
భారీగా పెరిగిన ప్రాజెక్టు అంచనా వ్యయం
ఆర్‌ఆర్‌ఆర్‌ను ఆనుకొని 60 మీటర్ల వెడల్పుతో అలైన్‌మెంట్
3,600 హెక్టార్ల భూమిని సేకరించే యోచన
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డును ఆనుకొని నిర్మించాలని భావిస్తున్న ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరిగింది. తొలుత రూ. 12,408 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసిన రైల్వేశాఖ తాజాగా దాన్ని రూ. 28 వేల కోట్లకుపైగా ఖర్చవుతుందని అంచనా వేస్తూ కొత్త నివేదికను సిద్ధం చేసింది. ఇందుకోసం కొత్తగా 60 మీటర్ల వెడల్పుతో 3,600 హెక్టార్ల భూసేకరణ చేపట్టాల్సి ఉంటుందని ప్రతిపాదించింది.
రింగు రోడ్డు కంటే మీటరున్నర ఎత్తుతో నిర్మాణం...
రీజినల్ రింగురోడ్డును 5 మీటర్ల ఎత్తుతో నిర్మించనుండగా దానికి బయటి వైపు ఔటర్ రింగురైలును మరో మీటరున్నర ఎత్తుతో నిర్మించనున్నారు. అంటే భూమి నుంచి ఆరున్నర మీటర్ల ఎత్తుతో రైల్వే లైన్ నిర్మిస్తారన్నమాట. ఒకేసారి రెండు లైన్ల నిర్మాణం చేపడతారు. భవిష్యత్తులో అవసరమైతే లైన్ల సంఖ్య పెంచేలా కొంత భూమిని వదలాలని భావిస్తున్నారు. ఇందుకోసం 60 మీటర్ల వెడల్పుతో అలైన్‌మెంట్‌ను సిద్ధం చేయనున్నారు.
ఇంత ఎత్తుతో కట్ట నిర్మించాలంటే పైనుంచి భూమి వైపు వచ్చేకొద్దీ అది వాలుగా ఉంటుంది. అంటే పైన ట్రాక్ నిర్మించే భాగం కంటే, కింద భూమి వద్ద అలైన్‌మెంట్ పరిధి 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. రెండు లైన్ల ట్రాక్ నిర్మాణానికి 15 మీటర్ల స్థలం అవసరం. దాని వాలుతో కలుపుకొంటే 45 మీటర్ల భూమిని సేకరించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో అదనంగా మరో లైన్ నిర్మించేంత స్థలం కావాలంటే 60 మీటర్ల వెడల్పుతో స్థలాన్ని సేకరించాలని భావిస్తున్నారు.
ఇంటర్ ఛేంజ్ లైన్లుగా రైల్ వంతెనలు...
ఔటర్ రింగు రైలు ఆరు ప్రాంతాల్లో వివిధ మార్గాల నుంచి వచ్చే రైల్వే లైన్లను క్రాస్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆరు చోట్ల రైల్ ఓవర్ రైల్ వంతెనలు నిర్మించాలని నిర్ణయించారు. ఈ వంతెనలు ఇంటర్ ఛేంజ్ లైన్లుగా ఉంటాయి. అంటే ఆ ఆరు లైన్ల నుంచి ఔటర్ రింగ్ రైలు అనుసంధానం అవుతుంది. అటూఇటూ రైళ్లు మారేలా ఉంటాయి.
అందుకోసం క్రాసింగ్‌కు ఐదు కి.మీ. దూరం నుంచి మెట్రో రైలు తరహాలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. అలాగే 26 నుంచి 30 కొత్త స్టేషన్లను కూడా నిర్మించాల్సి ఉంది. రింగురోడ్డు ఉన్నందున స్టేషన్ భవనాలను కూడా మెట్రో రైలు తరహాలోనే నిర్మించాల్సి ఉంటుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన డిజైన్లు త్వరలో సిద్ధం చేయనున్నారు.
రోజువారీ ప్రయాణికుల సంఖ్య 9 లక్షలకు పెరిగే అవకాశం
ప్రస్తుతం హైదరాబాద్–ఇతర ప్రాంతాల మధ్య నిత్యం రైళ్ల ద్వారా 4 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఔటర రింగ్ రైల్ అందుబాటులోకి వచ్చిన ఐదారేళ్లలో ఆ సంఖ్య 9 లక్షలకు చేరుతుందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు.
అదనపు రూట్ అందుబాటులోకి రావడం, పరస్పర లైన్ల అనుసంధానం వల్ల రైళ్ల సంఖ్య కూడా భారీగా పెరగనుంది. ప్రస్తుతం హైదరాబాద్ మీదుగా నిత్యం 130 సరుకు రవాణా రైళ్లు తిరుగుతుండగా ఔటర్ రింగ్ రైలు వచ్చాక ఐదారేళ్ల కాలంలో ఆ సంఖ్య 250కి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.