కేరాఫ్‌ డాక్టర్స్‌ విలేజ్‌!

Piles Specialist Doctors Filled In Village Prakasam - Sakshi

గంగపాలెం నిండా వైద్యులే..

మొలల డాక్టర్లుగా ఖ్యాతి

దేశంలోని ప్రధాన నగరాల్లో సేవలు

అంతా ముస్లింలే అయినా మతసామరస్యానికి బాటలు

గ్రామంలోని వారికి మాత్రం కష్టాలే

ప్రకాశం, తాళ్లూరు: ఓ చిన్న పల్లె ఇప్పుడు పెద్ద టాపిక్‌గా మారింది. ఆ గ్రామంలో అంతా వైద్యులే.. అందుకే వీధులన్నీ ఖరీదైన బంగ్లాలతో దర్శనమిస్తాయి. అయితే అందులో వారు నివాసం ఉండేది మాత్రం కొద్ది నెలలే. మిగతా సమయమంతా సుదూర ప్రాంతాలకు వెళ్లి వైద్య సేవలందిస్తూ ఉంటారు. అదే తాళ్లూరు మండలం వెలుగువారిపాలెం పంచాయతీ పరధిలోని గంగపాలెం (తురకపాలెం). దీని కథ ఏంటో చదివేద్దాం!

ఈ  గ్రామంలో అంతా ముస్లింలే ఉండటం వల్ల తురకపాలెం అని కూడా పిలుస్తుంటారు. మొత్తం 150 నివాస గృహాలుంటాయి. జనాభా 450 మంది. వీరిలో 95 శాతం మంది ముస్లింలే. అయితే ప్రతి ఇంటికీ ఒకరిద్దరు చొప్పున మొత్తం 200 మంది మొలల చికిత్స వైద్య నిపుణులుండటం విశేషం.  వీరంతా వివిధ పట్టణాలల్లో ప్రముఖ మొలల డాక్టర్లుగా ప్రసిద్ధి చెందారు. వంశపారపర్యంగా తమకు తెలిసిన వన మూలికలు, నాటు వైద్యంతో పాటు నూతన పరిజ్ఞానాన్ని సంపాదించుకొని పైల్స్, ఫిస్ట్‌ , ఫిషరీస్‌ వంటి వ్యాధులను నయం చేస్తూ తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్, కోల్‌కతా, కడప, అనంతపురం, రాజస్థాన్, ఒడిస్సా, ముంబై వంటి నగరాల్లో కూడా వైద్యసేవలందిస్తున్నారు. తురకపాలెంకు చెందిన షేక్‌ లాల్‌ కర్నూలు జనరల్‌ ఆస్పత్రిలో ఎండీగా పని చేస్తున్నారు.

వంశపారంపర్య వృత్తి పోనీయకుండా..
తాతల నుంచి వంశపారంపర్యంగా చేస్తున్న వృత్తిని పోగొట్టకుండా ప్రస్తుతం యువత ఎంబీబీఎస్, ఎంఎస్, బీఏఎంఎస్, డీహెచ్‌ఎంఎస్, బీహెచ్‌ఎంఎస్‌ వంటి కోర్సుల్లో శిక్షణ పొంది వైద్యులుగా పనిచేస్తున్నారు. సోహేల్, లాల్, బాలాజీ, శిరాజుద్దీన్, మీరాజుద్దీన్, లాల్, మెబిన్, ఆరీఫ్, సద్దామ్‌తో పాటు 12 మంది ఎంబీబీఎస్‌ పట్టభద్రలు కాగా, మరో నలుగురు ఎంబీబీఎస్‌ విద్యను అభ్యసిస్తున్నారు. 41 మంది డీఏంఎంఎస్, బీఎఎంఎస్, డీహెచ్‌ఎంఎస్, బీపీటీ వంటి పట్టాలు పొందారు.

రంజాన్‌ మాసంలో గ్రామాన సందడి..
గ్రామంలో వృద్ధులు, పని చేయలేనవారు తప్ప మిగిలిన వారంతా తమ గృహాలకు తాళాలు వేసుకుని పటిష్ట బందోబస్తు చేసి ఇతర ప్రాంతాలకు వెళతారు. ఎక్కడ వృత్తి చేస్తున్నా స్వగ్రామాన్ని మరువకుండా ఇక్కడ నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. సంవత్సరం మొత్తం కష్టపడి సంపాదించిన సొమ్ముతో మే, జూన్‌ నెలల్లో గ్రామానికి చేరుకుని పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తారు. అత్యంత వైభవంగా మోహరం, రంజాన్‌ పండుగను జరుపుకోవటం ఆనవాయితీ. గ్రామంలో మసీదు, పీర్ల చావిడీ నిర్మించారు. గ్రామంలో నాలుగు కుటుంబాలు యాదవులు కాగా.. ఒక కుటుంబం ఆర్యవైశ్యులది.

మత సామరస్యానికి ప్రతీకగా రామాలయం
గ్రామంలో ఐదు కుటుంబాలు తప్ప అంతా ముస్లింలు అయినప్పటికీ రామాలయం నిర్మించి ప్రతి సంవత్సరం తమ మసీదుతో పాటు రామాలయానికి రంగులు వేయిస్తూ ఎంతో సుందరంగా ఉంచటం హిందువులను ఆనందంలో ముంచెత్తుతోంది.

ఇక్కడున్నవారి పరిస్థితి?
వైద్యులుగా ఖ్యాతి గడిస్తున్నప్పటికీ గ్రామంలో ఇంటి వద్ద ఉన్న తల్లిదండ్రులకు మాత్రం తాగటానికి నీరు, ఇతర వసతులను ప్రభుత్వం కల్పించటంలో విఫలమైందని గ్రామస్తులు చెప్పారు. సైడు కాలువల లేక అపరిశుభ్రతగా ఉందన్నారు. తమగ్రామాన్ని పట్టించుకొనే నాథుడు లేడని, శ్మశాన స్థలాన్ని కూడా అధికారులు కేటాయించలేదని గ్రామస్తులు ఆరోపించారు. పాఠశాలలో విద్యార్థులు లేకపోవటంతో ప్రభుత్వం రద్దు చేసింది. గ్రామంలో పెద్దల సహకారంతో ఎవరైనా తప్పుచేస్తే ఖండించి న్యాయం జరిగేలా చూస్తామని, పోలీస్టేషన్‌లకు వెళ్లటం ఇష్టం ఉండదని గ్రామస్తులంటున్నారు. దేశంలో ఏప్రాతంలో ఉన్నా అంతా నిరంతరం ఫోన్‌లో అందుబాటులో ఉంటామని, ఎవైనా కష్టాలు వచ్చినప్పుడు గ్రామానికి వచ్చి చర్చిస్తామని వైద్యులు చెప్పారు. మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.

సొంత ఊరు రావటం ఎంతో ఆనందదాయకం
తాతల నుంచి వైద్య వృత్తి చూస్తున్నా. హైదరాబాద్‌ వైద్య వృత్తి చేస్తున్నా. సొంత ఊరు రావటం ఎంతో సంతోషం. బంధుమిత్రులను కలుసుకోవటం ఆనందం. ప్రార్థన స్థలం కబ్జాకు గురైంది.. నియత్రించే వారు లేరు.  సయ్యద్‌సాహెల్, ఎంబీబీఎస్‌

గ్రామంలో మౌలిక వసతుల కరువు
సాగర్‌ నీరు గ్రామంలో మూడు పాయింట్లు పెట్టారు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. నీరు ఎప్పుడు వస్తుందో రాదో తెలియదు. మేము అభివృద్ధి చెందిన గ్రామంలో మౌలిక వసతులు పెరగటం లేదు.
 సయ్యద్‌జాహార్, ఎంబీబీఎస్‌

సైడు కాలువలు లేవు
దశాబ్దం క్రితం సీసీ రోడ్డు వేశారు. సైడు కాలువలు నేటికీ లేవు. గ్రామంలోనే ఉంటాను. రెండు నెలల పాటు అంతా వస్తుంటారు. దీంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంటుంది. ప్రస్తుతం నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. సయ్యద్‌ బాబు, గ్రామస్తుడు

నాన్న స్ఫూర్తితో వైద్య విద్య పూర్తి చేశా
పూర్వం నుంచి పెద్దలు చేస్తున్న నాటు వైద్యంను నాన్న కూడా చేస్తూ తెలంగాణలో స్థిర పడ్డారు. నేను ఎంబీబీఎస్‌ పూర్తి చేసి జడ్చర్లలో వైద్యునిగా పనిచేస్తూ ప్రజా సేవ చేస్తున్నాను.
 డాక్టర్‌ ఎస్‌. శిరాజుద్దీన్, ఎంబీబీఎస్‌

వైద్యునిగా సేవలు అందించటం సంతోషకరం
వైద్య వృత్తిని చేపట్టి ప్రజలకు సేవ చేయటం సంతోషకరంగా ఉంది. కర్నూలు జిల్లా ఆదోనిలో వైద్యాధికారిగా సేవలు అందిస్తున్నాను. గ్రామానికి చెందిన 16 మంది ఎంబీబీఎస్‌ పూర్తి చేసి వివిధ ప్రాంతాల్లో వైద్యులుగా పనిచేస్తున్నారు. డాక్టర్‌ షేక్‌ లాల్, ఎంబీబీఎస్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top