చదువులహీట్‌..!

Parents Not Intrested On Jnanadhara Program - Sakshi

వేసవి సెలవుల్లో వెనుకబడిన  విద్యార్థులకు ప్రత్యేక తరగతులు

‘జ్ఞానధార’ పేరుతో కార్యక్రమం రూపొందించిన ప్రభుత్వం

ఈ నెల 7 నుంచి ప్రారంభం నిర్వహణపై భిన్నాభిప్రాయాలు

బాలికలను ప్రత్యేక హాస్టళ్లకుపంపేందుకు తల్లిదండ్రులవిముఖత

జిల్లాలో 23 వేల మంది విద్యార్థుల గుర్తింపు

ఒంగోలు, కారంచేడు: జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని వెనుకబడిన విద్యార్థులను మెరుగు పరచడం కోసం ‘జ్ఞానధార’ అనే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీని కోసం వేసివి సెలవులను ఉపయోగించుకోవాలనే ఆదేశాలు అందాయి. అయితే దీని అమలుపై సందేహాలెన్నో నెలకొన్నాయి.

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో వెనుక బడిన విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది.  5వ తరగతి చదివే వారు మొత్తం 5082 మంది ఉన్నారు. 9వ తరగతి చదివే విద్యార్థులు 17672 మంది ఉన్నట్లు అంచనా. వీరందరికీ ఈ నెల 7వ తేదీ నుంచి జూన్‌ 6వ తేదీ వరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెసిడెన్సియల్‌ పాఠశాలల ద్వారా తరగతులు నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే బాలురు, బాలికలకు ప్రత్యేకంగా భోజన, వసతి గృహాలను ఏర్పాటు చేసింది. వీరంతా వచ్చే విద్యా సంవత్సరంలో 6వ తరగతి, 10వ తరగతిలోకి ప్రవేశించనున్నారు. మిగిలిన విద్యార్థులతో పోల్చుకుంటే వీరు కొంత వెనుబడి ఉండటంతో చదవడం, రాయడంతో పాటు తోటి విద్యార్థులతో పోటీ పడేలా తయారు చేయడం ఈ కార్యక్రమ లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. గత విద్యా సంవత్సరంలో నిర్వహించిన పరీక్షల్లో సీ, డీ గ్రేడ్‌లు వచ్చిన వారిని గుర్తించిన వారిని మాత్రమే ఎంపిక చేశారు. జిల్లా వ్యాప్తంగా 68 సెంటర్లు ఎంపిక చేయగా ఆ తర్వాత 99 సెంటర్లకు పెంచారు.

ఆసక్తి చూపని తల్లిదండ్రులు..
జ్ఞానధార తరగతులకు తమ పిల్లలను పంపేందుకు వారి తల్లిదండ్రులు అంతగా ఆసక్తి కనబర్చడం లేదు. సంవత్సరమంతా చదివినా వారిలో నైపుణ్యం పెరగనప్పుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసే ఈ తరగతుల్లో ఎంత వరకు మెరుగు పడుతుందని ప్రశ్నిస్తున్నారు. వేసవిలో కూడా ఆటవిడుపు లేకుంటే ఎలా అని మరికొంతమంది ప్రశ్నిస్తున్నారు. నెల రోజుల పాటు పిల్లలను హాస్టల్‌కు పంపి ఎలా ఉండాలనుకొనే వారు కూడా ఉన్నారు. ఇలాంటి కారణాలతో ఈ కార్యక్రమం అంతగా సక్సెస్‌ కాకపోవచ్చని తల్లిదండ్రులు, అయ్యవార్లు అభిప్రాయపడుతున్నారు. అయితే పిల్లలను ప్రత్యేక తరగతులకు తీసుకువచ్చే బాధ్యత ఉపాధ్యాయులదే అని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడంతో తికమకపడుతున్నారు.

ఒక్క పర్చూరు నియోజకవర్గంలోనే 770 మంది బాలురు, 768 మంది బాలికలు కలిపి మొత్తం 1538 మంది వెనుకబడిన విద్యార్థులున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం జిల్లాలో వేడి గాలులు, ఎండలు ఎక్కువయ్యాయి. పశ్చిమ ప్రకాశంలో ఉష్ణోగ్రతలు దంచి కొడుతున్నాయి. ఇలాంటి పరిస్థి«తుల్లో విద్యార్థులకు ఏర్పాటు చేసే వసతులు ఎలా ఉంటాయో అని తల్లిదండ్రులు అందోళన చెందుతున్నారు. వారికి అవసరమైన భోజన, వసతులతో పాటు ప్రధానంగ తాగునీటి ఎద్దడి లేకుండా చూడాల్సిన అవసరం ఉందని  కోరుతున్నారు.

పగడ్బందీగా నిర్వహించాలి:
9, 14 సంవత్సరాల బాలికలను వేసవి తరగతులకు పంపడానికి తల్లిదండ్రులు సంకోచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బాలికలకు రక్షణ లేకుండా పోయింది. ఎక్కడ చూసినా చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని బాలికల తల్లులు వారిని బైటకు పంపాలంటే చాలా భయపడుతున్నారు. కార్యక్రమం సక్సెస్‌ అవ్వాలంటే వారి కోసం ఏర్పాటు చేసే రెసిడెన్సియల్‌కు పటిష్ట భద్రత ఉండాలి. బాలికల కోసం ఏర్పాటు చేసే క్యాంపస్‌లో మహిళా సిబ్బంది, ఉపాధ్యాయులనే నియమిస్తే తల్లిదండ్రులకు భరోసాగా ఉంటుంది.- రావి పద్మావతి ఉపాధ్యాయురాలు..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top