వీధి దీపం వెలగాల్సిందే!

Peddireddy Ramachandra Reddy review with authorities on Street Lights - Sakshi

ఫిర్యాదును 72 గంటల్లో పరిష్కరించాలి

లేకుంటే కాంట్రాక్టు సంస్థపై చర్యలు 

కొత్తగా ‘పీసీఆర్‌ఎం’ వ్యవస్థ ఏర్పాటు 

కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులతో సర్కారు నిర్ణయం 

అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష

సాక్షి, అమరావతి : పల్లెల్లో నూటికి నూరుశాతం ఎల్‌ఈడీ వీధి దీపాలు వెలిగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ‘పర్ఫెక్ట్‌ కంప్లైంట్‌ రిపోర్టింగ్‌ మెకానిజం’ (పీసీఆర్‌ఎం) పేరుతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేస్తోంది. రాష్ట్ర పంచాయతీ, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ వ్యవస్థపై విద్యుత్‌ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ఆ వివరాలను ఇంధన పొదుపు అధికారి చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు..

ఇంధన పొదుపులో భాగంగా రాష్ట్రంలో 23.54 లక్షల వీధి దీపాలు ఏర్పాటుచేశారు. దీనికి అవసరమైన పెట్టుబడిని కేంద్ర ఇ«ంధన పొదుపు సంస్థ ఈఈఎస్‌ఎల్‌ (ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌) అందించింది. అయితే, చాలావరకు వీధి దీపాలు పనిచేయడంలేదని కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులొస్తున్నాయి. నిర్వహణ చేపట్టాల్సిన కాంట్రాక్టు సంస్థలు దీనిపై ఏమాత్రం దృష్టి పెట్టడంలేదనే విమర్శలు సర్వసాధారణమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవస్థను సమూలంగా మార్చాలని ప్రభుత్వం సంకల్పించింది.

72 గంటల్లోనే చర్యలు
గ్రామాలలో వీధిదీపాలు వెలగడం లేదన్న ఫిర్యాదులను 72 గంటల్లోగా కాంట్రాక్టు సంస్థ పరిష్కరించాలి. లేదంటే చర్యలు తీసుకుంటారు. ఎక్కడెక్కడ వీధి దీపాలు వెలగడం లేదన్న సమాచారాన్ని గ్రామ సచివాలయాల నుంచి కూడా పొందవచ్చు. కాగా, వీధి దీపాలపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి చిత్తూరులో 15 నుంచి 9 శాతానికి, కడపలో 12 నుంచి 7 శాతానికి ఫిర్యాదుల సంఖ్య తగ్గిందని విద్యుత్‌ అధికారులు తెలిపారు. దీంతో విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలకూ దీన్ని విస్తరించామని, త్వరలో అన్ని జిల్లాల్లోనూ ఈ వ్యవస్థను ఏర్పాటుచేస్తామన్నారు.

బాగుందని ప్రజలే చెప్పాలి : మంత్రి పెద్దిరెడ్డి
వీధి దీపాలు సక్రమంగా వెలుగుతున్నాయంటూ ప్రజలే సంతృప్తి వ్యక్తంచేయాలని, అప్పటివరకూ క్షేత్రస్థాయి సిబ్బంది విశ్రమించొద్దని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ విషయమై గ్రామాలలో థర్డ్‌ పార్టీ పరిశీలన జరిపిస్తామన్నారు. అన్ని జిల్లాల్లో ఫిర్యాదుల సంఖ్యను కనిష్ట స్థాయికి తీసుకురావాలని ఆయన అధికారులను కోరారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఈఈఎస్‌ఎల్‌ సంస్థ 23.54 లక్షల ఎల్‌ఈడీ వీధిదీపాలు ఏర్పాటుచేసినప్పటికీ, పంచాయతీల నుంచి మరిన్ని అభ్యర్థనలు వస్తున్నాయని చెప్పగా.. వాటిపై నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top