవారం సాయంత్రానికి వరద తీవ్రత తగ్గుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. వరదపై పుకార్లను నమ్మవద్దని ప్రజలకు  విజ్ఞప్తి చేశారు.

సహాయక చర్యలు ముమ్మరం 
హోంమంత్రి మేకతోటి సుచరిత
గోదావరి వరద ఉధృతి నేపథ్యంలో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు హోం మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. గుంటూరులోని తన క్యాంప్‌ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఆమె విలేకరులతో మాట్లాడారు. గోదావరి నది బేసిన్‌లోకి వస్తున్న వరద కారణంగా ఉభయ గోదావరి జిల్లాల్లోని 24 మండలాల్లో 280 గ్రామాలు ముంపుకు గురైనట్లు వెల్లడించారు. ధవళేశ్వరం వద్ద బ్యారేజీలోకి 13,43,836 క్యూసెక్కుల నీరు వస్తే అదే స్థాయిలో కిందికి వదులుతున్నామని చెప్పారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండో నంబరు ప్రమాద హెచ్చరిక ఎగురవేసినట్లు తెలిపారు.

ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, ఫైర్‌ సర్వీస్‌ అధికారులను ముంపు ప్రాంతాలకు తరలించామని పేర్కొన్నారు. శాటిలైట్‌ ఫోన్లు, డ్రోన్‌ కెమేరాలు అందుబాటులో ఉంచినట్లు వివరించారు. తూర్పు గోదావరి జిల్లాలో 17,632 మందిని 32 పునరావాస కేంద్రాలకు తరలించామని, 35,264 భోజనం ప్యాకెట్‌లు, 1,61,056 మంచినీటి ప్యాకెట్‌లు పంపిణీ చేశామని చెప్పారు. పశ్చిమ గోదావరిలో 36,004 టన్నుల బియ్యం, 7,420 లీటర్ల కిరోసిన్, 3,710 కిలోల కంది పప్పు, 3,710 లీటర్ల పామాయిల్, 3,710 కిలోల ఉల్లిపాయలు, 3,710 కిలోల ఆలుగడ్డలు పంపిణీ చేశామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని సహాయక చర్యలు చేపట్టినట్లు వివరించారు. ప్రతిదానినీ రాజకీయ కోణంలో చూడవద్దని మాజీ సీఎం చంద్రబాబుకు హితవు పలికారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top