ఆరు నెలల్లో పూర్వ వైభవం..

Past Glory For Small Industries In Six Months - Sakshi

ప్రభుత్వ ఆర్థిక చేయూతతో ఎంఎస్‌ఎంఈల్లో పనులు ప్రారంభం 

తొలి విడత రూ.28 కోట్లు విడుదల 

ప్రభుత్వ చేయూతతో పరుగులు 

కార్మికుల సమస్య అధిగమిస్తామంటున్న పరిశ్రమలు 

అసలే లాక్‌డౌన్‌.. ఆపై ఉత్పత్తులు నిలిచిపోవడం.. దానికి తోడు ఐదేళ్లుగా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు విడుదల కాకపోవడంతో చిన్న పరిశ్రమలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. లాక్‌డౌన్‌లో సడలింపు ఇచ్చినా  కోలుకోలేనంతగా కష్టాల్లో కూరుకుపోయిన ఎంఎస్‌ఎంఈలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆపన్న హస్తం అందించింది. తాళాలు వేసే స్థితికి చేరుకున్న పరిశ్రమలను రీస్టార్ట్‌ చేయించింది. ప్రోత్సాహకాలు, రాయితీలతో పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా వేస్తున్న అడుగులు సత్ఫలితాలిస్తున్నాయి. 

సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈలు) 13,548 ఉండగా.. ఇందులో నగర పరిధిలో 6,331 ఉన్నాయి. ఈ పరిశ్రమల్లో 2 లక్షల మందికి పైగా నిర్వాహకులు, ఉద్యోగులు, కార్మికులున్నారు. అప్పోసప్పో చేసి పరిశ్రమను లాగిస్తున్నా  గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌ పరిస్థితి దయనీయంగా మారిపోయింది. 2014 నుంచి 2019 వరకూ రావల్సిన పారిశ్రామిక ప్రోత్సాహకాలు,  రాయితీలేవీ విడుదల చేయకపోవడంతో జిల్లాలో  40 శాతం వరకూ పరిశ్రమలు అంపశయ్యపైకి చేరుకున్నాయి. నష్టాలతో నడుస్తున్న ఈ పరిశ్రమలకు లాక్‌డౌన్‌ శరాఘాతంలా మారిపోయింది. వీటిని గట్టెక్కించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన రీస్టార్ట్‌ ప్యాకేజీ జీవం పోసింది.

జిల్లాలో గాజువాక, ఆటోనగర్, అగనంపూడి, స్టీల్‌ప్లాంట్, పరవాడ, పెదగంట్యాడ, పెందుర్తి ప్రాంతాల్లో పలు ఎంఎస్‌ఎంఈలు నడుస్తున్నాయి. ఇంజినీరింగ్‌ లేత్‌ వర్క్, ఫ్యాబ్రికేషన్, కాస్టింగ్, మెషినింగ్, కాయిర్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలున్నాయి.   అచ్యుతాపురం, పరవాడ, గాజువాక, ఆటోనగర్, పెదగంట్యాడ, కంచరపాలెం, గంభీరం, గుర్రంపాలెం (పెందుర్తి), రాచపల్లి పారిశ్రామిక వాడల్లోనూ ఎంఎస్‌ఎంఈలు ఉన్నాయి. ఎస్‌ఎంఎంఈలకు ప్రభుత్వం ప్రకటించిన రీస్టాట్‌ ప్యాకేజీతో జిల్లాలోని పలు పరిశ్రమలకు కొత్త ఊపిరి వచ్చింది. 

779 అకౌంట్లు.. రూ.53.35 కోట్లు  
గత ప్రభుత్వ హయాంలో సబ్సిడీలు తదితర పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఎంఎస్‌ఎంఈలకు విడుదల చేయకుండా విస్మరించింది. కాని  కష్ట కాలంలోనూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సబ్సిడీ నిధుల బకాయిలను విడుదల చేసింది. దీంతో.. జిల్లాలోని 276 అకౌంట్లకు రూ.28 కోట్ల వరకూ ఈ నెల 22న అందాయి. జూన్‌ 29న 503 అకౌంట్లకు రూ.25.35 కోట్లు అందనున్నాయి.  లాక్‌డౌన్‌ కాలంలో మూడు నెలల విద్యుత్‌ బిల్లులపై స్థిర విద్యుత్తు చార్జీలు మాఫీ చేయడంతో జిల్లాలో పదివేలకు పైగా ఎంఎస్‌ఎంఈలకు మేలు జరిగింది. మూడు నెలల పాటు ఈ చార్జీలను వాయిదా వేయడం వల్ల 140 భారీ పరిశ్రమలకు కూడా   లబ్ధి చేకూరింది. ఈ నేపథ్యంలోనే పలు పరిశ్రమలు సుదీర్ఘ విరామం తర్వాత తెరుచుకున్నాయి. షిఫ్టుల వారీగా కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నారు. 

ఆరు నెలల్లో అధిగమించేలా... 
లాక్‌డౌన్‌లో నిబంధనలు సడలించినప్పటికీ.. పరిశ్రమలకు కారి్మకుల కొరత వేధిస్తోంది. ఇప్పటికే వివిధ జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన కారి్మకుల్లో 80 శాతం వరకూ తమ తమ సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో కారి్మకులు దొరకడంలేదు. సాధారణంగా మార్చి నెల తర్వాత ఆర్డర్లు ఎక్కువగా వస్తుంటాయి. కాని లాక్‌డౌన్‌తో పూర్తిగా వర్క్‌ ఆర్డర్లు నిలిచిపోయాయి. ఇప్పుడిప్పుడే ఆర్డర్లు వస్తున్నా.. ఒక్కో పరిశ్రమలో 60 శాతం వరకు కార్మికుల సంఖ్య తగ్గిపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.   ఇవన్నీ తాత్కాలికమేనని.. ప్రభుత్వం అందించిన చేయూతతో కేవలం ఆరు నెలల్లో సమస్యలన్నింటినీ అధిగమించి.. ఎంఎస్‌ఎంఈలకు పూర్వ వైభవం వస్తుందని పారిశ్రామిక వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 

కార్మికుల సమస్య తాత్కాలికమే
లాక్‌డౌన్‌లో కార్మికుల్లో చాలా మంది సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. దీంతో కార్మికుల సమస్య వేధిస్తున్నప్పటికీ ఇది తాత్కాలికమే. ఉదాహరణకు రాష్ట్రం నుంచి 2.80 లక్షల మంది కారి్మకులు వెళ్లిపోతే.. 1.80 లక్షల మంది వచ్చారు. ఈ లెక్కన చూస్తే.. కార్మికుల కొరత  కొంత మాత్రమే ఉంది. సీఎం జగన్‌ వల్ల ఆర్థిక సమస్య నుంచి ఎంఎస్‌ఎంఈలు గట్టెక్కడం సరికొత్త విప్లవమనే చెప్పాలి. 
– ములగాడ సుధీర్, ఏపీసీసీఐఎఫ్‌ చైర్మన్‌ 

పరిశ్రమలను బతికించారు.. 
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో చిన్న మధ్య తరహా పరిశ్రమల్ని బతికించారు. లాక్‌డౌన్‌ కాలంలో మూడు నెలల విద్యుత్తు బిల్లులపై స్థిర విద్యుత్తు చార్జీలు మాఫీ చేయడంతో జిల్లాలో పదివేలకు పైగా ఎంఎస్‌ఎంఈలకు మేలు జరిగింది. మూడు నెలల పాటు ఈ చార్జీలను వాయిదా వేయడం వల్ల 140 భారీ పరిశ్రమలకు కూడా దీనివల్ల లబ్ధి జరగనుంది. ముఖ్యమంత్రికి పరిశ్రమలన్నింటి తరఫునా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. 
– ఏకే బాలాజీ, ఏపీ ఛాంబర్స్‌ డైరెక్టర్‌ 

సాహసోపేత నిర్ణయం... 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిశ్రమలకు చేయూతనిచ్చేందుకు ఏ సీఎం తీసుకోని సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. నిర్వహణ మూలధన రుణాల (వర్కింగ్‌ క్యాపిటల్‌ లోన్స్‌)కు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడంతో 6 నుంచి 8 శాతం వరకూ వడ్డీతో రాష్ట్ర ఆర్థిక సంస్థ  ద్వారా రుణాలు పొందే అవకాశం కలి్పంచింది. వెబ్‌సైట్‌లో సాంకేతిక లోపాలు రెండు రోజుల్లో క్లియర్‌ అవుతాయి. ఆ తర్వాత నుంచి  రీస్టాట్‌ ప్రయోజనాల కోసం ఆన్‌లైన్‌తో దరఖాస్తు చేసుకోవచ్చు. 
– జి. సాంబశివరావు, ఏపీ చాంబర్స్‌ మాజీ అధ్యక్షుడు 

కొనుగోళ్లనూ ప్రోత్సహించడం చరిత్రాత్మకం  
ప్రభుత్వ విభాగాల అవసరాలకు ఉద్దేశించిన వస్తువుల్లో 25 శాతం ఎంఎస్‌ఎంఈల నుంచి కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల  పరిశ్రమలకు లాభం చేకూరుతుంది. త్వరితగతిన కోలుకునేందుకు అవకాశం లభిస్తుంది. 4 శాతం ఎస్‌సీ ఎస్‌టీ పరిశ్రమల నుంచి, 3 శాతం మహిళా పారిశ్రామికవేత్తలకు చెందిన పరిశ్రమల నుంచి 18 శాతం ఓపెన్‌ కేటగిరీకి చెందిన వారి పరిశ్రమల నుంచి కొనుగోలు చేస్తామని సీఎం ప్రకటించడం నిజంగా గ్రేట్‌. 
– పైడా కృష్ణప్రసాద్, ఏపీ చాంబర్స్‌ ప్రెసిడెంట్‌ (ఎలెక్ట్‌) 

ఆర్థిక వ్యవస్థకు ఎంఎస్‌ఎంఈ వెన్నెముక  
దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌ వెన్నెముక వంటిది. అందుకే  దాన్ని కాపాడేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ అందిస్తున్న ప్రోత్సాహకాలు ఎంతో బూస్టప్‌  ఇస్తాయి. బకాయిలు అందడం వల్ల  ముడి సరకు కొనుగోళ్లకు, ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు ఉపయుక్తమవుతున్నాయి. అర్హులైనవారికి రుణాలందించాలని ఆదేశించడం సీఎం ఉదారతకు ఓ ఉదాహరణ.  
– డా.కె కుమార్‌రాజా, ఏపీ చాంబర్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top