
వీధి దీపాలు లేకుండా ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణం
గ్రామీణ కేటగిరీలో నిర్మిస్తున్నందుకేనని సమాచారం
ముందుగా వెలుపలి లైన్లు నిర్మించాలని నిర్ణయం
భూ ఆక్రమణలను అడ్డుకునేందుకేనన్న అధికారులు
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అత్యాధునిక ఎక్స్‌ప్రెస్ రహదారుల్లో ఒకటిగా రూపుదిద్దుకోబోతున్న రీజినల్ రింగ్‌రోడ్డు (ట్రిపుల్‌ఆర్) రాత్రి వేళ మాత్రం చిమ్మ చీకట్లోనే ఉండబోతోంది. ప్రస్తుతం నాలుగు వరుసలు, భవిష్యత్తులో ఎనిమిది వరుసలకు విస్తరణ, 5 మీటర్ల ఎత్తుతో ఎలివేటెడ్ కారిడార్‌ను తలపించే నిర్మాణం, ఇంటర్ ఛేంజ్ కూడళ్లు, అండర్‌పాస్‌లు ఇలా ఎన్నో విశేషాలతో నిర్మాణం కానున్నప్పటికీ, దాని మీద వీధి దీపాలు మాత్రం ఉండవని సమాచారం.
రూరల్ కేటగిరీ అయినందునే..
దేశంలోనే తొలి భారీ రింగురోడ్డుగా రూపుదిద్దుకున్న హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు (ఓఆర్‌ఆర్).. సాయంత్రం కాగానే శక్తివంతమైన ఎల్‌ఈడీ లైట్ల కాంతులతో ధగధగలాడుతుంది. దానికంటే మెరుగ్గా, రెట్టింపు నిడివితో నిర్మించనున్న ఆర్‌ఆర్‌ఆర్ మీద మాత్రం లైట్లు ఏర్పాటు చేయొద్దని నిర్ణయించినట్టు తెలిసింది.
ఓఆర్‌ఆర్‌ను అర్బన్ రోడ్డు కేటగిరీలో నిర్మించారు. కానీ, ఆర్‌ఆర్‌ఆర్ స్వయంగా కేంద్ర ప్రభుత్వం నిర్మించే యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే అయినప్పటికీ, దాన్ని రూరల్ రోడ్డు కేటగిరీలో నిర్మిస్తున్నారు. జాతీయ రహదారులపై పట్టణ ప్రాంతాల్లో లైట్లు కనిపించినా, గ్రామీణ ప్రాంతాల్లో లైట్లు ఉండవు. దీంతో దీన్ని కూడా అదే కేటగిరీలో భాగంగా లైట్లు లేకుండా నిర్మించాలని ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయించినట్టు తెలిసింది.
ఈ రోడ్డు పట్టణాలకు దూరంగా నిర్మితమవుతోంది. ఇంటర్‌ఛేంజ్ స్ట్రక్చర్లు, మరీ పట్టణాలకు దగ్గరగా ఉన్న పరిమిత ప్రాంతాల్లో మాత్రం లైట్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ రోడ్డుపై వేగంగా దూసుకెళ్లే వాహనాలు చీకటి వేళ సొంత లైట్ల కాంతినే ఆధారం చేసుకోవాల్సి ఉంటుంది.
తొలుత అవతలి వరుసల నిర్మాణం..
ఆర్‌ఆర్‌ఆర్‌ను ఎనిమిది లేన్లతో డిజైన్ చేశారు. కానీ, ప్రస్తుత అవసరాలకు నాలుగు లేన్లు మాత్రమే సరిపోతాయని నిర్ణయించారు. దీంతో తొలుత సెంట్రల్ మీడియన్‌ను ఆనుకుని నాలుగు (ఒక్కో వైపు రెండు చొప్పున) వరుసలు నిర్మించాలని భావించారు.
కానీ, ఇప్పుడు నిర్ణయం మార్చుకుని తొలుత చివరి భాగాల్లో రెండు చొప్పున నాలుగు వరుసలు నిర్మించాలని నిర్ణయించారు. భవిష్యత్‌లో భూములు ఆక్రమణకు గురయ్యే ప్రమాదం ఉంటుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.