మైనర్ల చేతిలో అది ఆటంబాంబే..!

Parents Monitoring To Kids on Smart Phones Using - Sakshi

విద్యార్థుల చేతిలో స్మార్ట్‌ఫోన్‌ప్రమాదకరమంటున్న మానసిక వైద్య నిపుణులు

ఎక్కువమంది అశ్లీల దృశ్యాలు చూస్తున్నట్టు విచారణలో వెల్లడి

ఈవ్‌టీజర్లుగా మారే ప్రమాదం ఉందంటూ హెచ్చరిక

ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల నిరంతర పర్యవేక్షణ అవసరం

ఎదిగీ ఎదగని వయసులో...టీనేజీ బాలుర చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఆటంబాంబు లాంటిది. ఆటంబాంబును విశ్వమానవ కల్యాణానికి ఉపయోగించవచ్చు...ప్రపంచ వినాశనానికి వినియోగించవచ్చు. అది ఎవరిచేతిలో ఉందో వారి వారి ఆలోచనాధోరణులను బట్టి అది ఆధారపడి ఉంటుంది. అలాగే ఇప్పుడు స్మార్ట్‌ ఫోన్‌ తయారైంది. ఇది పరిపక్వత చెందని మైనర్ల చేతిలో పడితే ఎక్కువ శాతం చెడు ఫలితాలనే ఇస్తుంది. తత్ఫలితంగానే ఇటీవల జరుగుతున్న అత్యాచార ఘటనల్లో నిందితులు అధికశాతం మైనర్లే ఉంటున్నారు. దీనిదృష్ట్యా పిల్లలను సాధ్యమైనంత వరకు స్మార్ట్‌ ఫోన్‌కు దూరంగా ఉంచాలని, ఒకవేళ ఇచ్చినా పెద్దల పర్యవేక్షణ ఉండాలని మానసిక వైద్యులు సూచిస్తున్నారు.

సాక్షి, అమరావతి బ్యూరో: గతవారం విశాఖ జిల్లా కోటవురట్ల మండలం బాపిరాజు కొత్తపల్లిలో పదమూడేళ్ల బాలికపై హత్యాయత్నం జరిగింది. కేసు విచారించిన పోలీసులకు విస్తుగొలిపే నిజాలు బయటపడ్డాయి. హత్యాయత్నం చేసింది అదే గ్రామానికి చెందిన పదిహేనేళ్ల బాలుడు, ఆ అమ్మాయికి వరుసకు అన్న అవుతాడని తెలిసింది. నిందితుడైన బాలుడు పదోతరగతి పాస్‌ అవడంతో తల్లిదండ్రులు ముచ్చటపడి మొబైల్‌ కొనిచ్చారు. చేతిలో స్మార్ట్‌ఫోన్, ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ ఉండడం, పెద్దల పర్యవేక్షణ లేకపోవడంతో అశ్లీల చిత్రాలు చూడడానికి అలవాటు పడ్డాడు. కౌమార దశలో ఉన్న ఆ బాలుడిపై నీలిచిత్రాల ప్రభావంతో ఇంతటి ఘోరానికి పాల్పడ్డాడు, ప్రస్తుతం జువైనల్‌ హోంలో ఉంటున్నాడు. ఇలాంటి సంఘటనలు రాష్ట్ర  వ్యాప్తంగా ఎన్నో జరుగుతున్నాయి వాటి వెనుక ఉన్న ప్రధాన కారణం అశ్లీల దృశ్యాలే అని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈవ్‌ టీజర్లుగా మారే అవకాశం
చిన్న వయసులోనే స్మార్ట్‌ఫోన్‌లు వాడడంతో ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో కనిపించే కొన్ని అశ్లీల దృశ్యాలు పదోతరగతి నుంచి ఇంటర్, డిగ్రీ చదువుకుంటున్న విద్యార్థుల భావోద్వేగాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇటీవల మానసిక నిపుణుల బృందాలు ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్న పలువురు విద్యార్థులను వ్యక్తిగతంగా, బృందాలుగా విచారించారు. పదే పదే అశ్లీల దృశ్యాలు చూడడంతో ఈవ్‌టీజింగ్‌కు పాల్పడాలని అనిపిస్తున్నట్లు వారి సర్వేలో తేలింది. మరో వైపు వారు చూస్తున్న వీడియోల విషయం బయటపడుతుందేమోనన్న భయంతో తల్లిదండ్రులకు దూరంగా గడుపుతూ సఖ్యత తగ్గిపోతోందని తేల్చారు.

నిరంతర పర్యవేక్షణ అవసరం...
యుక్త వయసుకు వచ్చిన పిల్లలు, వారి తల్లిదండ్రుల మధ్య అనుబంధం తగ్గిపోతుందని మానసిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఉదయం ఏడు నుంచి రాత్రి 8 గంటల వరకు ఇంటి ముఖం చూడకపోవడం, పిల్లలను హాస్టళ్లలో ఉంచడంతో తల్లిదండ్రులతో అనుబంధం తగ్గిపోతోంది. ఇది పిల్లలపై మానసికంగా ప్రభావం చూపుతోంది. మరీ ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకు కావలసినంత డబ్బును ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు. వారు  చదువుతున్నారు..? ఏం చేస్తున్నారు..? ఎవరితో స్నేహం చేస్తున్నారో గమనించకుండా వదిలేస్తున్నారు. స్నేహితులతో కలిసి చదువుకుంటున్నామంటూ గది తలుపులు వేసుకొని లోపల ఉంటున్న పిల్లల వద్దకు అప్పుడప్పుడు తల్లిదండ్రులు వెళ్లి వారేం చేస్తున్నారో గమనించాలి. పుస్తకాలని, ప్రాజెక్ట్‌ వర్క్‌లని చెప్పి పేరెంట్స్‌ దగ్గర డబ్బులు తీసుకుని విందుల్లో పాల్గొంటున్నారు. పిల్లలపై ప్రేమతో కొంతమంది అతి గారాబం చేయడం వల్ల పిల్లలు అసాంఘిక శక్తులుగా తయారవుతున్నారు.

క్రీడలు ఆడించాలి...
విద్యార్థులు, యువకులను క్రీడల్లో నిమగ్నం చేయాలి. తొంభై శాతం మంది మానసికోల్లాసం లేకపోవడంతోనే చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. ఇలాంటి వ్యసనాలను ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గుర్తించి, వారిని సకాలంలో సరైన మార్గంలో పెట్టాలి. వారికిష్టమైన సాంస్కృతిక కార్యక్రమాల్లో, క్రీడల్లో పాల్గొనేలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. సమస్య తీవ్రతను బట్టి పిల్లలను మానసిక వైద్య నిపుణుల చేత కౌన్సెలింగ్‌ ఇప్పించడం మంచిది. చిన్న వయసులో ఇలాంటి వీడియోలు చూసి నేరాలకు పాల్పడుతున్న ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. ఎంతోమంది మైనర్‌ బాలురు కేసుల్లో ఇరుక్కొని జైలు ఊచలు లెక్కపెడుతున్నారు.

చదువుపై ఏకాగ్రతదెబ్బతింటుంది...
పిల్లలకు చిన్నవయసులో పోర్న్‌ చిత్రాలు చూడటం వల్ల వారి ఏకాగ్రత దెబ్బతిని చదువు దెబ్బతినే ప్రమాదముంది. వారి విలువైన భవిష్యత్తు అగమ్యగోచరంగా మారే అవకాశం ఉంది. పిల్లలకు వీలున్నంత వరకు సెల్‌ఫోన్‌ ఇవ్వకపోవడం మంచిది. ఒకవేళ ఇవ్వాల్సివస్తే అనవసర సైట్లు బ్లాక్‌ చేసి ఇవ్వడం మంచిది. తల్లిదండ్రుల నిరంతర పర్యవేక్షణ అవసరం. రాత్రి పూట పిల్లల వద్ద మొబైల్‌ ఫోన్లు ఉంచకపోవడం మంచిది. తెలిసీ తెలియని వయసులో సెక్స్‌ నాలెడ్జ్‌ లేకపోవడంతో వారు చూసిందే నిజం అని నమ్మి మోసపోయే అవకాశం ఉంది. చిన్న వయసులోనే సెక్స్‌ కోరికలు కలగడంతో అకృత్యాలకు పాల్పడుతున్నారు. ఫలితంగా కేసుల పాలై శిక్షలు అనుభవిస్తున్నారు. ఇటీవల జరుగుతున్న నేరాలకు ముఖ్య కారణం అశ్లీల చిత్రాలే.–ఇండ్ల రామసుబ్బారెడ్డి, ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు, విజయవాడ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top