విద్యా రంగ అభివృద్ధికి పీడీఎస్‌యూ పోరాటం | PDSU is struggle for the development of the education | Sakshi
Sakshi News home page

విద్యా రంగ అభివృద్ధికి పీడీఎస్‌యూ పోరాటం

Sep 23 2013 3:47 AM | Updated on Sep 1 2017 10:57 PM

విద్యా రంగాన్ని సామ్రాజ్యవాద శక్తుల నుంచి విముక్తి చేసేందుకు పీడీఎస్‌యూ పోరాటాలు నిర్వహించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర నాయకుడు ఆర్ హరిబాబు పిలుపునిచ్చారు.


 ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్:
 విద్యా రంగాన్ని సామ్రాజ్యవాద శక్తుల నుంచి విముక్తి చేసేందుకు పీడీఎస్‌యూ పోరాటాలు నిర్వహించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర నాయకుడు ఆర్ హరిబాబు పిలుపునిచ్చారు. 1974లో ఏర్పడిన పీడీఎస్‌యూ రాజీలేని పోరాటాలు నిర్వహిస్తూ విద్యార్థులకు వెన్నుదన్నుగా నిలుస్తోందని, అదే పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరారు. స్థానిక జిల్లా కార్యాలయంలో ఆదివారం ప్రారంభమైన పీడీఎస్‌యూ రాజకీయ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జార్జిరెడ్డి, జంపాల, శ్రీహరి, చేరాలు, శంకర్ వంటి విద్యార్థి నాయకుల త్యాగాలతో పీడీఎస్‌యూ ఎరుపెక్కిందన్నారు. పీడీఎస్‌యూ ఆవిర్భావం నుంచే అనేక రకాల నిర్బంధాలు, దాడులను ఎదుర్కొని ముందుకు సాగిన విషయాన్ని గుర్తు చేశారు. ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు మురళీ ‘పరిణామవాదం’ అంశంపై ప్రసంగిస్తూ మానవ నాగరికత శ్రమ జీవుల కృషి ఫలితమేనన్నారు. ప్రగతిశీల విద్యార్థులు శాస్త్రీయ విజ్ఞానంతో ఆలోచించి ముందుకు సాగాలని సూచించారు.
 
 పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి బీ పద్మ ‘పాశ్చాత్య విష సంస్కృతి-విద్యార్థుల కర్తవ్యాలు’ అనే అంశంపై ప్రసంగిస్తూ తరతరాలుగా సమాజంలో స్త్రీని రెండో తరగతి పౌరులుగానే చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో పోటీ పడుతున్నా అడుగడుగునా అత్యాచారాలు, దాడులను ఎదుర్కోవలసిన పరిస్థితి నెలకొందన్నారు. మహిళలపై దాడులకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని కోరారు. తరగతులకు రాజశేఖర్, రమేష్, జాన్ అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. తొలుత పీడీఎస్‌యూ అరుణ పతాకాన్ని జిల్లా కార్యదర్శి ఎల్ రాజశేఖర్ ఆవిష్కరించారు. అరుణోదయ కళాకారులు ఆలపించిన విప్లవ గీతాలు ఆకట్టుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement