
సాక్షి, కాకినాడ రూరల్ : ఐలయ్య వ్యవహారం చూస్తే దేశ సమైక్యతకే ముప్పు తెచ్చేలా ఉందని, అటువంటి వ్యక్తిని దేశద్రోహిగా పరిగణించి ఆయన వ్యవహారాలపై విచారణ చేపట్టాలని కాకినాడ శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణానందస్వామి డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ శ్రీపీఠంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఐలయ్య వ్యవహారం హిందూ ధార్మిక వ్యవస్థనే ప్రశ్నించేలా మారిందన్నారు. రూ.లక్ష కోట్లిస్తే ఏదైనా చేస్తానంటూ ఐలయ్య టీవీ షోలో బహిరంగంగా మాట్లాడడం చూస్తే ఆయన దేశద్రోహిగా స్పష్టమవుతోందని చెప్పారు.
మతం మారిన ఐలయ్యకు ఇంకో మతాన్ని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. దసరా నవరాత్రుల అనంతరం రాష్ట్రంలోని తమ గురువులు, అనుచరులతో చర్చించి ఒక కార్యాచరణను రూపొందించి ఆ దిశగా ఆందోళన చేపట్టనున్నట్లు వివరించారు. సమావేశంలో బాచంపల్లి సంతోష్‌కుమార్‌శాస్త్రి ఉన్నారు.