
మూసీ పునరుజ్జీవం, ట్రిపుల్ ఆర్, ఫ్యూచర్ సిటీలతో కొత్తరూపు
హైదరాబాద్ అభివృద్ధే లక్ష్యంగా మెగా ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు శ్రీకారం
మెట్రో విస్తరణ, గ్రీన్ ఫీల్డ్ రహదారులతో కొత్త ప్రాంతాల అభివృద్ధి
అన్ని ప్రాంతాల్లోనూ మెరుగైన మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు
సాక్షి, హైదరాబాద్: అన్ని రకాల మౌలిక వసతులుంటేనే ఏ నగరమైనా త్వరగా అభివృద్ధి చెందుతుంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తోంది. దశాబ్దం క్రితం అందుబాటులోకి వచ్చిన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డులతో హైదరాబాద్ ముఖచిత్రమే మారిపోయింది. అప్పటివరకు అబిడ్స్, హిమాయత్‌నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి వాటికే పరిమితమైన రియల్‌ఎస్టేట్ మార్కెట్ నగరం నలువైపులకూ విస్తరించింది.
తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అంతకు రెట్టింపు స్థాయిలో మెగా ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. అభివృద్ధిని నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. మూసీ పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీలతో సరికొత్త నగరాలను అభివృద్ధి చేయాలని కృత నిశ్చయంతో ఉంది. ఇక, మెట్రో విస్తరణ, బందర్ పోర్ట్ టు ఫోర్త్ సిటీకి గ్రీన్ ఫీల్డ్ హైవేలతో కొత్త ప్రాంతాలలో మెరుగైన మౌలిక వసతులను కల్పించనుంది. దీంతో ఔటర్ లోపల ధరలు పెరగడంతోపాటు డిమాండ్, అభివృద్ధి ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తుంది.
⇒ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రో నగరాల్లో హైదరాబాద్ ఒకటి. నగరంలో ఏడాది పొడవునా ప్రధాన మౌలిక సదుపాయాల పనులు జరుగుతుండటంతో ఏటా స్థిరాస్తి మార్కెట్ 10 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తోంది. మౌలిక సదుపాయాలతో కనెక్టివిటీ పెరిగి, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. ప్రాపరీ్టల డిమాండ్, ఆస్తి విలువలు పెరుగుతాయి. మెరుగైన మౌలిక సదుపాయాలున్న ప్రాంతాలు నివాస, వాణిజ్య పెట్టుబడులను ఆకర్షిస్తాయి. రోడ్లు, మెట్రో, విమానాశ్రయం కనెక్టివిటీలతో ఆర్థిక కార్యకలాపాలు మెరుగవుతాయి. నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది.
గ్రీన్‌ఫీల్డ్ రోడ్లతో కొత్త ప్రాంతాల అభివృద్ధి..
బందర్ పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి గ్రీన్‌ఫీల్డ్ హైవే, శంషాబాద్ నుంచి కొడంగల్‌కు, రావిర్యాల నుంచి ఆమనగల్లుకు గ్రీన్ ఫీల్డ్ రహదారులను నిర్మించనున్నారు. ఈ గ్రీన్‌ఫీల్డ్ రోడ్లు, రహదారుల విస్తరణతో ప్రజా రవాణా మెరుగవుతుంది. కొత్త ప్రాంతాలు వెలుగులోకి వచ్చి, నివాస యోగ్యంగా అభివృద్ధి చెందుతాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రాపర్టీ కొనుగోళ్లు, ఆస్తి విలువలు పెరుగుతాయి. మెరుగైన మౌలిక సదుపాయాలతో ప్రయాణ సమయం తగ్గడంతో నివాసాలు, కార్యాలయాలు, సౌకర్యాల కోసం వలసలు పెరుగుతాయి. మెరుగైన కనెక్టివిటీతో కొత్త ప్రాంతాల్లో వ్యాపారాలు, వాణిజ్య కేంద్రాలతో స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. విద్య, వైద్యం, వినోద కేంద్రాలతో జీవన నాణ్యత మెరుగవుతుంది. శివారు ప్రాంతాలు సామాన్య, మధ్యతరగతికి పెట్టుబడి హాట్‌స్పాట్‌గా మారుతాయి.
మెట్రో: మెట్రో ఫేజ్–2లో అదనంగా 86.1 కిలోమీటర్ల మెట్రో కనెక్టివిటీని పెంచుతారు. ఇందులో ప్రధానమైనవి శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ, జేబీఎస్ నుంచి మేడ్చల్, జేబీఎస్ నుంచి శామీర్‌పేట ప్రాంతాలు. వీటితోపాటు ఎల్‌బీనగర్, రాయదుర్గం, గచ్చిబౌలి, బీహెచ్‌ఈఎల్, నాగోల్ వంటి కొత్త ప్రాంతాలనూ మెట్రో ఎక్స్‌ప్రెస్‌ను అనుసంధానించనున్నారు. దీంతో ప్రజారవాణా మరింత మెరుగవుతుంది. మెట్రో మార్గాలు ప్రధాన నగరంతో అనుసంధానమై ఉంటాయి. స్టేషన్ల చుట్టూ కొత్త నివాస, వాణిజ్య కారిడార్లకు అవకాశం కలుగుతుంది. వచ్చే మూడేళ్లలో మెట్రో కారిడార్లలో ప్రాపర్టీ ధరలు 15–25 శాతం మేర పెరుగుతాయి.
భారత్ ఫ్యూచర్ సిటీ
కాంక్రీట్ జంగిల్‌గా మారిన హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లకు తోడుగా గ్రేటర్‌లో ప్రణాళికాబద్ధమైన నాలుగో నగరం అవసరమని సీఎం రేవంత్ నిర్ణయించారు. ఇందులో భాగంగా నగరానికి దక్షిణం వైపున 814 చదరపు కిలో మీటర్లు విస్తీర్ణంలో భారత్ ఫ్యూచర్ సిటీకి శ్రీకారం చుట్టారు. 7 మండలాలు, 56 రెవెన్యూ గ్రామాల పరిధిలో విస్తరించి ఉన్న ఈ ఫోర్త్ సిటీలో ఐటీ, పారాశ్రామిక, ఆతిథ్య, పర్యాటక, క్రీడారంగాలకు పెద్దపీట వేస్తారు. కృతిమ మేథ (ఏఐ) సిటీ, స్పోర్ట్స్ సిటీ, స్కిల్ యూనివర్సిటీలతో పాటు విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు అత్యాధునిక వాణిజ్య భవనం సహా ఇంటర్నేషనల్ కన్వెన్షన్‌న్‌సెంటర్లను ఏర్పాటు చేస్తారు.
ఫోర్త్ సిటీని కేవలం ఉద్యోగ, ఉపాధి అవకాశాల కేంద్రంగానే కాకుండా అంతర్జాతీయ ఎగుమతులకు వీలుండేలా అభివద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తూర్పున శ్రీశైలం హైవే (ఎన్‌హెచ్–765) నుంచి పశి్చమాన ఉన్న నాగార్జునసాగర్ హైవే (స్టేట్ హైవే–19) వరకూ గ్రీ¯న్ ఫీల్డ్ ట్రంక్ రోడ్‌ను నిర్మిస్తారు. ఈ ప్రతిపాదిత రహదారి వయా భారత్ ఫ్యూచర్ సిటీ మీదుగా వెళుతుంది. గతంలోనే కందుకూరు నుంచి మీర్‌ఖాన్‌పేట వరకు చేపట్టిన ఈ రోడ్డు నిర్మాణ పనులను త్వరలోనే పూర్తి చేసేలా ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది.
మీర్‌ఖాన్ పేట నుంచి నంది వనపర్తి మీదుగా యాచారం మండలం కేంద్రంలోని నాగార్జునసాగర్ హైవేకు దీన్ని లింకు చేసే పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. అదే సమయంలో రావిర్యాల ఔటర్ ఎగ్జిట్ నుంచి ప్రతిపాదించి 330 అడుగుల రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రహదారి కూడా ఇక్కడి నుంచే ముందుకు సాగుతున్నందున.. ఈ ప్రాంతం అన్నింటికీ హబ్‌గా మారడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు.
రీజినల్ రింగ్ రోడ్డు: 350 కిలోమీటర్ల ఈ హైవే ప్రాజెక్టు 20 జాతీయ రహదారులతో అనుసంధానమై ఉంటుంది. షాద్‌నగర్, భువనగిరి, గజ్వేల్, సంగారెడ్డి, తూప్రాన్, చేవెళ్ల వంటి ద్వితీయ శ్రేణి పట్టణాలతో అనుసంధానమై.. ఆయా ప్రాంతాలలో వ్యాపార, ఆర్థిక కార్యకలాపాలను విస్తరిస్తుంది. ట్రిపుల్ ఆర్‌తో ప్రధాన నగరంపై ట్రాఫిక్ రద్దీని గణనీయంగా తగ్గిస్తుంది. గిడ్డంగులు, పారిశ్రామిక కారిడార్లలో పెట్టుబడులను ఆకర్షిస్తుంది. వచ్చే 3–5 ఏళ్లలో శంషాబాద్, ముచ్చర్ల, షాద్‌నగర్, ఘట్‌కేసర్, మేడ్చల్, శామీర్‌పేట వంటి ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ఆయా ఏరియాలలో ప్రాపర్టీ విలువలు 30–40 శాతం మేర పెరుగుతాయి.
మూసీ మురిసేలా..: కాలుష్య కాసారంగా మారిన మూసీనదికి పునరుజ్జీవం కల్పించాలని సీఎం రేవంత్‌రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచంలోని రివర్ సిటీ నగరాల జాబితాలో చేర్చారు. నగరంలో 55 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న మూసీ నదిని తొలి దశలో 20 కి.మీ. మేర అభివృద్ధి చేస్తారు. ఉస్మాన్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 11.5 కి.మీ., హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు ఉన్న 8.5 కి.మీ. మూసీ నదీ సుందరీకరణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
మూసీ మాస్టర్ ప్లాన్ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో అతి త్వరలోనే సుందరీకరణ పనులను ప్రారంభించనున్నారు. నదికి ఇరువైపులా అందుబాటులో ఉన్న భూమిని పూర్తిగా వినియోగంలోకి తీసుకొచ్చి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉపయోగించనున్నారు. 24/7 వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలకు అనుమతి ఇవ్వడంతోపాటు మూసీలో బోటింగ్‌తోపాటు పలు వినోద, పర్యాటక, రెస్టారెంట్లు, వాటర్ అమ్యూజ్‌మెంట్ పార్క్‌లు, క్రీడా సౌకర్యాలు, ఆతిథ్య మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు.